Rajamahendravaram: రాజమండ్రి జైలులో వైసీపీ రాజ్యాంగం
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:12 AM
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లోపల, వెలుపల వైసీపీ రాజ్యాంగం నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మిథున్‌రెడ్డికి ఒక్క రోజే 2 ములాఖత్‌లు.. తొలుత పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల
తర్వాత జక్కంపూడి రాజా, లాయర్ హుస్సేన్.. కోరిందే తడవుగా సౌకర్యాలు
వైసీపీ ఎంపీకి జైలు అధికారుల రాచమర్యాదలు
నాడు చంద్రబాబుతో ములాఖత్‌లకు ముప్పుతిప్పలు
టీడీపీ నేతలను సమీపానికే రానివ్వని అధికారులు
ఇప్పుడు జైలు పరిసరాల్లో గుంపులుగా వైసీపీ కార్యకర్తలు
రాజమహేంద్రవరం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు లోపల, వెలుపల వైసీపీ రాజ్యాంగం నడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో ములాఖత్‌లకే ముప్పుతిప్పలు పెట్టారు. జైలు పరిసరాల్లోకి టీడీపీ నేతలను అనుమతించనేలేదు. మరిప్పుడో.. మద్యం స్కాంలో జైల్లో ఉన్న ఏ-4, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సెంట్రల్ జైలు అధికారులు రాచమర్యాదలు చేస్తున్నారు. అడిగింది లేదనకుండా.. కోరింది కాదనకుండా సెల్యూ ట్ చేసి మరీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. రిమాండ్‌లో ఉన్న నిందితుడికి రోజుకు ఒకసారి ములాఖత్ అంటేనే కష్టం. కానీ మిథున్‌రెడ్డి 2 సార్లు తీసుకుంటున్నారు.
అంతేకాదు.. సెంట్రల్ జైలు ప్రధాన గేటు ఎదుట వైసీపీ నాయకులు, శ్రేణులు గుంపులు గుంపులుగా గుమిగూడి.. హంగామా చేస్తు న్నా కనీస చర్యలు లేవు. మిథున్‌రెడ్డిని మంగళవారం ఆయన తండ్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్‌లో కలిశారు. ఆయన వెంట ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే జక్కం పూడి రాజా ఉన్నారు. సాధారణంగా ములాఖత్‌కు ముగ్గురికే అనుమతి ఉంది. ప్రధాన గేటు గుండా పెద్దిరెడ్డి, తలశిల, రాజా కలిసి సెంట్రల్ జైలు ఆవరణ నుంచి జైలు గుమ్మం వరకూ వెళ్లారు. వారిని నల్లకోటు లేని న్యాయవాది హుస్సేన్ కూడా అనుసరించారు. ఆయన్ను పోలీసులు గానీ, సెంట్రల్ జైలు అధికారులు గానీ ఆపలేదు. తర్వాత పెద్దిరెడ్డి, తలశిల కలిసి ముందుగా మిథున్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. జక్కంపూడి రాజాను తీసుకువెళ్లలేదు.
వారు వచ్చేసిన తర్వాత రాజా ప్రత్యేకంగా మిథున్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. ఆయనతో హుస్సేన్ కూడా వెళ్లారు. వారు వచ్చేవరకూ పెద్దిరెడ్డి, తలశిల జైలు ప్రధాన ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. మిథున్‌రెడ్డికి రోజుకు ఒకే ములాఖత్‌కు అనుమతి ఉండగా.. జైలు అధికారులు రెండింటికి ఎలా అనుమతించారు? వాస్తవానికి ములాఖత్‌కు వెళ్లడానికి ముగ్గురికి అనుమతి ఉంది. కానీ ఎందుకో పెద్దిరెడ్డి తన వెంట తలశిలను మాత్రమే తీసుకెళ్లి.. జక్కంపూడి రాజాను బయటే ఉంచారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోగా.. జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ వంగా గీత విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ జైలు వెలుపల ప్రధాన రోడ్డు మీద మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణు, విశ్వరూప్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, పార్టీ నేతలు మార్గాని నాగేశ్వరరావు, మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Vijayawada Durga Temple:రూ.500 దర్శనం రద్దు చేద్దామా?
Arizona Plane Crashe : అరిజోనాలో కూలిన వైద్య రవాణా విమానం.. నలుగురు మృతి