పంచాయతీ సొమ్ము గల్లంతు!
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:17 AM
అభివృద్ధి పథంలో నడవవలసిన గ్రామాలు పంచా యతీ నిధుల అవకతవకలతో సతమతం అవుతున్నాయి.

దిరుసుమర్రులో అవకతవకలపై డీఎల్‌పీవో విచారణ
భీమవరం రూరల్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పథంలో నడవవలసిన గ్రామాలు పంచాయతీ నిధుల అవకతవకలతో సతమతం అవుతున్నాయి. ఇటీవల భీమవరం మండలంలోని రాయలం, చిన అమిరం గ్రామాల్లో రూ. 5 కోట్ల నిధుల దుర్వినియోగం మచ్చపడింది. తాజాతా దిరుసుమర్రులో పంచాయతీ బిల్లుల అవకతవకల ఫిర్యాదుతో గురువారం ఇక్కడ విచరాణ జరిగింది. గ్రామానికి చెందిన అల్లూరి గంగాధరరాజు ఫిర్యాదుతో డీఎల్‌పీవో బాలాజీ రికార్డులు పరిశీలించారు. వారం రోజులపాటు రికార్డుల పరిశీలించాల్సి ఉంటుందని, తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. రాయలంలో రూ.2.33 కోట్లు, చిన అమిరంలో రూ.2.7 కోట్లు పూర్వ కార్యదర్శులు దుర్వినియోగం చేసినట్లు ధ్రువీకరించారు. దిరుసుమర్రులో కూడా ఇలాంటి ఫిర్యాదుతో గ్రామంలో ఏ మేరకు నిధులు దుర్వినియోగమయ్యాయని గ్రామస్తుల్లో చర్చనీయాంశమైంది. గ్రామ కార్యదర్శులు బదిలీపై ఇతర ప్రాంతాలకు వె ళ్లినా ఫిర్యాదుల నేపథ్యంలో పరిశీలనకు రావలసి వస్తుంది. దిరుసుమర్రు గ్రామానికి చెందిన పూర్వ కార్యదర్శి కృష్ణమోహన్ ఈ పరిశీలనకు హాజరుకావలసి వచ్చింది. పాలకవర్గం ఉన్నందున గ్రామ సర్పంచ్ కూడా పాల్గొన్నారు.