Share News

AP CM Chandrababu: రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:46 AM

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రౌడీయిజం చేసేవారిని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు.

AP CM Chandrababu: రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే

  • రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే ఊరుకోం: సీఎం

  • తిరుపతిలో నూతన పోలీస్‌ కార్యాలయం ప్రారంభించిన చంద్రబాబు

తిరుపతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రౌడీయిజం చేసేవారిని రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయ భవన సముదాయాన్ని చంద్రబాబు ప్రారంభించి మాట్లాడారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే ఊరుకునేది లేదని, సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారినైనా సరే జైలుకు పంపించిన చరిత్ర తమదన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీశారని మండిపడ్డారు. రోడ్లు బ్లాక్‌ చేయడం, రప్పారప్పాలాడించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి కాయలు తొక్కించారని, గుంటూరులో ఓ వ్యక్తిని కాన్వాయ్‌ కింద తొక్కించి పొదల్లో పడేసి పోయారని ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అసభ్య పోస్టులు పెట్టే వారిపై ప్రభుత్వం నిఘా ఉంచిందన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 03:47 AM