పదో తరగతిలో మెరుగైన ఫలితాలే లక్ష్యం
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:53 AM
పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. విద్యార్థులకు ఒత్తిడి ఊసే లేకుండా ప్రైవేట్‌కు దీటుగా గట్టి పోటీ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు.

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ
100 రోజులు.. 60 రోజులు.. రెండు కార్యాచరణ ప్రణాళికలు
సెలవు రోజుల్లో కూడా తరగతులు
బోధన, శిక్షణ, రివిజన్
విద్యార్థుల దాతల ప్రోత్సాహం
జిల్లాలో పది పరీక్షలకు 24,265 మంది విద్యార్థులు
పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. విద్యార్థులకు ఒత్తిడి ఊసే లేకుండా ప్రైవేట్‌కు దీటుగా గట్టి పోటీ ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. వంద రోజులు, 60 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి మార్కులు సాధించాలనే లక్ష్యంతో జిల్లా అంతటా సెలవు రోజుల్లో సైతం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పలు చోట్ల రాత్రి వేళ కూడా విద్యార్థులతో చదివిస్తున్నారు.
భీమవరం రూరల్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యో తి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కు దాదాపు రెండు నెలల నుంచి సబ్జెక్టుల వారీ గా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల నుంచి మెరుగైన ఫలితాలు సాధించ డమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు వెనకబడ్డారు. 2021–22, 2022–23 సంవత్సరాల్లో 50 శాతంలోపే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2023–24 లో కొంత వరకు మెరుగపడి 60 శాతం లోపు ఉత్తీ ర్ణత సాధించారు. ఈ మూడేళ్లలో ప్రైవేటు విద్యా సంస్థల్లో 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి మూడేళ్లలో 38 వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాల లకు తరలిపోయారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 1.38 లక్షల నుంచి ప్రస్తుతం 99 వేలకు పడిపోయింది. విద్యార్థుల ను ప్రభుత్వ పాఠశాలల బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం విద్యా సంవత్సరం మొదటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యాబోధనలో మార్పుల్లో కార్యాచరణ చేపట్టింది. టెన్త్ ఫలితాలపైనే మార్పు తీసుకువచ్చి వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల సంఖ్య పెంచుకుంటూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా ఆలోచన చేస్తుంది.
పది విద్యార్థులు 24,265 మంది
ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లాలో 410 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 24,265 మంది పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. రెగ్యులర్ విద్యార్థులు 22,037 మంది, ప్రైవేట్ విద్యార్థులు 2,228 మంది పరీక్ష రాయనున్నారు.
రెండు కార్యాచరణ ప్రణాళికలు
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే కాదు అధిక మార్కులు సాధించేలా విద్యా శాఖ రెండు రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వంద రోజుల ప్రణాళిక సగంలో ఉంది. కొన్ని రోజుల క్రితమే 60 రోజుల ప్రణాళిక అమలులోకి తీసుకువచ్చారు. వంద రోజుల ప్రణాళికలో ఉదయం, సాయంత్రం 2 గంటలు అదనంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు ఒక సబ్జెక్ట్‌పై బోధన, మరుసటి రోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు తిరిగి శిక్షణ ఇస్తున్నారు. 60 రోజుల ప్రణాళికలో రోజూ రెండు గంటలు ఒక సబ్జెక్టుపై విద్యాబోధన ఉంటుంది. ఇప్పటికే బోధన పూర్తికావడంతో రెండో సారి బోధిస్తున్నారు. ఈ రెండు ప్రణాళికలతో వెనుకబడిన విద్యార్థులు కూడా మంచి మార్కులు సాఽధించడానికి అవకాశం ఉంది. జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు విజయకేతనం మెటీరియల్ అందించి వాటి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.
కొన్నిచోట్ల రాత్రి తరగతులు
ప్రభుత్వం సూచనలను పాటిస్తూనే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రాత్రి తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. గతంలో కొన్ని పాఠశాలలు రాత్రి తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు సాధించడంతోపాటు ప్రైవేట్‌కు దీటుగా ఫలితా లు తెచ్చారు. సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించారు. భీమవరం పీఎస్‌ఎం బాలికోన్నత పాఠశాలలో 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల దశాబ్దం కాలంగా విద్యార్థులు ఏటా అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటుతున్నారు.
సెలవు రోజుల్లో తరగతులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఆదివారం, ఇతర సెల వు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. పదో తరగతి సబ్జెక్టులన్నీ రివిజన్‌తోపాటు శిక్షణ, పరీక్షలు నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి సబ్జెక్టు వారీగా రివిజన్ చేయిస్తు న్నారు. వారి సందేహాలను నివృత్తి చేసేలా ఉపా ధ్యాయులు ప్రతిక్షణం పరిశీలిస్తున్నారు. వెనక బడిన విద్యార్థులు సైతం చదువులో రాణించి వంద శాతం ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిక మార్కులు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు
ఐదేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి చూపని తల్లిదండ్రులు పదో తరగతి విద్యాబోధనతో వారి ఆలోచనలో మార్పు కనబడుతోంది. విద్యార్థులపై శ్రద్ధ, కొన్ని నెలల క్రితం ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సదస్సు తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించింది. ఉపాధ్యాయుల కృషి ఫలించి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తే రానున్న విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మధ్యాహ్న భోజనం, స్నాక్స్
ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు రెండు నెలల నుంచి ఉదయం, సాయం త్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపా ధ్యాయులు దాతల సహకారంతో విద్యార్థులకు స్నాక్స్ అందించే ఏర్పాట్లు చేశారు. సెలవు రోజుల్లో కూడా ఉదయం 9 గంటల నుంచి సా యంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం కింద సమకూరుస్తుంది. దాతలు స్నాక్స్ ఇస్తున్నారు.
పరీక్షలు తెలుగులో రాసేందుకు అనుమతి
ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది. గడచిన ఏడాది కూడా ఇంగ్లీష్ మీడియంలో టెన్త్ పరీక్షలు రాశారు. జిల్లాలో 211 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలోనే పదో తరగతి బోధన జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు తెలుగు మీడియంలో రాయడానికి ప్రభుత్వం అనుమతించింది. విద్యార్థులు ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది. చాలామంది విద్యార్థులు తెలుగు మీడియంలో రాయడానికి ఎంపిక చేసుకున్నారు. మార్కులు, ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరుగుతుందని అంచనా.
ఒకటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే
నా ఇద్దరు పిల్లలను ఒకటో తరగతి నుంచి పది వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాను. టెన్త్‌లో మంచి మార్కులు సాధించారు. ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించారు. ప్రణాళికతో వెళితే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మంచి ఫలితాలు విద్యార్థులు సాధించగలరు.
– ఏసుప్రసాద్, కరకువాడ
పోటా పోటీగా విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పదో తరగతిలో పోటీపడి మార్కులు సాధిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ ఏడాది రాత్రి తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. మా పాఠశాల నుంచి 210 మంది పరీక్ష రాయనున్నారు.
– రాధాకృష్ణ, హెచ్‌ఎం, పీఎస్‌ఎం బాలికల పాఠశాల, భీమవరం
నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యం
పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే కార్యాచరణ తో ముందుకు వెళుతున్నాం. అన్ని పాఠశాలల్లో ఉత్తీర్ణత పెరగా లని హెచ్‌ఎంలకు సూచించాం. బోధనలో మార్పులు తెచ్చి విద్యార్థులు ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇస్తున్నారు. ఈ 38 రోజుల్లో రివిజన్, ప్రత్యేక తరగతులతో మంచి బోధన చేస్తాం.
– నారాయణ, డీఈవో