Share News

Tenali: తెనాలిలో ఉండలేం.. దూరంగా వెళ్లిపోతాం

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:51 AM

తెనాలిలో రౌడీషీటర్ల చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్‌ చిరంజీవి కుటుంబానికి మహిళా కమిషన్‌ అండగా నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Tenali: తెనాలిలో ఉండలేం.. దూరంగా వెళ్లిపోతాం

జగన్‌ వచ్చి రౌడీషీటర్లకు అండగా ఉంటామన్నాక భయం పెరిగింది

దాడికి గురైన కానిస్టేబుల్‌ భార్య కల్యాణి కన్నీటిపర్యంతం

తాను దళిత మహిళనేనని, తనకూ రక్షణ కావాలని వేడుకోలు

పోలీసు ఫ్యామిలీకి ఏదైనా జరిగితే చూస్తూ ఊరుకోం

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శైలజ హెచ్చరిక

తెనాలి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): సామాన్యూల కష్టాలు తీర్చాల్సిన పోలీసుకే కష్టం వస్తే... ఆ పోలీసు భార్యే తనకు రక్షణ కల్పించమని వేడుకుంటుంటే అంతకంటే దారుణం ఉండదని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ వ్యాఖ్యానించారు. తెనాలిలో రౌడీషీటర్ల చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్‌ చిరంజీవి కుటుంబానికి మహిళా కమిషన్‌ అండగా నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. వారికి ఏదైనా జరిగితే ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీ అయినా, మాజీ సీఎం అయినా ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. కానిస్టేబుల్‌ చిరంజీవి భార్య కళ్యాణిని పరామర్శించేందుకు ఆమె బుధవారం తెనాలి వచ్చారు. మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారితో కలసి చిరంజీవి కుంటుంబాన్ని పరామర్శించారు. తమకు భయంగా ఉందని, తెనాలిలో ఉండలేమని, దూరంగా వెళ్లిపోతామని శైలజ ఎదుట కల్యాణి కన్నీటిపర్యంతమయ్యారు. అఽఽధైర్యపడొద్దని, పోలీస్‌ కుటుంబంలో ఉన్న మీరే భయపడితే ఎలాగంటూ శైలజ ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రౌడీషీటర్‌లు తన భర్తపై దాడిచేసినప్పుడు కూడా తాము భయపడలేదని, వైసీపీ నేత జగన్‌, ఆ పార్టీ నాయకులు తెనాలి వచ్చి రౌడీషీటర్‌లకు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామంటూ భరోసా ఇచ్చివెళ్లాకే తమలో భయం పెరిగిందని కల్యాణి వివరించారు. తానూ దళిత సోదరినేనని, తనకూ రక్షణ కావాలని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరిన వెంటనే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రావడం కొంత ధైర్యానిచ్చిందని ఆమె పేర్కొన్నారు.


పోలీసు కుటుంబమే రక్షణ కోసం ప్రాధేయపడడమా?

ఒక పోలీస్‌ కుటుంబమే తమకు రక్షణ కావాలని ప్రాధేయపడటం బాధ కలిగించిందని, కల్యాణీకి మహిళా కమిషన్‌ అండగా ఉంటుందని శైలజ భరోసా ఇచ్చారు. ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదని, ప్రభుత్వం, పోలీస్‌ శాఖ అండగా ఉంటుందని ఆమెకు ధైర్యం చెప్పారు. మహిళా కమిషన్‌కు రాజకీయాలతో పనిలేదని, తమకు మహిళల రక్షణే ముఖ్యమని, కానిస్టేబుల్‌ కుటుంబానికి ఎవరైనా హాని తలపెట్టాలని చూసినా, ఏ ఇబ్బంది కలిగించినా మాజీ సీఎం అని కూడా చూడబోమని, దాని వెనుక ఎంతటి పెద్దలున్నా, ఎంతటి కరుడుగట్టిన నేరస్తులున్నా కమిషన్‌ ఉపేక్షించబోదని ఆమె తేల్చి చెప్పారు. కానిస్టేబుల్‌ చిరంజీవి కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా అందుకు వారే బాధ్యులవుతారని శైలజ హెచ్చరించారు. తెనాలిలో ఇటువంటి సంఘటనలు జరగటం బాధ కలిగించిందని, భవిష్యత్‌లో రౌడీల ఆగడాలు తగ్గిపోతాయని, మళ్లీ తెనాలి ప్రశాంత వాతావరణంలో ఉంటుందని కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ రాజకుమారి వ్యాఖ్యానించారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 07:09 AM