Visakhapatnam: పిల్లలతో గృహిణి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jun 25 , 2025 | 02:50 AM
మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకింది.

గోపాలపట్నం (విశాఖపట్నం), జూన్ 24 (ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకింది. ఆమెతో పాటు ఆరేళ్ల కుమారుడు మృతి చెందగా, స్థానికుల సాయంతో కుమార్తె ప్రాణాలతో బయటపడింది. జీవీఎంసీ 88వ వార్డు పెందుర్తి మండలం సత్తివానిపాలెం గ్రామానికి చెందిన కొల్లి పవన్‌కుమార్‌కు, లంకెలపాలెం ఫార్మా సిటీకీ చెందిన గీత (29)తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి యోక్షశ్రీ (8), భువనేశ్ మణికంఠ (6) ఇద్దరు పిల్లలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పవన్‌కుమార్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇటీవల గీత బ్యాంకు ఖాతాలో తల్లికి వందనం నగదు జమ అయ్యింది.
ఆ డబ్బుల కోసం వేధిస్తున్న పవన్ సోమవారం రాత్రి పూటుగా మద్యం తాగి మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గీత ఇంటి సమీపంలోని బావిలో ఇద్దరు పిల్లలను పడేసి, తాను కూడా దూకింది. గీతతో పాటు మణికంఠ నీటిలో మునిగి మృతిచెందారు. యోక్షశ్రీ బావిగట్టుకు ఉన్న రాతి మెట్టును పట్టుకుని సహాయం కోసం కేకలు వేసింది. అవి విన్న ఆమె నాయనమ్మ సమీపంలో ఉన్న వారిని మేల్కొలిపింది. స్థానికులు బావివద్దకు చేరుకుని యోక్షశ్రీను బయటకు తీశారు. మృతురాలి సోదరుడు పుష్పారావు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ఎస్‌ఐ స్వామినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.