YSRCP Land Scam: సరిదిద్దలేని దందా
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:42 AM
అది కాకినాడలోని సూర్యారావుపేట ప్రాంతం! బీచ్‌తోపాటు పలు పరిశ్రమలు అక్కడే ఉన్నాయి. వైసీపీ హయాంలో రకరకాల అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న... నోటి దురుసు నేతగా పేరున్న ఒక నాయకుడి కన్ను అక్కడి భూములపై పడింది!
కాకినాడలో వైసీపీ నేత భూదోపిడీ
కోట్ల విలువైన భూమిపై కన్ను
కలెక్టరేట్‌లోని రికార్డులే మార్చేశారు
సామాన్యుల పట్టా భూములు నొక్కేశారు
అసలు యజమానుల స్థానంలో బినామీల పేర్లు
నాడే నిర్ధారించిన జాయింట్ కలెక్టర్
నేడూ ప్రభుత్వ పెద్దలకు బాధితుల ఫిర్యాదు
‘దిద్దుడు’ నిర్ధారించినా చర్యలు శూన్యం
అండగా టీడీపీ నేత, ఆయన కుమారుడు
వైసీపీ హయాంలో జరిగిన భూదోపిడీ స్థాయికి ఇదో మచ్చు తునక! అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాల్పడిన అరాచకాలకు మరో నిదర్శనం! ప్రభుత్వ భూములను స్వాహా చేయడం మాత్రమే కాదు... ఇతరులకు చెందిన భూముల రికార్డులనూ తారుమారు చేసి బొక్కేశారు! కాకినాడలో ఒక కీలక నేత కోట్ల విలువైన భూమిని సొంతానికి ‘రాసేసుకున్నారు’! విచిత్రమేమిటంటే... ఈ తప్పును అప్పుడు సరిదిద్దలేదు. ఇప్పుడూ... సరిదిద్దలేక పోతున్నారు!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అది కాకినాడలోని సూర్యారావుపేట ప్రాంతం! బీచ్‌తోపాటు పలు పరిశ్రమలు అక్కడే ఉన్నాయి. వైసీపీ హయాంలో రకరకాల అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న... నోటి దురుసు నేతగా పేరున్న ఒక నాయకుడి కన్ను అక్కడి భూములపై పడింది! అవేమీ... ప్రభుత్వ, పోరంబోకు భూములు కావు! పక్కాగా... పట్టా భూములు! బహిరంగ విలువ పక్కనపెడితే... రిజిస్ట్రేషన్ విలువ కోట్లలో ఉంది. వాటి యాజమాన్య పత్రాలు ట్యాంపర్ (తారుమారు) చేసేసి... ఆ భూములను ఎంచక్కా నొక్కేశారు. నిజానికి... సదరు వైసీపీ కీలక నేత సూర్యారావుపేటలో తన బినామీ పేరిట రెండున్నర ఎకరాల భూమిని దక్కించుకున్నారు. అంతటితో ఆయన ఆశ తీరలేదు. ఆ భూమి చుట్టూ... నాలుగు సర్వే నంబర్ల పరిధిలో ఉన్న మరో 9 ఎకరాలపైనా ఆయన కన్నుపడింది. నయానో, భయానో ఆ భూమి దక్కించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో... భారీ అక్రమానికి తెరలేపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఫెయిర్ అడంగల్‌లోనే హక్కుల దారుల జాబితా నుంచి వారి పేర్లు తొలగించి ఘరానా భూ దందాకు తెరతీశారు. తన సొంత మనుషులు, అనుచరులనే ‘యజమానులు’గా చేరుస్తూ ఆర్ ఎస్‌ఆర్‌ను తమకు ఇష్టం వచ్చినట్లుగా మార్చుకున్నారు. జగన్ ప్రభుత్వంలో ఆయన కీలక ప్రజాప్రతినిధిగా ఉండటంతో అధికార యంత్రాంగాన్ని కనుసైగతో శాసించారు. ఏకంగా కలెక్టరేట్‌లోని రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎ్‌సఆర్)లో ఫెయిర్ అడంగల్‌లో ఉన్న భూమి రికార్డులను మార్చేశారు. సర్వే నంబరు 195-1లో అసలు హక్కుదారు పేరును చెరిపేసి... దానిపైనే తన ముఖ్య అనుచ రుడి పేరు రాయించారు. 195-3 సర్వే నంబరు భూమి హక్కుదారుగా మరో అనుచరుడి పేరు రాయించారు. ఇలా పలు భూముల అసలు యజమానులను పేర్లను చెరిపివేసి... తమ సొంత మనుషుల పేర్లు రాయించారు. ఇది ఫోర్జరీ తరహాలో నైపుణ్యంతో చేసిన పని కూడా కాదు. పక్కాగా నాటు పద్ధతిలో ఒకపేరు చెరిపివేసి, మరోపేరు రాసినట్లుగా చూడగానే అర్థమవుతుంది.
అప్పుడే నిర్ధారించినా...
భూమి పత్రాల తారుమారుపై జగన్ హయాంలోనే జిల్లా జాయింట్ కలెక్టర్ నివేదిక ఇచ్చారు. కానీ... అప్పటి ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ అధికారులు దీనిని కప్పిపెట్టారు. బాధితులూ భయంతో నోరెత్తలేదు. ఇప్పుడు... కూటమి సర్కారు రావడంతో ధైర్యంగా ముందుకొచ్చి తమ భూములను కాపాడాలని మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం మరోసారి సమగ్ర విచారణ చేయించింది. భూ దందా నిర్ధారణ అయింది. ఎలాంటి వివాదం లేని భూముల రికార్డులను తారుమారు చేయడం తీవ్రమైన నేరం. భూములను వివాదంలో పెట్టి వాటి అసలు హక్కుదారులను భయభ్రాంతులకు గురిచేసి బలవంతపు సెటిల్‌మెంట్ చేయించుకోవాలన్నది ఆ నేత అసలు లక్ష్యం. అందుకే తన అధికారాన్ని అడ్డంపెట్టుకొని రికార్డులను మార్చేశారు.
ఇదెలా సాధ్యపడింది?
భూముల రికార్డులు చాలా పదిలంగా ఉండాలి. అప్పుడే హక్కుదారులకు రక్షణ ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం మూడు సెట్ల రికార్డులు నిర్వహిస్తుంది. ఒక రికార్డు తహశీల్దార్ ఆఫీసులో, మరొకటి జిల్లా సహాయ సర్వే సెటిల్‌మెంట్ అధికారి (ఏడీ) కార్యాలయంలో ఉంటుంది. మూడో సెట్ రికార్డు కలెక్టర్ కార్యాలయంలో ఉంటుంది. వీటిలో... కలెక్టరేట్‌లోని రికార్డే భూములకు ప్రధాన రక్షణగా ఉంటుంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓల అనుమతి లేకుండా ఆ రికార్డులను ఎవరూ ముట్టుకోవడానికి వీల్లేదు. అంటే... అది సూపర్ సెక్యూరిటీలో ఉండే రికార్డు. అలాంటి రికార్డునే వైసీపీ నేత ఈజీగా మార్చేయడం గమనార్హం.
పేదల ఫిర్యాదుతో...
రికార్డులు మార్చేసిన తర్వాత... ఆ భూములను భౌతికంగా దక్కించుకునేందుకు వైసీపీ నేత ప్రయత్నించారు. దీంతో వాటి అసలు యజమానులు... నాటి సీసీఎల్‌ఏ సాయిప్రసాద్‌ను ఆశ్రయించారు. కబ్జాదారుల కోరల నుంచి తమ భూములు కాపాడాలని వేడుకున్నారు. ఆ ఫిర్యాదుపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని 2023 నవంబరులో సీసీఎల్‌ఏ ఆదేశించారు. అప్పటి కాకినాడ జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి... కలెక్టరేట్‌లో ఉన్న ఫెయిర్ అడంగల్‌ను మార్చేశారని నిగ్గు తేల్చుతూ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను రెవెన్యూ శాఖ ఆదేశించింది. అంటే... శాఖాపరమైన విచారణతోపాటు, రికార్డుల తారుమారుపై పోలీసు కేసూ నమోదు చేయాలి. కానీ... ఇవేవీ జరగలేదు. ఎందుకంటే, గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన అంత శక్తిమంతుడు! దీంతో... అధికారులెవరూ ఆయనను టచ్ చేయలేకపోయారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక...
ఫోర్జరీకి గురైన రికార్డులను చక్కదిద్దామని, హక్కుదారుల ప్రయోజనాలు కాపాడామని అధికారులు నాడు సీసీఎల్‌ఏకు నివేదించారు. కానీ... ఇది ఆచరణలోకి రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ రికార్డులను సరిదిద్దలేదు. ఆ భూములను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో... బాధితులు తమ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించాలని వారు ఆదేశించడంతో...‘ట్యాంపరింగ్ నిజమే’నని అధికారులు స్పష్టంచేశారు. కానీ...చర్యలు శూన్యం.
కాపాడుతున్నదెవరు?
జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతల భూదందాలు, కబ్జాలపై నాటి ప్రతిపక్ష, టీడీపీ, జనసేనలు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద పోరాటాలు చేశాయి. అధికారంలోకి వచ్చాక... చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ... కాకినాడలో వైసీపీ కీలక నేత చేసిన భూదందా జోలికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం! దీనికి కారణాలేమిటని ఆరా తీయగా... అదే జిల్లాకు చెందిన కీలక టీడీపీ నేత, ఆయన కుమారుడు సదరు వైసీపీ నేతతో అంటకాగుతున్నట్లు తెలిసింది. ఆయన్ను టచ్ చేయడానికి వీల్లేదని, ఆ భూముల జోలికి వెళ్లవద్దని ఈ తండ్రీ కొడుకులు ఒత్తిళ్లు చేస్తున్నారు. దీంతో తమకు న్యాయం ఎలా జరుగుతుందంటూ బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.