Artha Global: ఫినిక్స్ ట్రైటాన్‌లో అర్థ గ్లోబల్ రూ.700 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jul 05 , 2025 | 02:56 AM
హైదరాబాద్‌లోని ఫినిక్స్ ట్రైటాన్ కమర్షియల్ రియల్టీ ప్రాజెక్ట్‌లో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అర్థ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ వెల్లడించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లోని ఫినిక్స్ ట్రైటాన్ కమర్షియల్ రియల్టీ ప్రాజెక్ట్‌లో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అర్థ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ వెల్లడించింది. ఫినిక్స్ ఈ నిధులను ప్రాజెక్ట్ పూర్తి చేయటానికి వినియోగించనుంది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ కేంద్రంగా పని చేస్తున్న రూ.5,000 కోట్ల కేటగిరీ 3 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఏఐఎఫ్) అయిన అర్థ గ్లోబల్ దేశంలో పెట్టిన తొలి పెట్టుబడి ఇది.
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 3.15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 28 లక్షల చదరపు అడుగుల ఈ ప్రాజెక్టుకు నాలుగేళ్ల కాలపరిమితి గల నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్ల (ఎస్‌సీడీ) రూపంలో ఈ నిధులు అందించింది. నేరుగా ప్రాజెక్టు అమ్మకాలతో అనుసంధానమైన వేరియబుల్ రిటర్న్ నమూనాలో ఈ పెట్టుబడి ఉంటుంది. దీనివల్ల డెవలపర్‌పై నగదుపరమైన ఒత్తిడులుండవు. ఇన్వెస్టర్లకు కూడా ఆకర్షణీయమైన రాబడి లభిస్తుందని అర్థ భారత్ ఇన్వె్‌స్టమెంట్ మేనేజర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ సచిన్ సావ్రికర్ అన్నారు.