Share News

GMR Aero Technic: జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌తో ఆకాశ ఎయిర్‌ ఒప్పందం

ABN , Publish Date - Jul 08 , 2025 | 03:46 AM

జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌తో ఆకాశ ఎయిర్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

GMR Aero Technic: జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌తో ఆకాశ ఎయిర్‌ ఒప్పందం

  • బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలకు నిర్వహణ సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌తో ఆకాశ ఎయిర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆకాశ ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలకు బేస్‌ మెయింటెనెన్స్‌ సేవలను అందించనున్నట్లు మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాలింగ్‌ (ఏంఆర్‌ఓ) సేవల సంస్థ జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ వెల్లడించింది. మూడేళ్ల పాటు ఈ సేవలందించేందుకు గాను ఆకాశ ఎయిర్‌తో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ తెలిపింది. హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఏరోస్పేస్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో ఉన్న తమ అత్యాధునిక ఎంఆర్‌ఓ కేంద్రంలో ఈ సేవలను అందించనున్నట్టు జీఎంఆర్‌ తెలిపింది. దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలకు విశ్వసనీయ భాగస్వామిగా పెరుగుతున్న తమ స్థానానికి ఇది దర్పణమని జీఎంఆర్‌ ఏరోటెక్నిక్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ గోపీనాథ్‌ అన్నారు. తమ సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణా సామర్థ్యం, కస్టమర్‌ ప్రధాన వైఖరికి ఇది ఒక పరీక్ష అని పేర్కొన్నారు. విమానాల భద్రత, విశ్వసనీయతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని, జీఎంఆర్‌ ఏరోటెక్నిక్‌తో తమ భాగస్వామ్యం దీన్ని మరింత సుస్థిరం చేస్తుందని ఆకాశ ఎయిర్‌ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీస్‌ బెల్సన్‌ కోటిన్హో అన్నారు. 2022లో ప్రారంభమైన ఆకాశ ఎయిర్‌ ప్రస్తుతం 23 దేశీయ, 5 అంతర్జాతీయ గమ్యాలకు సర్వీసులు నడుపుతోంది. లీప్‌-1బీ ఇంజన్లతో కూడిన 226 బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలకు ఆర్డర్లు జారీ చేసింది.

Updated Date - Jul 08 , 2025 | 03:47 AM