Share News

లంచం ఇస్తేనే సాగు

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:22 AM

కొల్లేరు జిరాయితీ భూముల్లో సాంప్రదాయ సాగు చేసుకోవడానికి అనుమతి కోసం వేడుకొంటుంటే లంచాలు డిమాండ్‌ చేస్తూ మానసిన క్షోభకు గురిచేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

లంచం ఇస్తేనే సాగు
సి.సి. ఫుటేజీలో లంచం దృశ్యం

సన్న, చిన్నకారు రైతుల్ని పీక్కుతింటున్న ఓ ఫారెస్టు ఆఫీసర్‌

ఎంత లంచం ఇచ్చినా చాలడం లేదంటూ మరింత డిమాండ్‌

లంచగొండి అధికారిపై చర్యలు తీసుకోవాలని రైతుల వేడుకోలు

లంచగొండిలపై చర్యలు తీసుకోవాలి

మా అన్నదమ్ములకు అంతా కలిపి 5.5 ఎకరాల భూమి ఉన్నది. మా అన్నగారి అమ్మాయికి దీని నుంచి ఒక ఎకరం భూమి కట్నం గా ఇచ్చాం. ఈ భూమికి సాగు లేక ఆదాయం లేక కాపురంలో కలతలు కూడా వచ్చాయి. మగతా కోసం గొడవలు పడడంతో పెద్దల మధ్య సఖ్యత కుదిర్చి ఆ మగ తా సొమ్ము మా అన్న కుటుంబం కూలిపని చేసుకొంటూ కౌలు చెల్లిస్తున్నారు. పొలం సాగైతే బాగుంటుందని బావించి పారెస్టు ఆఫీసురు అడిగిన రూ.30వేలు ఫిబ్రవరి 6వ తేదీన లంచం ఇచ్చాం. మరలా సొమ్ములు చాల్లేదని అడగటంతో ఫిబ్రవరి 10న మరో 10 వేలు ఫోన్‌పే చేశాం. ఇంకా చాలదంటూ రోజు హింసిస్తున్నాడు. మా జిరాయితీ భూముల్లో సాగుకు అనుమతి ఇవ్వాలి.

– మండా పోలయ్య, రైతు, నిడమర్రు

నిడమర్రు ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : కొల్లేరు జిరాయితీ భూముల్లో సాంప్రదాయ సాగు చేసుకోవడానికి అనుమతి కోసం వేడుకొంటుంటే లంచాలు డిమాండ్‌ చేస్తూ మానసిన క్షోభకు గురిచేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏలూరు జిల్లా నిడమర్రు గ్రామం వెంకటాపురంలో సుమారు 200 మంది పైచిలుకు సన్న, చిన్నకారు రైతులకు 600 ఎకరాలు కొల్లేరు జిరాయితీ భూమి ఉన్నది. తాతల కాలం నుంచి కొల్లేరు భూములపై ఆధారపడి సాంప్రదాయ వ్యవసాయ సాగు చేస్తున్నారు. ఆ భూమిని సాగుచేసుకొని రైతులు తమ కుటుంబ జీవనాన్ని గడుపుకొనేవారు. కాలం గడుస్తున్న కొద్దీ కోల్లేరు అన్‌సర్వే భూముల్లో ఇష్టారాజ్యంగా రొయ్యలు, చేపల చెరువుల తవ్వకం వలన వ్యవసాయ పొల్లాల్లో ఉప్పునీరు చేరిపోయి సాగుకు ఆటంకం ఏర్పడింది. రైతులు తమ పొలాలను వదిలి ఏమి చేయలేక కూలీనాలీ చేసుకొని బ్రతువెళ్లదీస్తున్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాలో జిరాయితీ భూములలో చెరువులను ధ్వంసం చేశారు. కానీ రైతులకు నష్టపరిహారం అందివ్వలేదు. అయితే గత ఏడాది రైతులు సాగుకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో సాగుకు అనుమతి ఇవ్వాలంటే లంచం ఇవ్వాలనే డిమాండ్‌ అధికారుల నుంచి వచ్చింది.

సాగు చేయాలంటే

లంచం ఇవ్వాల్సిందే

గత సంవత్సరం నిలుపుదల చేసిన భూము ల్లో సాగు నిమిత్తం అంతా తానే చూసు కొంటానంటూ ఏలూరు జిల్లా ఫారెస్టురేంజ్‌ ఆఫీసులో సెక్షన్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న నబిగరి శ్రీనివాసబాబు రైతులతో లంచాల రాయభారం నడిపాడు. తొలుత ఎకరానికి రూ.30 వేలు ఇస్తే సాగుచేసుకోవచ్చని రైతులను నమ్మబలికాడు. ఆ మాటలు నమ్మి చాలామంది రైతులు కొంతమొత్తంలో సొమ్ములు కూడా చెల్లించారు. మరో దఫాగా మరో రూ.10 వేలు డబ్బులు డిమాండ్‌ చేయగా రైతు మండా పోలయ్య ఆ ఉద్యోగి సొంత నెంబరుకు ఫోన్‌ పేకు రూ.10 వేలు కూడా లంచంగా ఇచ్చాడు. ఇదీ చాలదంటూ మరో రూ.10వేల డిమాండ్‌ చేస్తున్నాడని రైతులు ఆవేదన చెందుతున్నారు. చేసేది లేక మీడియాను ఆశ్రయించామని రైతులు చెబుతున్నారు.

ఉన్నతాధికారులకు ఇవ్వాలంటూ ఒత్తిడి

తాను జిల్లా కార్యాలయ ఉద్యోగినని, తన చేతిలో ఉన్నతాధికారులు ఉన్నారని, తానుఏమి చెబితే వారు అదే చేస్తారని రైతులను నమ్మ బలికాడు. తాను ఏలూరు జిల్లా పారెస్టు ఆఫీ సును చూసుకొంటానని, తనకు సొమ్ములు ముట్టచెబితే ఉన్నతాధికారులకు మామూళ్ళు సమర్పించి మీ పని మూడోకంటోడికి తెలియ కుండా చేస్తానని మాయ మాటలు చెప్పాడు. ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాసు బాబుకు లంచం ఇచ్చిన సొమ్ము సి.సి.ఫుటేజ్‌లు, ఫొటో లతో సహా ఉన్నాయని, ఫోన్‌పే రసీదులు కూడా తమ వద్ద ఉన్నాయని రైతులు చెబు తున్నారు.

విచారణ చేపడతాం

బి.విజయ, డీఎఫ్‌వో (వైల్డ్‌ లైఫ్‌)

ఏలూరు జిల్లా

అటవీ సిబ్బందిపై లంచం ఆరోప ణలు ఇప్పుడే తన దృష్టికి వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడతాం. ఆరోపణలు నిజ మని తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటాం. లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరం.

Updated Date - Feb 15 , 2025 | 12:22 AM