అపరాల పంటకు తెగుళ్ల తాకిడి
ABN , Publish Date - Feb 19 , 2025 | 12:45 AM
పూతదశలో ఉన్న మినుము, పెసర పంటలపై పల్లాకు, బూడిద తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మినుము, పెసరపై పల్లాకు, బూడిద తెగులు
రోజుల వ్యవధిలో పంట మొత్తం వ్యాప్తి
ఎండుతున్న మొక్క.. రాలుతున్న పూత
ఏలూరు రూరల్, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): పూతదశలో ఉన్న మినుము, పెసర పంటలపై పల్లాకు, బూడిద తెగుళ్లు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మందులు పిచికారి చేసినా తెగులు వ్యాప్తి తగ్గడం లేదని రైతులు వాపోతున్నారు. తెగులు ప్రభావంతో మొక్క ఎండిపోతోంది. పూత రాలిపోతోంది. ఎన్నిసార్లు మందులు పిచికారి చేసినా ఉపయోగం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగు మందులు పిచికారి మరింత భారంగా మారిం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో వరిసాగు చేసిన పొలాల్లో రైతులు పంట కోత అనంతరం మినుము, పెసర, అప రాల పంట వేశారు. ప్రస్తుతం పల్లాకు తెగులు సోకింది. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతాల్లో ఏలూరు రూరల్ మండలంలోని లింగారావు గూడెం, కాట్లంపూడి తదితర ప్రాంతాల్లో అపరాలు వేశారు.
కృష్ణా డెల్టా పరీవాహక ప్రాంతమైన కైకలూరులో సుమారు 35 ఎకరాల్లో అపరాల సాగు జరుగుతుంది. దాదాపు 30 ఎకరాలకు పైగా తెగుళ్లు సోకాయి. రెండో పంటకు సాగు నీరు లేకపోవడంతో ఏలూరు, దెందులూరు, పెదపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో రైతులు అపరాల పంట సాగుచేశారు. వేలాది రూపాయలు పురుగు మందులు ఖర్చు చేశారు. పూత, పిందెదశలో పంటలు ఎండి పోతు న్నాయి. మినుము ఆకులు గిడసబారి పసుపు రంగులోకి మారుతున్నాయి. ఒక మొక్కకు సోకిన తెగులు, రోజుల వ్యవధిలోనే పొలం మొత్తం విస్తరిస్తోంది. ఇక బూడిద తెగులు ఆశించిన పొలాల్లో మినప మొక్కపై తెల్లటి మచ్చలు ఏర్పడి ఎండిపోతున్నాయి. ఎకరాకు రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టినా, దిగుబడి వచ్చే పరిస్థితులు లేవు. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ళు కూడా దిగుబడి రాదని రైతులు వాపోతున్నారు.