స్వచ్ఛ జలం
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:27 AM
పశ్చిమ గోదావరి జిల్లా చుట్టూ నీరు. కానీ తాగడానికి గుక్కెడు నీరు కరువు. అఖండ గోదావరి నిండుగా ప్రవహిస్తున్నా గోదావరి వాసులకు మంచినీరు ప్రధాన సమస్య.

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో డెల్టా గ్రామాలకు రక్షిత నీరు
రూ.1400 కోట్లతో వాటర్ గ్రిడ్
టెండర్లు పిలిచిన కూటమి ప్రభుత్వం
గత ఏజన్సీ రద్దు
854 ఆవాసాలకు ప్రయోజనం
డీపీఆర్ రూపకల్పన
రూ.1479 కోట్లతో ఫేజ్–2 ప్రాజెక్ట్
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పశ్చిమ గోదావరి జిల్లా చుట్టూ నీరు. కానీ తాగడానికి గుక్కెడు నీరు కరువు. అఖండ గోదావరి నిండుగా ప్రవహిస్తున్నా గోదావరి వాసులకు మంచినీరు ప్రధాన సమస్య. పంట కాలువలు కలుషిత మయ్యాయి. ఒకప్పుడు డ్రెయిన్లలో మంచినీరు ప్రవహించేది. ఇప్పుడు దుర్గంధభరిత నీరు ప్రవహిస్తోంది, పట్టణాలు, పల్లెల్లో సరఫరా చేస్తున్న రక్షిత నీరు తాగడానికి ఉయోగించడం లేదు. ప్రైవేటు ప్లాంట్లలో కొనుగోలు చేసిన నీటితోనే గొంతు తడుపుకుంటున్నారు.
జిల్లాలో ఏటా కోట్లాది రూపాయలు మంచినీటి కోసం వెచ్చి స్తున్నారు. భూగర్భ జలాలను శుద్ధిచేసే ప్లాంట్‌లు జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చాయి. ఆ నీరే పశ్చిమ ప్రజలకు ప్రధాన దిక్కుగా మారింది. ఇటువంటి దుర్భర పరిస్థితినుంచి గట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం వాటర్ గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు సమకూర్చనున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలో వాటర్ గ్రిడ్ పథకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఐదేళ్లు కాలయాపన
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ గ్రిడ్‌ను పక్కనపెట్టింది. ఎన్నికల సమయంలో లోపాయికారీగా ఏజన్సీని ఖరా రు చేసినా పనులు చేపట్టలేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత టెండర్లు పిలుస్తున్నారు. విభజిత జిల్లాలోని ఆకివీడు మండలం, తాడేపల్లిగూడెం రూరల్ మండలం మినహాయించి మిగిలి న మండలాల్లోని 854 ఆవాసాలకు మంచినీరు అందించేలా ఫేజ్–1 వాటర్ గ్రిడ్‌ను రూపకల్పన చేశారు. అందుకోసం రూ. 1400 కోట్లు వ్యయం కానుంది. గోదావరి జలాలను శుద్ధిచేసి నేరుగా గ్రామాలకు మళ్లిస్తారు. ఓవర్ హెడ్ రిజర్వాయర్‌లకు నీరు వెళ్లేలా ప్రణాళిక చేశారు. దీనివల్ల మంచినీరు కలుషితమయ్యే అవకాశం ఉండదు. తాగునీటి అవసరాలు తీరనున్నాయి. శుద్ధి చేసిన భూగర్భ జలాలను కొనుగోలు చేసే దుస్థితి నుంచి జిల్లా ప్రజలు గట్టెక్కనున్నారు.
రెండో దశ డీపీఆర్ సిద్ధం
కూటమి ప్రభుత్వం రెండో దశ వాటర్ గ్రిడ్‌కు శ్రీకారం చుట్టింది. ఏలూరు జిల్లాలోని డెల్టా ప్రాంతమంతటికి పైప్‌లైన్‌ద్వారా మంచినీరు అందించేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేశారు. ఆకివీడు, తాడే పల్లిగూడెం మండలాలతోపాటు, ఏలూరు జిల్లాలోని డెల్టా ప్రాంత మండాలన్నింటికీ ఫేజ్–2 వాటర్‌గ్రిడ్‌లో పైప్‌లైన్ ప్రాజెక్ట్‌ను నిర్మించ నున్నారు. దానికోసం రూ. 1479 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటర్ గ్రిడ్‌కు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలతతో ఉంది. మంచినీటి కోసం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జలజీవన్ మిషన్‌లో భాగంగా గ్రామాల్లోని అంతర్గత పైప్‌లైన్‌లు, కుళాయిలు ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ గ్రిడ్‌తో విజ్జేశ్వరం నుంచి పైప్‌లైన్‌ల ద్వారా గ్రామాలకు నీటిని సరఫరా చేస్తారు. ఫలితంగా జిల్లా ప్రజలకు సురక్షిత మంచినీరు అందుతుంది.