Share News

Yoga Andhra: ఉప్పొంగిన యోగసంద్రం

ABN , Publish Date - Jun 22 , 2025 | 05:14 AM

శనివారం ‘అంతర్జాతీయ యోగా దినోత్సవ’ వేడుక సంరంభంగా జరిగింది. ప్రధాని మోదీ పాల్గొన్న ప్రధాన కార్యక్రమం విశాఖలో ఆహ్లాదకర వాతావరణంలో అట్టహాసంగా సాగింది

Yoga Andhra: ఉప్పొంగిన యోగసంద్రం

విశాఖ తీరాన వేడుక

  • నెలరోజుల ముందే పక్కా ప్రణాళిక

  • సమన్వయంతో కదిలిన సమస్త శాఖలు

  • మంత్రులు, ఉన్నతాధికారులు ఇక్కడే బస

  • నలుమూలల నుంచి బస్సుల సేకరణ

  • జన సమీకరణలో కనిపించిన ఎమ్మెల్యేల శ్రద్ధ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఒకవైపు ప్రశాంతంగా నీలి సముద్రం మరోవైపు ఉప్పొంగిన జన సముద్రం. ఇదీ శనివారం ఉదయం విశాఖలో పరిస్థితి. పక్కా ప్రణాళిక నెల రోజుల శ్రమ సమష్టి కృషి యోగాంధ్రను సూపర్‌ సక్సెస్‌ చేశాయి. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అత్యధికులతో యోగాసానాలు వేయించి గిన్నిస్‌ రికార్డు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రధాని నరేంద్రమోదీ కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మూడు లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు నెల రోజుల ముందు ప్రణాళిక అందించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయుష్‌విభాగం నేతృత్వంలో పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారిగా స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ తిరుమల కృష్ణబాబుకు బాధ్యతలు అప్పగించింది. అమరావతిలో సీనియన్‌ ఐఏఎస్‌ అధికారులు వీరపాండ్యన్‌, మల్లికార్జున, రామసుబ్బారెడ్డి, కూర్మనాథ్‌, గోపాలకృష్ణ, గోవిందరావులను విశాఖపట్నం పంపించింది.


వీరంతా అప్పుడప్పుడు వస్తూ చివరివారం రోజులు మాత్రం ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పది రోజుల ముందు కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ జాయింట్‌ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, ఐటీడీఏ పీవోలకు యోగాంధ్ర డ్యూటీ వేశారు. వారు కూడా ఇక్కడే ఉండి విధులు నిర్వహించారు. పోలీసులు, ఇతర అధికారులు అంతా కలిసి మొత్తం 25 వేల మంది బాధ్యతలు నిర్వర్తించారు. ఈ కార్యక్రమానికి ముందుగా రూ.60 కోట్ల వ్యయం అనుకున్నా చివరకు రూ.75 కోట్లు అయిందని చంద్రబాబు వెల్లడించారు. యోగాంధ్ర వంద శాతం విజయవంతం కావాలని సీఎం ఆదేశించడంతో రాష్ట్ర మంత్రులు అంతా విశాఖపట్నంలోనే మకాం వేశారు. ఇన్‌చార్జి మంత్రి వీరాంజనేయస్వామి, అనిత, బీసీ జనార్దన్‌ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, అచ్చెన్నాయుడు, నారాయణ ఎవరికి వారు సమీక్షలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఐదు రోజుల ముందు విశాఖపట్నం వచ్చి సమీక్షించారు.


కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ సుమారు 30 కిలోమీటర్ల పొడవున 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటుచేశారు. 3.26 లక్షల మంది ఈ కార్యక్రమంలో ఆసనాలు వేసేందుకువీలుగా రోడ్డుపై పచ్చ తివాచీ పరిచారు. పర్యవేక్షణ కోసం బీచ్‌ రోడ్డులో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటుచేశారు. సీసీ టీవీ కెమెరాలు 2,500కు పైగా ఈ మార్గంలో అమర్చారు. జనసమీకరణకు పది వేల బస్సులను సమీకరించారు. వర్షాకాలం కావడంతో అనుకోని విధంగా వర్షం పడితే కార్యక్రమం రద్దు కాకుండా ఉండేందుకు ప్లాన్‌ బీ కూడా సిద్ధం చేసుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానాన్ని దీనికోసం సిద్ధం చేసి... టెంట్లు వేశారు. వరుణుడు కరుణించడంతో శుక్రవారం సాయంత్రమే 25వేల గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు. శనివారం ఉదయం వర్షం లేకపోవడంతో బీచ్‌ రోడ్డులో కార్యక్రమమూ నిర్విఘ్నంగా సాగింది.


కలిసొచ్చిన కలెక్టరు కృషి..

విశాఖ జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ అందరినీ సమస్వయం చేసుకుంటూ సీఎంఓ నుంచి సూచనలు తీసుకుంటూ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషిచేశారు. తొట్లకొండపై ప్రత్యేక కార్యక్రమం పెట్టి బౌద్ధులను ఆహ్వానించారు. వచ్చిన వారందరికీ యోగాంధ్ర టీ షర్టులు, ఆసనం వేయడానికి అవసరమైన యోగా మ్యాట్లు అందించారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ కోసం బీచ్‌ రోడ్డును విశాఖ నుంచి భీమిలి వరకూ గల బీచ్‌రోడ్డును మూడు రోజుల ముందే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు. బీచ్‌ రోడ్డులో రాకపోకలు నిషేధించారు. దాంతో అటు వైపు వెళ్లేవారంతా జాతీయ రహదారిపైకి మళ్లడంతో ఒకరోజు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీనిపై తీవ్రస్థాయిలో నగర ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. దాంతో పోలీసు అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించుకొని పదివేలబస్సులు రోడ్డుపైకి వచ్చినా ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.


ప్రజాప్రతినిధుల ఉత్సాహం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, కేంద్ర మంత్రులు ప్రతాప్‌రావు జాదవ్‌, రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, శ్రీభరత్‌ వేదికపై ఆశీనులయ్యారు. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌, డోలా బాలవీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్‌ రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిందన రెండో కంపార్టుమెంట్‌లో కూర్చొని ఆసనాలు వేశారు. విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు తమ నియోజకవర్గాల ప్రజలతో కలిసి కేటాయించిన కంపార్టుమెంట్లలో ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా పోస్టల్‌ స్టాంపు విడుదల చేశారు.


తెల్లవారు జామున రెండు గంటల నుంచే...

విశాఖలో ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ ప్రజల కోసం 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేసి ఒక్కో దాంట్లో వేయి మందిని అనుమతించారు. అయితే, అంచనాకు మించి అధికంగా జనం రావడంతో అక్కడ స్థానం దక్కక చాలామంది వెనుతిరిగారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పది వేల బస్సుల్లో జనాలను తీసుకువచ్చారు. అయితే, లోపల స్థానం దక్కక కొందరు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఆర్కే బీచ్‌ వేదిక వద్దకు ప్రధాని మోదీ 6.30 గంటలకు వస్తారనే అంచనాతో, దానికి గంట ముందే ప్రజలంతా కంపార్ట్‌మెంట్ల్లకు చేరేలా ప్లాన్‌ చేశారు. దీనికి అటు శ్రీకాకుళం నుంచి ఇటు పాయకరావుపేట వరకు జనసమీకరణ చేశారు. ప్రతి నియోజకవర్గానికి 300కు తక్కువ కాకుండా బస్సులు కేటాయించి జనాలను రాత్రి రెండు గంటల నుంచే తరలించే ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరంలో కూటమి ఎమ్మెల్యేలుప్రతి కార్యకర్తకు ఉదయం మూడు గంటలకు ఫోన్లు చేసి, బయలుదేరాలని కోరారు. ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయడంతో జనం ఆశించిన సంఖ్య కంటే ఎక్కువ వచ్చారు.

Updated Date - Jun 22 , 2025 | 05:46 AM