గెలుపుకోసం కదిలిని కూటమి సైన్యం
ABN , Publish Date - Feb 11 , 2025 | 01:30 AM
ఉమ్మడి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు పట్టు బిగిస్తున్నాయి.
ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లు
అట్టహాసంగా రాజశేఖరం నామినేషన్
ఏలూరులో టీడీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ
ఎమ్మెల్సీ అభ్యర్థి వెంటే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు
చివరిరోజు పోటెత్తిన అభ్యర్థులు
59 మంది అభ్యర్థులు .. 72 సెట్లు
నేడు పరిశీలన.. ఉపసంహరణ
గడువు 13.. పోలింగ్ తేదీ 27
ఉమ్మడి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు పట్టు బిగిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గానికి పరిశీలకులను నియమించింది. ఇతర జిల్లాల్లోని కీలక నేతలంతా ఈ రెండు జిల్లాల్లో మకాం వేశారు. కూటమి నేతల ప్రచారాన్ని వారు పరిశీలిస్తున్నారు. ప్రతి 30 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించారు. ఓటర్ల నమోదు నుంచే ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలోకంటే ఓటర్లను ఎక్కువగా నమోదు చేయడంలో కూటమి నేతలు సఫలీకృతమయ్యారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు కలసికట్టుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పట్టభద్రులను కలుస్తున్నారు. ఈ సారి ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డ పట్టభద్రులు సైతం ఓటు నమోదుకు ఆసక్తి చూపారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి నేతలం గా కలసికట్టుగా కదిలారు. జిల్లాలో ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులపై స్థానిక నేతలు దృష్టి సారించారు. వారందరినీ రప్పించి ఓటు వేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ప్రతి నియోకవర్గంలో పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునేలా.. కూటమి తరపున బరిలో నిలచిన రాజశేఖరానికి తొలి ప్రాధాన్య ఓటు వేసేలా ప్రచారం సాగిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కలసికట్టుగా విద్యా సంస్థల్లో అధ్యాపక, అధ్యాప కేతర సిబ్బందితో సమావేశం అవుతున్నారు. మరోవైపు కూటమి తరపున రాజశేఖరం సోమవారం ఏలూరులో నామినేషన్ దాఖలు చేయడంతో జిల్లాలోని కూటమి నేతలంతా తరలివెళ్లారు. భీమవరం, తాడేపల్లిగూ డెం, నరసాపురం, ఆచంట, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో కూటమి నేతల ప్రచారాలతో సందడి నెలకొంది.
వైసీపీ దూరం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. జిల్లాలో ఆ పార్టీ నేతల జాడ లేదు. పాఠశాలల్లో విద్యా కమిటీలు, నీటి సంఘాల ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండి పోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అదే తీరు. పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. నియో జకవర్గాల్లో ముఖ్య నేతలుఆ పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వం అసంతృప్తితో సతమతమవుతోంది. గడచిన ఎన్నికల్లో ఓటమి భారం నుంచి ఇంకా శ్రేణులు కోలుకోలేదు. దాంతో మార్చిలో నిర్వహించే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు వైసీపీ దూరమైంది. కొందరు పట్టభద్రులు నామినేషన్‌లు దాఖలు చేస్తున్నా వారి ప్రభావం పెద్దగా కానరావడం లేదు.
ఏకపక్షమేనా..
ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో దూసుకు పోతున్న కూటమి నేతలు విజయం ఏకపక్షమే అన్న ధీమాతో ఉన్నారు. పట్టభద్రులను కలసిన ప్పుడు అందరి నుంచి సానుకూలత వ్యక్తమవుతోందని చెబుతున్నారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి కోసం కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోవాలని నేతలు కోరుతున్నారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరిస్తున్నారు. ఇవన్నీ తమకు కలసి వస్తాయంటూ కూటమి నాయకత్వం గట్టి నమ్మకంతో ఉంది.
ఎన్నికల అనంతరం డీఎస్సీ
ప్రభుత్వానికి, గ్రాడ్యుయేట్లకు పేరాబత్తుల రాజశేఖరం వారధిగా పనిచేస్తారరు. ఎన్నికలు ముగిసిన వెంటనే డీఎస్సీలో వేలాది టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేట్, సౌమ్యుడైన రాజశేఖరం భారీ మెజార్టీతో గెలవడం ఖాయం.
– పల్లా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఉద్యోగావకాశాలు కల్పిస్తా
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు శయశక్తులా పనిచేస్తా. ప్రశ్నించే గొంతుక మీరైతే పరిష్కరించే మనిషిగా నేనుంటా. కూటమి ప్రభుత్వానికి ప్రజల అండదండలు అవసరం. తొలి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించండి
– పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్సీ అభ్యర్థి