Share News

భారం.. కష్టం..

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:38 AM

పెద్ద పండుగ సందడి ముగియడంతో బంధు మిత్రులంతా బరువెక్కిన హృదయంతో భారంగా తిరిగి వెళుతున్నారు.

భారం.. కష్టం..
ఏలూరు నగరంలోని బస్‌ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ

సంక్రాంతి అతిథుల తిరుగు ప్రయాణం

కిటకిటలాడిన బస్సులు

ఏలూరు/ ఏలూరు క్రైం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పెద్ద పండుగ సందడి ముగియడంతో బంధు మిత్రులంతా బరువెక్కిన హృదయంతో భారంగా తిరిగి వెళుతున్నారు. బస్సులు, రైళ్ల రద్దీతో కష్టంగా ప్రయాణిస్తున్నారు. శుక్రవారం సెంటిమెంట్‌తో గురువారం ఉదయం, మధ్యా హ్నం నుంచే ప్రయాణాలు మొదలయ్యాయి. పండుగకు ముందే స్వస్థలాలకు వచ్చిన ఉద్యోగు లు సెలవులు పూర్తి కావడంతో కొంతమంది పయనమయ్యారు. మరికొందరు రెండు రోజులు సెలవులు పొడిగించుకుని శని, ఆదివారాల్లో ప్ర యాణానికి సమాయత్తం అవుతున్నారు. స్వగ్రా మాలకు ముందస్తు రిజర్వేషన్లతో వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో బస్సు, రైళ్లు, ప్రైవేట్‌ సర్వీసుల రద్దీతో ఇబ్బంది పడుతున్నారు. శుక్ర వారం కొంత రద్దీ తగ్గినా శని, ఆదివారాల్లో రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

కిటకిటలాడిన బస్‌ స్టేషన్లు

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు గురువారం సా యంత్రం నుంచి కిటకిటలాడాయి. ఎవరిని చూ సినా నాలుగేసి బ్యాగ్‌లతో ఉన్నారు. వచ్చినప్పుడు రెండు బ్యాగ్‌లు ఉండగా వెళ్లేట ప్పుడు మరో రెండు బ్యాగ్‌లు తోడయ్యాయి. బం ధువులు ఇచ్చిన పిండివంటలు తమ పొలంలో పండిన పంటలు, పండ్లను తీసుకుని వెళ్లారు. ఏలూరు కొత్త బస్టాండ్‌, పాత బస్టాండ్‌ పవర్‌ పేట, ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌, నూజివీడు రైల్వే స్టేషన్‌, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, జీలుగుమిల్లి, చింతలపూడి, నూజివీడు, గుండు గొలను సెంటర్‌, భీమడోలు, కైకలూరు బస్టాండ్‌ లు కిటకిటలాడాయి. ఏలూరు, నూజివీడు, జం గారెడ్డిగూడెం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా తమ ప్రయాణాన్ని కొనసాగించడంతో బస్సులు అన్నీ నిండిపోయాయి. రైళ్లు కూడా రద్దీగానే ఉన్నాయి. ప్రైవేటు బస్సుల నిర్వాహ కులు గుట్టు చప్పుడు కాకుండా అధిక ధరలు వసూలు చేస్తూ ప్రయాణికులను ఎక్కించుకుని తీసుకువెళ్తున్నారు. ముందుగానే టిక్కెట్లు లేవం టూ చెప్పి బస్సు వస్తే ఖాళీ ఉంటే ఎక్కిస్తామం టూ ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. ఆ విధంగా అయినా డబ్బులు తీసుకుని గురువారం రాత్రి జిల్లాలో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు యథేచ్ఛగా ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేశారు. దీంతో వారంతా దిక్కు తోచని పరిస్థితిలో ప్రయాణాన్ని కొనసాగిం చుకోవాల్సి వచ్చింది.

బోసిపోయిన గ్రామాలు

సంక్రాంతి పండుగకు వచ్చిన బంధుమిత్రులు కొత్త అల్లుళ్ల తో వారం రోజులుగా పల్లెలు, పట్టణాలు కళకళ లాడాయి. ఈసారి ప్రతి ఇంటికి బంధువులే కాదు ఎవరో ఒకరు అతిథులుగా రావడంతో ఆనందోత్సాహాల మధ్య గడిపారు. షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు సందడిగా మారాయి. వచ్చిన వారంతా తెలిసిన ప్రతి ఒక్కరిని పలుకరించి యోగక్షేమాలు తెలుసుకుని ఆప్యాయతలను కురిపించారు. వారం రోజుల పాటు ఎంతో సందడిగా కనిపించిన వాతావర ణం గురువారం ఒక్కసారిగా బోసిపోయింది. బంధువులు, మిత్రులు పెద్దసంఖ్యలో వాహనా లపై రావడంతో గ్రామాల్లో అధిక సంఖ్యలో కార్లు కనిపించాయి. పోలవరం బస్‌ షెల్టర్‌ వద్ద తిరుగు ప్రయాణమైన బంధువులు సాగనంపు తున్న గ్రామస్తులతో హృదయాలు భారంగా కాగా కిక్కిరిసిన ప్రయాణికులతో బస్సులు భారంగా కదిలాయి. కామవరపుకోట ప్రాంతానికి సంక్రాంతి సందర్భంగా ఇతర దేశాలు, రాష్ట్రాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులు తిరిగి పయనమయ్యారు. లండన్‌, హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, గుంటూరు తదితర ప్రాం తాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారంతా బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడిపి బరువెక్కిన హృదయాలతో తిరిగి వెళ్లారు.

టికెట్‌ ధర రెట్టింపు..!

ఆచంట: సంక్రాంతికి వచ్చిన తిరుగు ప్రయాణంలో హృదయంతో పాటు జేబుకు కూడా భారమే. హైదరాబాద్‌ వెళ్లేందుకు రైలు, ప్రైవేటు ట్రావెల్స్‌ టికెట్లు అందుబాటులో లేవు. ఎంతైనా ఇస్తాం.. టిక్కెట్లు కావాలంటూ కొందరు ప్రైవేటు ట్రావెల్స్‌కు ఎగబడ్డారు. దీనితో ప్రైవేటు ట్రావెల్స్‌ టికెట్‌ ధర ఒక్కసారిగా రెట్టింపైంది. హైదరాబాద్‌ టిక్కెట్‌ ధర రూ.వెయ్యి కాగా ఒకేసారి రూ.2 వేలకు పెంచినా దొరకని పరిస్థితి నెలకొంది. రెండు రోజులు పాటు టిక్కెట్‌ల డిమాండ్‌ ఇలాగే ఉంటుందని పలువురు చెబుతున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 12:38 AM