YCP: స్కూల్ విద్యార్థులతో వైసీపీ నిరసన
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:48 AM
అధికారంలో ఉండగా పాఠశాలల విలీనం పేరిట విద్యార్థుల జీవితాలతో ఆటలాడిన వైసీపీ.. అధికారం కోల్పోయాక తమ రాజకీయ లబ్ధి కోసం మళ్లీ విద్యార్థులనే పావులుగా వాడుకుంటోంది.
యూనిఫాంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన
ఆటోలో తిరిగొస్తుండగా ప్రమాదం.. పలువురికి గాయాలు
ఘటనపై మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు.. విచారణకు ఆదేశం
పార్వతీపురం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉండగా పాఠశాలల విలీనం పేరిట విద్యార్థుల జీవితాలతో ఆటలాడిన వైసీపీ.. అధికారం కోల్పోయాక తమ రాజకీయ లబ్ధి కోసం మళ్లీ విద్యార్థులనే పావులుగా వాడుకుంటోంది. విలీనాన్ని వ్యతిరేకించాలంటూ విద్యార్థులను కలెక్టరేట్‌కు తరలించి నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే నిరసన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆటో ప్రమాదానికి గురై పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో వైసీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని బలిజిపేట మండలం పెదపెంకి ఎంపీపీ-1 పాఠశాలకు సంబంధించి మూడు, నాలుగు, ఐదు తరగతులను వేరొక పాఠశాలలో విలీనం చేయవద్దని కోరుతూ ఈ నెల 23న కలెక్టరేట్ వద్ద కొంతమంది విద్యార్థులు యూనిఫాంతో ఆందోళన చేపట్టారు. నిరసన అనంతరం వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా వీరిలో నలుగురు విద్యార్థులు ఉన్నారు. అయితే పెద్దపెంకి గ్రామం నుంచి పిల్లలు స్వచ్ఛందంగా వచ్చారా..? ఎవరైనా రమ్మంటే వచ్చారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీరియ్‌సగా స్పందించిన లోకేశ్... వెంటనే విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పాలకొండ డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తి విచారణ చేపట్టారు. ఈ పాఠశాలకు చెందిన 21 మంది విద్యార్థులను ఇదే గ్రామంలోని మూడో నంబరు ఆదర్శ పాఠశాలలో విలీనం చేశారని స్థానిక హెచ్‌ఎం వివరణ ఇచ్చారు. విలీనం వద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు చాలాసార్లు ఆందోళన చేపట్టినా ఫలితం లేదని, దీంతో సోమవారం వారంతా కలెక్టరేట్‌కు వెళ్లారని హెచ్‌ఎం తెలియజేశారు. ‘వీరి ధర్నాకు అనుమతి ఉందా? ఆందోళన వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా..?’ అని డిప్యూటీ డీఈవో ప్రశ్నించారు. 40 ఏళ్లుగా ఇక్కడ ప్రాథమిక పాఠశాల కొనసాగుతోందని, ఇక్కడి నుంచి మరో పాఠశాలకు వెళ్లాలంటే రోడ్డు దాటాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిప్యూటీ డీఈవో దృష్టికి తెచ్చారు.
వైసీపీ నేతలే తీసుకెళ్లారు: ఎమ్మెల్యే విజయచంద్ర
వైసీపీ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం విద్యార్థుల భవిష్యత్తును బలి చేయడం దారుణమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజకీయ నిరసన కార్యక్రమం కోసం పెదపెంకి నుంచి విద్యార్థులను తీసుకెళ్లారని, వారు తిరిగివస్తూ ప్రమాదానికి గురయ్యారని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన మాజీ ఎమ్మెల్యేతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తమ రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నేతలు విద్యార్థులను నిరసనకు తీసుకెళ్లడం దారుణమన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.