AI Proof Jobs: ఏఐ ముప్పు లేని జాబ్స్ ఇవే
ABN , Publish Date - Jun 17 , 2025 | 10:37 PM
అన్ని రంగాల్లో ఏఐ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే టెక్ రంగంలో ఏఐ కలకలం రేపుతోంది. అయితే, కొన్ని రంగాల్లో వారికి ఏఐతో ఎలాంటి ముప్పూ లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ జాబ్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కృత్రిమ మేథ రాకతో పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అనేక రంగాల్లో ఉద్యోగ స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. పది మంది ఉద్యోగులు చేయగలిగిన పనులను క్షణాల్లో ఏఐ చక్కబెట్టేస్తోంది. యంత్రాలు తమంతట తాముగా పనులు చక్కబెట్టే ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రంగాల ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అయితే, కొన్ని రకాల జాబ్స్‌కు ఏఐతో ముప్పు లేదని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
న్యాయవృత్తి అంటే చట్టాలను అర్థం చేసుకోవడం, నిర్వచించడం మాత్రమే కాదు. చట్టాలను చాకచక్యంగా పరిస్థితులకు అన్వయించడం లాయర్ల బాధ్యత. ఈ క్రమంలో కేసు నేపథ్యం, సమాజంపై పడే ప్రభావం, నైతికత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏఐకి సాధ్యం కాదు. మనుషుల భావోద్వేగాలను ప్రభావితం చేయడం, తర్కం వంటి నైపుణ్యాలు ఎప్పటికీ అవసరమే
వైద్యం కేవలం సైన్స్ మాత్రమే కాదు అది సర్వీస్ కూడా. ఏఐ టూల్స్‌తో రోగ నిర్ధారణ వేగంగా జరిగినప్పటికీ వైద్యం అందించడంలో మనిషి పాత్ర, భావోద్వేగాలు ఎంతో కీలకం. రోగుల భావోద్వేగాలను , అవసరాలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం కేవలం మనుషులకు మాత్రమే సాధ్యమవుతుంది.
కంప్యూటర్‌లకు కోడ్ ఉంటుందేమో కానీ మనుషులకు ఎలాంటి కోడ్ ఉండదు. కాబట్టి, మనుషుల మధ్య భేదాభిప్రాయాలు, వివాదాలు పరిష్కరించడంలో కీలకమైన హెచ్‌ఆర్ విభాగం బాధ్యతలు ఏఐకి మించినవి. పరస్పర నమ్మకం, గోప్యత, అవతలి వారి ఇబ్బందిని అర్థం చేసుకునే సున్నితత్వం వంటి నైపుణ్యాలకు ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు.
కావాల్సిన సమాచారాన్ని కళ్లముందు ఉంచడంలో ఏఐకి మించినది లేదు. కానీ విద్యార్థి మేథోశక్తి, సామర్థ్యాలను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా విద్యాబోధన చేసే టీచర్లు, ఎడ్యుకేటర్లకు ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు. మనుషుల మధ్య బంధాలను పెంపొందించడంలో క్లాస్ రూం వాతావరణానికి మించినది మరొకటి లేదు.
నేటి జమానాలో మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ఫలితంగా కౌన్సిలర్లు, సైకాలజిస్టుల ప్రాముఖ్యత గతంతో పోలిస్తే పెరిగింది. కౌన్సెలింగ్‌కు వచ్చేవారి బాధలు, ఆవేదనలను అర్థం చేసుకోవడం, వ్యక్తిగత విషయాల్లో సున్నితత్వంతో వ్యవహరించడం, మానసిక గాయాల నుంచి కోలుకునేలా చేయడం వంటి క్లిష్టమైన విధులు కౌన్సిలర్లు, సైకాలజిస్టులు నిర్వహిస్తారు. భావోద్వేగాలతో ముడిపడిన ఈ విషయాల్లో మనుషులకు ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు.
ఏఐతో ఎలాంటి కంటెంట్‌ను అయినా క్రియేట్ చేయొచ్చు. అయితే, ఇలాంటి రచనా వ్యాసంగానికి సృజనాత్మకత జోడించడంలో మానవ మేధకు ఏఐ సాటి రాలేదు. పరిస్థితులను భిన్న కోణాల్లో విశ్లేషిస్తూ మానవత్వం, భావోద్వేగాన్ని జోడిస్తూ జర్నలిస్టులు చేసే కృషికి కూడా ఏఐ సాటి రాదు. కథ, కథనంలో నవ్యతను జోడించడంలో మనిషిని ఏఐ ఎప్పటికీ అధిగమించలేదని కూడా కొందరు చెబుతున్నారు.
కఠిన పరిస్థితులను ఎదుర్కునే వారికి మానసిక అండదండలు అందించే సోషల్ వర్కర్లు, కస్టమర్లు మాటల్లో చెప్పలేని భావాలను కూడా కళ్లముందు నిలపగలిగే డిజైనర్లు, విజువల్ ఆర్టిస్టులు, తమ దార్శనికతతో ఇతరుల్లో స్ఫూర్తిని నింపే నాయకులు వంటి వారిని కూడా ఏఐతో భర్తీ చేయడం కష్టం. ఇక ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, ఇతర వృత్తుల వారందరూ ఏఐ ధాటిని తట్టుకుని నిలబడగలరన్న విశ్వాసాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి