YCP Targets Free Bus Scheme: ఉచిత బస్సుపై వైసీపీ విషం
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:27 AM
రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళల ఉచిత బస్సులపై వైసీపీ రాద్ధాంతం మొదలుపెట్టేసింది. సూపర్ సిక్స్ పథకాలను అమలుచేయడం లేదంటూ ఇంతకాలం యాగీ చేశారు. ..
ఫ్రీ బస్సు పరిధిలోకి రాని ఏసీలపై యాగీ
కండక్టర్లతో తగువు..ఆ వీడియోలతో రాద్ధాంతం
రోడ్డెక్కి అడ్డంకులు సృష్టించే యత్నం
పేద మహిళల్లో వ్యతిరేకత రాజేసే ప్రయత్నం
సోషల్‌మీడియాలో దుమారానికి తాడేపల్లి ప్యాలెస్ వ్యూహం
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళల ఉచిత బస్సులపై వైసీపీ రాద్ధాంతం మొదలుపెట్టేసింది. సూపర్ సిక్స్ పథకాలను అమలుచేయడం లేదంటూ ఇంతకాలం యాగీ చేశారు. తీరా.. ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టగానే.. రోడ్డెక్కి అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టారు. వైసీపీ నేతలు శుక్రవారం పలు చోట్ల ఉచితం పరిధిలోకి రాని బస్సులు ఎక్కి కండక్టర్లతో కావాలనే గొడవకు దిగారు. ఆ వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో పెట్టి హల్‌చల్‌కు ప్రయత్నించారు. మహిళల ఉచిత ప్రయాణానికి ఐదురకాల సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీలోని సింహభాగం బస్సులను ‘స్ర్తీ శక్తి’ పథకానికే కేటాయించింది. అయితే, హైఎండ్, ఏసీ బస్సులు ఈ పథకం పరిధిలోకి రావని జగన్ పార్టీ నేతలకు తెలుసు. అయినా.. గొడవ కోసం గొడవ పెట్టుకుని హడావుడి చేయాలని చూస్తున్నారు. కూటమి పార్టీలు గత ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చాయి. అన్నట్టుగానే.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఒక్కో పథకం అమలు చేస్తూ.. తాజాగా స్ర్తీశక్తి పథకాన్ని కూడా ప్రారంభించాయి. దీంతో వైసీపీ మూకలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్ర్తీ శక్తి పథకంపై వైసీపీ కోర్ గ్రూప్ అంతర్గతంగా సమావేశమయినట్టు తెలిసింది. ఈ పథకంపై ‘విషం’ చిమ్మాలని నిర్ణయించారు. 70 కిలోమీటర్ల పరిధికే ఉచిత బస్సు పరిమితం అని, స్రీశక్తి పథకం ఆర్డినరీ బస్సులకే వర్తింపజేస్తున్నారంటూ..అబద్ధాలను, అర్ధ సత్యాలను విస్తృతంగా ప్రజల్లో వ్యాప్తిచేయాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. ‘పేదలు ఏపీ బస్సులు ఎక్కకూడదా?’ అంటూ పొంతన లేని నినాదాలను ప్రచారంలో పెట్టేందుకు తాడేపల్లి ప్యాలెస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.