ఐదేళ్లలో రూ 8 60 లక్షల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:06 AM
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ వ్యాపారాల భవిష్యత్ వృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో 10,000 కోట్ల డాలర్ల (రూ.8.60 లక్షల కోట్లు)వరకు పెట్టుబడులు పెట్టనుంది. ఏటా...
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ వ్యాపారాల భవిష్యత్ వృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో 10,000 కోట్ల డాలర్ల (రూ.8.60 లక్షల కోట్లు)వరకు పెట్టుబడులు పెట్టనుంది. ఏటా 1,500- 2,000 కోట్ల డాలర్ల (రూ.1.29-1.72 లక్ష ల కోట్లు) చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నట్లు గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మంగళవారం దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన గ్రూప్ షేర్‌హోల్డర్ల వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన వెల్లడించారు.
మరిన్ని విషయాలు..
గత ఆర్థిక సంవత్సరం అదానీ గ్రూప్ ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం వృద్ధితో రూ.2,71,664 కోట్లకు పెరగగా.. ఎబిటా 8.2 శాతం వృద్ధితో రూ.89,806 కోట్లుగా నమోదైంది. ఈ రికార్డు రాబడులను వ్యాపారాల విస్తరణకు ఉపయోగిస్తాం.
అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్‌ను నిర్మిస్తోంది. ఇది అంతరిక్షంలో నుంచి చూసినా కనిపించేంత పెద్దది. 2030 నాటికి మొత్తం 100 గిగావాట్ల థర్మల్, రెన్యువబుల్, జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం.
నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌ను ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుంది. తొలుత 2 కోట్ల వార్షిక ప్రయాణికుల సామర్థ్యంలో కార్యకలాపాలను ప్రారంభిస్తాం. సామర్థ్యాన్ని క్రమంగా 9 కోట్లకు పెంచుతాం.
ఆపరేషన్ సిందూర్‌లో మా డ్రోన్లది కీలకపాత్ర
తమ గ్రూప్ తయారు చేసిన డ్రోన్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలు ఆపరేషన్ సిందూర్‌లో ముఖ్య భూమికను పోషించాయని అదానీ పేర్కొన్నారు. అదానీ డిఫెన్స్ ఉత్పత్తి చేసిన మందుగుండు సామాగ్రి పాకిస్థాన్‌లోని లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులకు ఉపయోగపడగా.. కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ పాకిస్థాన్ దాడుల నుంచి మన ఆస్తులను రక్షించేందుకు దోహదపడ్డాయన్నారు. మా డ్రోన్లు భారత్‌కు ఆకాశంలో నిఘా నేత్రాలుగా, దాడి కత్తుల్లా పనిచేశాయని.. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మన రక్షణ దళాలతోపాటు పౌరులను కాపాడేందుకు తోడ్పడ్డాయన్నారు.
ముంబై ఎయిర్‌పోర్ట్ కోసం
రూ.8,600 కోట్ల సమీకరణ
ముంబై విమానాశ్రయం కోసం అదానీ గ్రూప్ 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8,600 కోట్లు) నిధులు సమీకరించింది. ఈ ఎయిర్‌పోర్టు 2022లో తీసుకున్న రుణాల రీఫైనాన్సింగ్ కోసం అమెరికా చెందిన అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ సహా పలు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను సేకరించింది.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి