ఎమ్మెల్సీ పోలింగ్ 69.5%
ABN , Publish Date - Feb 28 , 2025 | 01:19 AM
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జరిగింది.
పట్టభద్రుల్లో కానరాని ఉత్సాహం
మధ్యాహ్నానికి తేరుకున్న కూటమి కేడర్
అప్పటికప్పుడు ఓటర్లను రప్పించిన నేతలు
ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ
రాజశేఖరం, వీరరాఘవుల మధ్యేపోటీ
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా జరిగింది. గోదావరి జిల్లాల్లో ఏ ఎన్నికలు వచ్చినా హడావుడే కనిపిస్తుంది. కాని, ప్రచారంలో కనిపించినంత వేగం పోలింగ్ కేంద్రాలకు వచ్చేసరికి చప్పబడింది. 456 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 3,14,984 మంది ఓటర్లకు 2,18,902 మంది ఓట్లు వేశారు. పోలింగ్ శాతం 69.50గా నమోదైంది.
(భీమవరం/ఏలూరు–ఆంధ్రజ్యోతి)
సాధారణ ఎన్నికల మాదిరే ఈ ఎన్నికల్లో ఓటర్లు తొలి రెండు గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకుంటారని అధికారులు భావించారు. దీనికి భిన్నంగా ఓటర్లలో అలాంటి ఉత్సాహం కనిపించలేదు. ఉదయం నుంచి పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. తొలి రెండు గంటల్లో కేవలం 5.77 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఆరంభంలోనే అనేక పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోయాయి. ఉదయం 11 గంటల తర్వాత క్రమేపీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రావడం ఆరంభమైంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఇదే వాతావరణం కనిపించింది. తొలి నాలుగు గంటల్లోనే కేవలం 20 శాతమే నమోదైంది. పోలింగ్ శాతం అతి తక్కువగా ఉండడంతో టీడీపీ వర్గాలు మధ్యాహ్నానికి అప్రమత్తమయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. స్వేచ్ఛగా ఓటు వేయడంటూ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ఎమ్మెల్యేలంతా తమ వంతు పాత్ర పోషించారు. అతి తక్కువ ఓటర్లున్న అల్లూరి సీతారామరాజు జిల్లా పోలింగ్ శాతంలో ముందు వరుసలో నిలిచింది. 4,669 మంది ఓటర్లకు 3,637 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 77.90 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఈ జిల్లాలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య అత్యల్పమే. ఏలూరు జిల్లాలో 42,282 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 29,651 మంది ఓటు హక్కును వినియో గించుకున్నారు. జిల్లా కేంద్రం ఏలూరులో అన్నీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పలుచగానే కనిపించారు. నిర్ణీత సమయానికి ముందుగానే పోలింగ్ కేంద్రాలు ఖాళీ అయ్యాయి.
పశ్చిమలో 69.80 శాతం
పశ్చిమ గోదావరి జిల్లాలోని 93 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి పట్టభద్రులు ఓటు వేసేందుకు తరలివచ్చారు. తొలుత మందకొడిగా ప్రారంభమైనప్పటికి ఓటింగ్ పది గంటలకు ఊపందుకుంది. జిల్లాలో 70,052 మంది పటభద్రుల ఓటర్లుకు గాను 48,893 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 27,960, మహిళలు 20,933 మంది ఉన్నారు. పోలింగ్ 69.80 శాతంగా నమోదైంది. పాలకొల్లు నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైంది. పాలకొల్లు, యలమంచిలిలో సగటున 72 శాతం మంది పట్టభద్రులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పెంటపాడు మండలం 344 పోలింగ్ కేంద్రంలో 78 శాతం ఓటింగ్ నమోదైంది. అక్కడ 606 మంది ఓటర్లు ఉంటే 447 మంది ఓటు వేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూటమి నేతలు ఖర్చులు భరించారు. పాలకొల్లు వంటి నియోజకవర్గాల్లోనే దూరప్రాంతాల నుంచి ఓటర్లను రప్పించారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
జిల్లా కలెక్టర్ నాగరాణి భీమవరం, వీరవాసరంలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఓటర్లతో మాట్లాడి పోలింగ్ తీరుతెన్నులు, ఇబ్బందులపై ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ 93 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా సాగిందన్నారు. పోలింగ్ ప్రక్రియను కలెక్టరేట్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించినట్లు తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత్ బ్యాలెట్ బాక్సులను భీమవరం కలెక్టరేట్‌కు, ఆపై ప్రత్యేక వాహనంలో ఏలూరులోని స్ట్రాంగ్ రూముకు తరలిస్తామన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘట నలు జరగకుండా జిల్లా ఎస్సీ అద్నాన్ నయీం ఆస్మి పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు.
పోలింగ్ ఆసాంతం పోటా పోటీ
పోలింగ్ మందకొడిగా సాగినా.. తెలుగుదేశం అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు మఽధ్య పోటీ హోరాహోరీగా సాగినట్లే కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగుదేశం, పీడీఎఫ్ అనుకూలురు ఎక్కడికక్కడ గుమిగూడి ప్రచారం చేశారు. టీడీపీ పక్షాన ఓట ర్లకు ఎరవేసేందుకు ప్రయత్నించారంటూ పీడీఎఫ్ అభ్యర్థి మద్దతుదారులు ఆరోపణలు చేశారు. ఎన్నికల నిబంధనలకు పాతరేసి డబ్బులు పంపిణీ చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారని సీఐటీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు లింగరాజు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ఆరోపించారు. ఎన్నికల శిబిరాల పేరుతో జాతరలా నిర్వహించారని, దొంగ ఓట్లు వేసేందుకు బరి తెగించారంటూ టీడీపీపై ఆరోపణలు చేశారు. జరిగిన అక్రమాలపై ఎన్నికల అఽధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.
ఓటర్ల స్లిప్పులు ఎక్కడ ?
అధికార యంత్రాంగం గ్రాడ్యుయేట్ ఓటర్ల ఓటర్ల స్లిప్పుల పంపిణీ సక్రమంగా చేయలేకపోయింది. దీంతో ఓటర్ల స్లిప్పుల కోసం పడిగాపులు, ఎదురుచూపులు తప్పలేదు. సాధా రణ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ కేంద్రాలు కొంత దూరంగా ఉండడంతో ఓటర్ స్లిప్పుల కోసం హైరానా పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, పీడీఎఫ్ నేతలు ఏర్పాటు చేసిన టెంట్ల వద్ద ఓటర్ స్లిప్పులను తీసుకుని వేశారు. కొంత మంది ఎన్నికల సంఘం ఇచ్చిన వాట్సాప్ నెంబ ర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వచ్చి ఓట్లేశారు.
ఓట్లు వేసిన ప్రముఖులు
పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఓటు వేసిన ప్రముఖుల్లో భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు, భీమవరంలో శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు, ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు, తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి. గోపీమూర్తి, ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి, పోలవరంలో బాలరాజు, చింతల పూడిలో సొంగా రోషన్‌కుమార్, తదితర ప్రముఖులు ఓటును వినియోగించుకున్నారు.
జిల్లా పోలింగ్ కేంద్రాలు మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
1. ఏలూరు 66 42,282 29,651 70.13
2. పశ్చిమ గోదావరి 93 70,052 48,893 69.80
3. తూర్పుగోదావరి 92 62,970 42,446 67.41
4. కాకినాడ 98 70,540 47,150 66.84
5. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ 95 64,471 47,125 73.09
6. అల్లూరి సీతారామరాజు 12 4,669 3,637 77.90
మొత్తం 456 3,14,984 2,18,902 69.50