Share News

టీడీఆర్‌ బాండ్‌లు ఫోర్జరీ

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:47 AM

తాడేపల్లిగూడెంలో టీడీఆర్‌ బాండ్‌ల మంజూరులో మరో అంశం తెరపైకి వచ్చింది. ఫోర్జరీ సంతకాలతో బాండ్‌లను మంజూరు చేశారు.

టీడీఆర్‌ బాండ్‌లు ఫోర్జరీ

తాడేపల్లిగూడెం మున్సిపాల్టీ అక్రమాల్లో మరో కోణం

18 మందికి ఫోర్జరీ బాండ్‌లు మంజూరు

రూ. కోట్లలో లబ్ధి పొందిన వైసీపీ నేత

అధికారుల తప్పిదాలు బహిర్గతం

నివేదికలు సిద్ధం చేస్తున్న విజిలెన్స్‌

సీబీసీఐడీ విచారణకు అవకాశం

భయపడుతున్న అక్రమార్కులు

కూటమి నేతల చుట్టూ ప్రదక్షిణ

తాడేపల్లిగూడెంలో టీడీఆర్‌ బాండ్‌ల మంజూరులో మరో అంశం తెరపైకి వచ్చింది. ఫోర్జరీ సంతకాలతో బాండ్‌లను మంజూరు చేశారు. మున్సిపాలిటీకి స్థలాలు రిజిస్ర్టేషన్‌ చేసి ఇచ్చిన స్థల యజమానుల సంతకాలకు, బాండ్‌లు జారీ సమయంలో చేసిన సంతకాలకు పొంతన లేదు.! టీడీఆర్‌ బాండ్‌లపై దర్యాప్తు చేయడానికి విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెంలో టీడీపీ బాండ్‌లు మంజూరు చేసిన స్థలాలను గడచిన మూడు రోజులుగా విజిలెన్స్‌ అధికారులు పరిశీలించారు. స్థల యజమానులను సంప్రదించి వివరాలు నమోదు చేసుకున్నారు. బాండ్‌ల మంజూరులో అధికారులు చేసిన తప్పిదాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. కేవలం వైసీపీ నేతకు మేలు చేయాలన్న తలంపుతో బాండ్‌లు ఇచ్చేశారు. బలైపోయామంటూ కూటమి నేతల వద్ద లబోది బోమంటున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల్లో స్థలాల రిజిస్ర్టేషన్‌ నుంచి బాండ్‌లు మంజూరు వరకు జరిగిన ప్రక్రియపై విజిలెన్స్‌ దృష్టి సారించింది. ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు. తదుపరి ప్రభుత్వ నిర్ణయం మేరకు సీబీసీఐడీని నియమించే అవకాశాలున్నాయి. ఇప్ప టికే తణుకులో జారీ అయిన బాండ్‌లపై సీబీసీఐడీ విచార ణ చేపడుతోంది. తాడేపల్లిగూడెంలోనూ సీబీసీఐడీ రంగం లోకి దిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులు భయపడుతున్నారు. బాండ్‌లు జారీచేసిన వారంతా ఇతర మున్సిపాలిటీల్లో, శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు.

మహిళలకు అన్యాయం!

తాడేపల్లిగూడెం పట్టణంలోని తాళ్ల ముదునూరుపాడులో 3200 గజాల స్థలంలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి బిల్డర్‌తో మహిళలు ఒప్పందం చేసుకున్నారు. మహిళల పేరుతో సదరు స్థలం ఉంది. దాంట్లో 1000 గజాల స్థలం మాస్టర్‌ ప్లాన్‌ రహదారిలో ఉండడంతో బిల్డర్‌కు వక్రబుద్ధి పుట్టింది. తాడేపల్లిగూడెం–భీమవరం రహదారికి ఆనుకుని ఉన్న 1000 గజాల స్థలం మున్సిపాలిటీకి ఇవ్వాలని స్థల యజ మానులైన మహిళలను ఒప్పించారు. అందుకు నాలుగు రెట్లు టీడీఆర్‌ బాండ్‌లు ఇస్తారు. వాటిని అపార్ట్‌మెంట్‌లోనే వినియోగించి అభివృద్ధి చేస్తామని నమ్మించారు. రెండో ఒప్పందంలో ఆ మేరకు తిఖితపూర్వకంగా రాసుకున్నారు. కానీ మున్సిపాలిటీ ఇచ్చిన బాండ్‌లను మార్కెట్‌లో విక్రయించేశారు. అపార్ట్‌మెంట్‌ నిర్మించకుండా మహిళల ను బిల్డర్‌ మోసం చేశారు. బాండ్‌ల అమ్మకంలో దాదాపు రూ. 3.50 కోట్లు లబ్ధి చేకూరింది. వైసీపీ నేతకు కొంతమొత్తాన్ని ముట్టచెప్పగా స్థలం ఇచ్చిన మహిళలు మోసపోయారు. బిల్డర్‌ పేరుతో బాండ్‌ల ను మంజూరు చేయడం నిబంధనలకు విరుద్ధమైనా అప్పటి మున్సిపల్‌ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు విజిలెన్స్‌ అధికారుల విచారణలో స్థల యజమానులైన మహిళలకు అన్యాయం జరిగిం దని గుర్తించారు. దాంతో స్థల యజమానులతో రాజీ కుదుర్చుకో వడానికి లబ్ధిపొందన బిల్డర్‌, బ్రోకర్‌లు ప్రయత్నాలు ప్రారంభించారు. బాండ్‌లు జారీచేసిన అధికారులు సైతం కాళ్ల బేరానికి వచ్చారు.

నేతకు లబ్ధి.. అధికారులకు శిక్ష!

వైసీపీ హయాంలో అక్రమంగా జారీచేసిన టీడీఆర్‌ బాండ్‌లపై తాడేపల్లిగూడెంలో విజిలెన్స్‌ అధికారులు దర్యా ప్తు చేస్తున్నారు. బాండ్‌లు జారీ అయిన 18 మంది నుంచి వివరాలు సేకరించి నివేదికను సిద్ధం చేస్తున్నారు. బాండ్‌లు జారీలో ఫోర్జరీ సంతకాలపైనా విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మున్సిపల్‌ అధికారుల నుంచి రికార్డులను స్వాధీ నం చేసుకుని విచారణ చేపట్టారు. వైసీపీ హయాంలో దాదా పు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బాండ్‌లు మంజూ రయ్యాయి. వాటి విలువ దాదాపు రూ.150 కోట్లు. మార్కెట్‌లో 40శాతానికి బాండ్‌లను విక్రయించి రూ.60 కోట్ల మేర లబ్ధిపొం దారు. వైసీపీ నేతకు పెద్ద మొత్తంలో సొమ్ములు అందగా రాష్ట్ర స్థాయి అధికారులకు లబ్ధి చేకూరినట్లు ఆరోపణలు. ప్రస్తుతం బాండ్‌లు మంజూరు చేసిన అధికారులు బలికానున్నారు. బాండ్‌ల మంజూరులో తప్పిదాలు దొర్లాయి. స్థలాలు స్వాధీనం చేసుకోలేదు. మున్సిపాలిటీకి రాసిచ్చిన స్థలాల్లో ఇప్పటికీ షాపులను నిర్వహిస్తు న్నారు. భీమవరం పట్టణానికి చెందిన బ్రోకర్‌ బాండ్‌ల జారీలో కీలకంగా వ్యవహరించారు. వైసీపీ నేత రూ.2.00 కోట్లు మేర బ్రోకర్‌కు ఇచ్చేలా మంతనాలు సాగినా సొమ్ము ఇవ్వలేదు. ఇద్దరి మధ్య ఇప్పుడు అంతరం ఏర్పడింది. ఇదికూడా విజిలెన్స్‌ విచారణలో బహిర్గతమైంది.

Updated Date - Feb 17 , 2025 | 12:47 AM