గాడి తప్పిన పాలన!
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:17 AM
మునిసిపల్ ఉద్యోగులపై ఒత్తిడి కత్తి వేలాడుతోంది. సొంత పనుల కోసం గత ప్రభుత్వంలో ఉద్యోగులను బలి చేశారు. నాన్ లే అవుట్‌లు వేస్తూ ఇప్పుడు మునిసిపల్ సిబ్బందిని ఎప్పుడు ఏమరుపాటు చేస్తున్నారు.

ఇన్‌చార్జిల ఏలుబడిలో పెరిగిన పని భారం
గగ్గోలుపెడుతున్న ఉద్యోగులు
నరసాపురం రావాలంటేనే హడల్
ఇప్పటికీ పట్టణ ప్రణాళికలో ఇబ్బందే
పారిశుధ్య నిర్వాహకులకు
వాహనాలు ఏవీ
ఇది.. పట్టణాల్లో దుస్థితి
(భీమవరం/ఆకివీడు–ఆంధ్రజ్యోతి)
మునిసిపల్ ఉద్యోగులపై ఒత్తిడి కత్తి వేలాడుతోంది. సొంత పనుల కోసం గత ప్రభుత్వంలో ఉద్యోగులను బలి చేశారు. నాన్ లే అవుట్‌లు వేస్తూ ఇప్పుడు మునిసిపల్ సిబ్బందిని ఎప్పుడు ఏమరుపాటు చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు వాహనాలు అందుబాటులో లేవు. తోపుడుబళ్లలో చెత్తను సేకరిస్తున్నారు. ఉన్నతాధికారులు తమ సొంత ప్రయోజనాల కోసం మునిసిపాలిటీలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఆ ప్రభావం ఇప్పుడు సిబ్బందిపై పడుతోంది. ఒకవైపు పనులు చేపట్టాలంటూ ఇంజనీరింగ్ సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు సర్వేలతో సతమతమవుతున్నారు. నర్సాపురం మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక విభాగానికి సిబ్బంది సమస్య వెంటాడుతోంది. అక్కడ నలుగురు సిబ్బంది అవసరం ఉంది. పట్టణ ప్రణాళిక అధికారి లేరు. వైసీపీ హయాంలో ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిడితో సిబ్బంది బలైపోయారు. తణుకు మునిసిపాలిటీలో టీడీఆర్ బాండ్‌లు జారీచేయాలంటూ వైసీపీ నేత ఒత్తిడి తీసుకువచ్చారు. తీరా బాండ్‌లు మంజూరు చేసిన అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. ఇప్పుడు సీబీసీఐడీ విచారణను ఎదుర్కొంటున్నారు. తాడేపల్లిగూడెంలోనూ అదే పరిస్థ్థితి. అక్రమంగా బాండ్‌లు జారీచేయడంలో మునిసిపల్ అధికారులపై వైసీపీ నేత ఒత్తిడి ఉంది. ఆయన లబ్ధికోసం మునిసిపల్ అధికారులు బాండ్‌లు మంజూరుచేశారు. సదరు బాండ్‌ల వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తు సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇస్తారు. చంద్రబాబు నిర్ణయం మేరకు తదుపరి సీబీసీఐడీ విచారణ ఆధారపడి ఉంది. భీమవరంలోనూ బాండ్‌లు జారీచేసిన ఉదంతంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఇలా గతంలో బాండ్‌లు జారీచేసిన సిబ్బందికి కంటిమీద కునుకు ఉండడం లేదు.
సర్వేలతో సంకటం
పట్టణాల పరిధిలో ఇప్పుడు ఐదు సర్వేలు సాగుతున్నాయి. నివాసితులకు జియోట్యాగింగ్ చేస్తున్నారు. సొసైటీల్లో కంప్యూటరీకరణ ప్రక్రియను సచివాలయ సిబ్బందికి అప్పగించారు. మరోవైపు చిరు, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలను గుర్తించి అందరినీ ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్ చేసుకునే ప్రక్రియను మునిసిపల్ సిబ్బందికి అప్పగించారు. పారిశుధ్యం, మంచినీటి వసతులంటూ నిత్యం ఉన్నతాధికారులనుంచి ఆరా తీస్తున్నారు. సర్వే సమయంలో సంబంధిత వ్యక్తులకు సిబ్బంది ఫోన్‌లు చేస్తున్నారు. ఓటీపీ చెప్పాలంటూ అడుగుతున్నారు. అవతలి వ్యక్తులు ఓటీపీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. చీవాట్లు పెడుతున్నారు. దాంతో సర్వే ప్రక్రియ ముందుకువెళ్లడం లేదు. నిరంతం కమిషనర్‌లు వీటిపై ఉన్నతాధికారులకు సమాధానం చెపాల్సి వస్తోంది. సొంతింటి నిర్మాణం కోసం స్థలాలున్న లబ్ధిదారులను గుర్తించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. ఇలా ఒక్కసారిగా మునిసిపల్ సిబ్బందిపై పనిభారం పెరిగింది. ఇంజనీరింగ్ సిబ్బందిపైనా ఒత్తిడి ఉంటోంది. క్షేత్ర స్థాయిలో కాంట్రాక్టర్‌లు స్పందించడం లేదు. వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయలేదు. అప్పటి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. వాటికోసం మునిసిపాలిటీల చుట్టూ కాంట్రాక్టర్‌లు తిరుగుతున్నారు.
పారిశుధ్య వాహనాలకు స్వస్తి
పట్టణాల్లో పారిశుధ్య కార్మికులకు చెత్తసేకరణ వాహనాలు ఉండేవి. ఇంటింటా చెత్త సేకరణకు వైసీపీ హయాంలో కాంట్రాక్ట్ ఏజన్సీకి వాహనాల బాధ్యతను అప్పగించారు. మునిసిపాలిటీలపై ఆ భారం మోపారు. ప్రతి నెలా ఒక్కో వాహనానికి మునిసిపాలిటీ నుంచి రూ. 56వేలు వసూలు చేశారు. ఇలా ప్రతి మునిసిపాలిటీ గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు బకాయి పడింది. దాంతో వాహనాలను నిలిపివేశారు. ఇప్పుడు తోపుడు బండ్లతో చెత్తను సేకరిస్తున్నారు. సిబ్బంది నిలిగిపోతున్నారు. మొత్తంపైన మునిసిపాలిటీల్లో ఒత్తిడితో ఇబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.
ఆకివీడులో అన్నీ సమస్యలే..
మేజర్ పంచాయతీ ఆకివీడును నగర పంచా యతీగా ప్రభుత్వం ప్రకటించిందే తప్ప అక్కడ సరైన వసతులు కల్పించలేదు. సిబ్బందిని నియమించలేదు. దీనితో అక్కడ అన్నీ సమస్యలు ఉత్పన్నమ వుతు న్నాయి. ఆకివీడును వైసీపీ ప్రభుత్వం 2020 జనవరిలో నగర పంచాయతీగా ప్రకటించింది. ఈ పంచాయతీలో సుమారు 40వేలు జనాభా ఉన్నారు. ఈ జానాభాకు తగ్గట్టుగా ఇక్కడ పాలన సజావుగా సాగడా నికి నేటికీ పోస్టులు మంజూరు చేయలేదు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతానికి కమిషనర్‌గా జి.కృష్ణమోహన్, గుడివాడ నుంచి ఇన్‌చార్జి మేనేజర్‌గా వెంకటేశ్వరరావు, భీమవరం నుంచి ఇన్‌చార్జి టీపీవోగా పి.రాధాకృష్ణ, పబ్లిక్ హెల్త్ అండ్ ఇంజనీర్ నుంచి ఇన్‌చార్జి ఇంజనీర్‌గా సురేష్, జంగారెడ్డిగూడెం నుంచి ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా సాకేత్‌ను నియమించారు. వీరి కింద ఐదుగురు ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కార్యాలయంలో పనిచేస్తున్నారు. పట్టణ పరిధిలోని ఐదు సచివాలయాల్లో 55 మంది సిబ్బంది పని చేయాల్సి ఉండగా 18 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురు కమీషనర్లు మారారు. నగర పంచాయతీ పరిధిలో అడ్మినిస్ట్రేటివ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరిం గ్‌కు సంబంధించి ఐదు విభాగాలకు సుమారు 45 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా ఐదుగురు ఇన్ చార్జిలుగా విధులు నిర్వహిస్తున్నారు. మిగిలినవి భ ర్తీ చేయాల్సి ఉంది.
పని భారం పెరగడం వల్లే..
గురువారం టీపీవో రాధాకృష్ణ నగర పంచాయతీ కార్యాలయం బయట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాధాకృష్ణను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రదించింది. రాధాకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యం బాగోకపోవడంతో మూడు రోజులు సెలవు పెట్టినట్టు చెప్పారు. పని భారం పెరగడం వల్ల అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని తాను కమిషనర్‌ను కోరినట్టు చెప్పారు. అయితే కమిషనర్ సక్రమంగా స్పందించలేదని దానితో తాను మనస్తా పంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలిపారు. ఇదిలావుండగా ఆకివీడులో రాధాకృష్ణ పనితీరు సక్రమంగా లేదని కౌన్సిలర్లు పలుసార్లు సమావేశంలో వాపోయారు.
బ్లాక్‌మెయిల్ చేయడమే
నగర పంచాయతీలో రాధాకృష్ణ పెట్రోలు పోసుకోవడం బ్లాక్‌మెయిల్ చేయడమే. టౌని ప్లానింగ్‌కు సిబ్బంది కావాలని ఉన్నతధికారులకు ప్రతిపాదనలు పంపించాం. గతంలో ముగ్గురు సిబ్బంది ఇతర మండలాల నుంచి వచ్చి అతని దగ్గర ఏడాది పనిచేసి చేయలేమని వెళ్ళిపోయారు. రాధాకృష్ణ పనితీరు మందకొడిగా ఉంటుంది. బయట ప్రజల దగ్గర డబ్బులు వసూల్ చేస్తున్నట్లు మాటలు వినబడుతున్నాయి.
– జామి హైమావతి, నగర పంచాయతీ చైర్మన్
ఉన్నతాధికారుల దృష్టికి సిబ్బంది కొరత
నగర పంచాయతీ ఏర్పడిన తరువాత నేటికి పర్మినెంట్ పోస్టులు మంజూరు చేయలేదు. ఇన్‌చార్జిలతోనే పాలన కొనసాగుతున్నది. సిబ్బంది కావాలని ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ విషయమే టీపీవోకు చెబితే బ్లాక్ మెయిల్ చేసేందుకే పెట్రోలు పోసుకొని హంగామా సృష్టించాడు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది.
– జి.కృష్ణమోహన్, నగర పంచాయతీ కమిషనర్