Bullion Market Remains Uncertain: అనిశ్చితిలోనే బులియన్ మార్కెట్
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:43 AM
బులియన్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో ఈ వారం కూడా బంగారం, వెండి ధరల్లో మరింత దిద్దుబాటు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ‘ఈ వారం బులియన్ మార్కెట్ దృష్టి అంతా అమెరికా ద్రవ్యోల్బణ...
ఈ వారం మరింత దిద్దుబాటు!
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో ఈ వారం కూడా బంగారం, వెండి ధరల్లో మరింత దిద్దుబాటు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ‘ఈ వారం బులియన్ మార్కెట్ దృష్టి అంతా అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు, రాబోయే పరపతి విధానంపై అమెరికా ఫెడ్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలు, కీలక ఆర్థిక విషయాలకు సంబంధించి చైనా విడుదల చేసే గణాంకాలపై ఉంటుంది. కాబట్టి ఈ వారం పసిడి ధర కొద్దిగా స్థిరీకరణ లేదా మరింత దిదుబాటుకు లోనయ్యే అవకాశం ఉంది’ అని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ అండ్ కరెన్సీ విభాగం వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ చెప్పారు. గత నెలలో ఒక దశలో ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి (24 క్యారట్స్) బంగారం ధర 10 శాతం మేర నష్టపోయింది. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో ఈ వారం కూడా పసిడి ధర మరింత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ అంచనాతోనే రిటైల్ కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు.
ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ అదే ట్రెండ్
ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు డౌన్‌ట్రెండ్‌లో కనిపిస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో డిసెంబరులో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి బంగారం ధర గత వారం రూ.1,17,000-1,22,000 మధ్య ట్రేడైంది. చివరికి శుక్రవారం రూ.165 నష్టంతో రూ.1,21,067 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ ‘కామెక్స్’లో మాత్రం డిసెంబరులో డెలివరీ ఇచ్చే ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర గత వారం 13.3 డాలర్ల లాభంతో 4,009.8 డాలర్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 4,000 డాలర్లకు కొద్దిగా అటుఇటుగా ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో డిసెంబరులో డెలివరీ ఇచ్చే కిలో వెండి ధర గత వారం రూ.559 నష్టపోయి రూ.1,47,728 వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1.5 లక్షలోపు ట్రేడ్ అయినంత వరకు రూ.1,39,300-1,38,000 స్థాయిలను కీలక మద్దతు ధరగా చూడాలని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రీసెర్చ్ అనలిస్ట్ రియా సింగ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి