పుష్కర పనులపై కదలరే..!
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:43 AM
రాష్ట్ర విభజన అనంతరం గోదావరి పుష్కరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం భారీగా నిర్వహించింది. గోదావరిలో పుణ్యస్నానాలకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఉభయ గోదావరి జిల్లాలకు తరలివచ్చారు.

క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలపై అధికారుల ఉదాసీనత
రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల సమీక్షలు
స్థానికంగా పట్టించుకోని అధికారులు
పురపాలక శాఖ మొద్దు నిద్ర
ట్రాన్స్‌కో రూ.18 కోట్లు, ఏటిగట్టు శాఖ రూ.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
రాష్ట్ర విభజన అనంతరం గోదావరి పుష్కరాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం భారీగా నిర్వహించింది. గోదావరిలో పుణ్యస్నానాలకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఉభయ గోదావరి జిల్లాలకు తరలివచ్చారు. రాజమండ్రి, కొవ్వూరు తరువాత అత్యధిక మంది భక్తులు నరసాపురంలోనే పుణ్యస్నానాలు అచరించారు. 12 రోజులపాటు జరిగిన ఈ మహోత్సవంలో అప్పట్లో పట్టణంలోని ఘాట్‌ల్లో కోటి మందిపైనే స్నానమాచరించినట్లు అంచనా.
నరసాపురం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): గోదావరి నది గత పుష్కరాలకు భక్తుల రద్దీని ముందుగానే ఊహించి పనులు చేపట్టడంతో ఇబ్బందులు తలెత్తలేదు. 2027 జూలైలో పుష్కరాలకు కూడా ప్రభుత్వం అధికార యత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి, పుర పాలక శాఖ మంత్రి అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. మంత్రి నారాయణ మూడు పర్యాయా లు రాజమండ్రిలో అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ నాగరాణి నరసాపురం ప్రాంతంలో చేపట్టాల్సిన పనులపై సమీక్ష నిర్వహించి ప్రతిపాదనలు అందించాల ని ఆదేశించారు. కొన్ని శాఖలు మొద్దు నిద్ర వీడలేదు. స్నానాల రేవులు, లైటింగ్, డ్రసింగ్‌రూమ్, రోడ్లు, రవాణ సౌకర్యం, వసతి, ఆలయాల దర్శనంపై ఏ పనులు చేపట్టాలి, అంచనా వ్యయం ఎంత, తదితర ప్రతిపాదన లు వివిధ శాఖలు అందించాల్సి ఉంది. ఇంతవరకు కొన్నిశాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేయలేదు.
గతంలో రూ.200 కోట్ల పనులు
2015లో గోదావరి పుష్కరాలకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.200 కోట్ల పనులకు ఆమోద ముద్ర వేసింది. పురపాలక సంఘానికి సంబంధించి రూ.70 కోట్లు ఉన్నాయి. తరువాత ఆర్‌అండ్‌బి రెండో స్థానంలో నిలిచింది. దాదాపు రూ.50 కోట్ల పనులకు అనుమతి లభించింది. ఆ పుష్కర పనుల్లోనే నరసాపురం– మత్స్యపురి రహదారి రూ.25 కోట్లతో ఆభివృద్ధి చేశారు. పంచాయితీరాజ్ చేపట్టిన పనుల్లో చిన మామిడిపల్లి నుంచి పాలకొల్లు మండలం దిగమర్రు వరకు కాల్వ రోడ్ ఉంది. పురపాలక ఏటిగట్టును మార్బుల్స్‌తో సుందరీకరించింది. ట్రాన్స్‌కో చేపట్టిన పనుల్లో రెండు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. పట్టణ, మండలాల్లో లోవోల్టేజ్ సమస్య పరిష్కారానికి అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. శిఽథిలావస్థకు చేరిన ఆలయాలకు కొత్త రూపు వచ్చింది. పట్టణంలో మూడు స్నానాల రేవులు మాత్ర మే ఉండేవి. స్నానాల రేవు సంఖ్య పెరిగింది. వలంధర్ రేవుకు ఆర్చి ఏర్పడింది. పురపాలకంలో తాగునీటి సమస్య లేకుండా 11 కిలో మీటర్ల మేర ఓహెచ్‌ఆర్‌లను కలుపుతూ పెద్ద పైప్‌లైన్ ఏర్పాటుచేశారు.
ప్రస్తుతం రెండు శాఖల ప్రతిపాదనలు
రానున్న పుష్కరాలకు ప్రతిపాదనలు చేయడంలో అధికార యంత్రాంగంలో కదలిక లేదు. పుష్కరాల్లో భక్తు ల రద్దీ అధికంగా ఉంటుందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దానికి తగట్టుగా పనులు చేపట్టాలని అన్ని శాఖల ఆధికారుల్ని అప్రమత్తం చేసినా ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం కావడం లేదు. పురపాలక సంఘం మొద్దు నిద్రలో ఉంది. ఇంత వరకు ఏఏ పనులు చేయా లన్న దానిపై ఇంత వరకు ఇంజనీరింగ్ అధికారులకు ఒక స్పష్టత లేదు. పాత పనులనే తిరగేసే పనుల్లో ఉన్నారు. ఇక ఏటిగట్టుల శాఖ మాత్రం రూ 15 కోట్లు స్నానాల రేవుల ఆభివృద్ధి, ఏటిగట్టు పటిష్టం పనులకు ప్రతిపాధనలు ఇచ్చింది. ఇక ట్రాన్స్‌కో రూ 18 కోట్లకు సంబంధించి ప్రతిపాధనలు సిద్ధం చేసి ప్రభుత్వ అమోదానికి పంపింది.
ఈ పనుల పరిస్థితి ఏమిటి..?
గత పుష్కరాల్లో ట్రాఫిక్ జామ్‌తో భక్తులు ఇబ్బం దులకు గురయ్యారు. ఈసారి 216 జాతీయ విస్తరణ వల్ల ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నయ మార్గాలను గుర్తించి రోడ్లను విస్తరించాల్సి ఉంది. వీటిల్లో పంచాయి తీరాజ్, ఆర్‌అండ్‌బి సంయుక్తంగా ప్రతిపాదనలు చేపట్టాల్సి ఉంది. ఆలయాలకు సంబంధించి దేవదాయ శాఖ, తాగునీటి ఇబ్బందులు లేకుండా గ్రామీణ నీటి సరఫరా, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సు లు, సీసీ కెమెరాలు ఏర్పాటుపై ప్రతిపాదనలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు రెండు శాఖలు మినహా మిగిలిన శాఖల్లో వేగం లేదు.ఇందులో కీలకంగా ఉండే పుర పాలక శాఖ కూడా ఇంకా వెనకంజులో ఉంది. దీనిపై మునిసిపల్ డీఈ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.