అడ్డుకట్టకు తొలి అడుగు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:53 PM
తీర ప్రాంతకోత నివారణకు తొలి అడుగు పడింది. తొలి విడతగా పీఎంలంక వద్ద రూ. 13.50 కోట్లతో చేపట్టే రక్షణ గోడ పనులకు టెండర్లు ఆహ్వానించారు.

సముద్రపు కోత నివారణకు కిలోమీటరు మేర రక్షణ గోడ
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,300 కోట్లు..
తొలి విడతగా పీఎం లంక వద్ద పనులు
రూ.13.50 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి టెండర్లు
నరసాపురం జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తీర ప్రాంతకోత నివారణకు తొలి అడుగు పడింది. తొలి విడతగా పీఎంలంక వద్ద రూ. 13.50 కోట్లతో చేపట్టే రక్షణ గోడ పనులకు టెండర్లు ఆహ్వానించారు. గతంలో ఈ పనులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థ డేలైట్ కంపెనీ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా కోతకు గురవుతున్న సముద్ర తీరం వెంబడి రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాధించారు. చెన్నై ఐఐటీ నిపుణులు పలుమార్లు సర్వే చేసి కోత నివారణకు రక్షణ గోడ నిర్మించాలని సూచించారు. సుమారు కిలోమీటర్ మేర పనులు చేపడితే సముద్రపు కోత ప్రభావం తగ్గుతుందని నివేదిక ఇచ్చారు. దానికి అనుగుణంగా చేపట్టే పనులకు రూ.1300 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దానిలో భాగంగా తొలి విడత పనులకు టెండర్లు పిలిచారు. ఈపనులు చేపట్టి కోత ప్రభావాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా మిగిలిన పనులు చేయాలని నిపుణులు భావిస్తున్నారు.
తరుముకొస్తున్న కడలి
నరసాపురం మండలంలో చినలంక 20ఏళ్ళ క్రితం ఒక గ్రామ పంచాయతీ. నేడు ఈ గ్రామం పూర్తిగా సముద్రగర్భంలో కలిసిపోయి ంది. దానికి సమీపంలో ఉన్న పీఎంలంక సముద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేది. నేడు అరకిలోమీటర్ దూరానికి వచ్చింది. దీంతో ఈగ్రామం కూడా ఏదో ఒక రోజు చినలంక లాగా సముద్ర గర్భంలో కలిసిపోతుందన్న భయం తీర ప్రాంతవాసుల్లో నెలకొంది. కోత నివా రణకు రెండు దశాబ్ధలుగా ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయే తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మొగల్తూరు మండలం కేపీపాలెం, పేరుపాలెం గ్రామాల పరిస్థితి ఇంతే. సముద్రం చొచ్చుకొస్తుంది. తుఫాన్లు, వాయుగుండాలు సమయం లో ఎక్కువగా కోతకు గురి అవుతూ వస్తుంది. దీన్ని నియంత్రించేందుకు ఒడరేవుల్లో వేసే సిమెం ట్ దిమ్మలు వేయాలని గ్రామస్థులు విన్నవిస్తున్నా... ప్రయోజనం లేకుండా పోయింది. వందల కోట్లు ఖర్చుతో కూడిన పని కావడంతో ప్రభుత్వాలు కూడా ముందుకు రాలేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి జోక్యంతో కొత్త ఆశలు
పదేళ్ళ క్రితం కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాని మోదీ ఎంపీలను దేశం లోని గ్రామాలను దత్తత తీసుకుని ఆభివృద్ధి చేయా లని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ చూపు పీఎంలంక, తూర్పుతాళ్ళుపై పడింది. ఈ ప్రాంతంపై ఎంతో అవగాహన ఉన్న కేంద్ర మంత్రి ఈరెండు గ్రామాలను అభివృద్ధి చేయాలని భావించారు. దాని లో భాగంగా ఈ గ్రామాల్లో పనులు చేపట్టారు. పీఎంలంకకు భారీ వంతెనల నిర్మాణాలతో పాటు డిజిటల్ కమ్యూనిటి భవనాలు నిర్మించారు. అయితే గ్రామస్థులు సముద్రపు కోత నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. అప్పటి రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ డిఫెన్స్‌కు చెందిన ఇంజనీర్ల బృందాన్ని పిలిపించి సర్వే చేయించారు. ఇంతటితో విడిచిపెట్టలేదు. చెన్నై ఐఐటీ నిపుణుల్ని కూడా కోరారు. నాలుగేళ్ళ నుంచి పలు విభాగాలకు చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలు కోతకు గురవుతున్న ప్రాంతాల్లో పలు సర్వేలు చేసి ఒక నివేదికను రూపొందించారు. కిలోమీటర్ మేర గోడ నిర్మాణం చేపడితే కోతను కొంత మేర నివారించవచ్చునని సిఫార్స్ చేశారు.
రెండేళ్ల క్రితం పనులకు శంకుస్థాపన
రక్షణ గోడ నిర్మాణానికి సుమారు రూ.1300 కోట్లు ఖర్చు అవుతుందని అంచ నా వేశారు. ఇంత మొత్తం కేంద్రం భరించడం కష్టసా ధ్యమని భావించిన కేంద్ర మంత్రి నిర్మల కార్పొరేట్ సంస్థల్ని సంప్రదించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగం గా గోడ నిర్మాణ చేపట్టి గ్రామాలను రక్షించాలని సూచించారు. దానికి స్పందించిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థ డెలైట్ ముందు కొచ్చింది. దీంతో 2022 అక్టోబర్ నెలలో కేంద్ర మంత్రి పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ముం దుకు సాగలేదు. ఇటీవల వరకు చెన్నై ఐఐటీ నిపుణులు సర్వే చేస్తూ వచ్చారు. చివరికి గత నెలలో తొలి విడతగా చేపట్టే రూ.13.50 కోట్ల పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈ పనులను ఒక కార్పొరేట్ రంగానికి చెందిన నిర్మాణ సంస్థ దక్కించుకున్నట్లు తెలియవచ్చింది. నిర్మించే రక్షణ గోడ పీఎం లంక వేంకటేశ్వర స్వామి గుడి వద్ద నుంచి సుమారు కిలోమీటర్ మేర నిర్మించను న్నారు. తొలి విడత పనులు పూర్తికాగానే దాని ఫలితాన్ని బట్టి మిగిలిన పనులు చేపట్టాలని నిపుణులు భావిస్తున్నారు.