Share News

అభివృద్ధే అజెండా

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:02 AM

రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటన విజయవంతమైంది.

 అభివృద్ధే అజెండా
ఉండిలో హైస్కూల్‌ను ప్రారంభిస్తున్న మంత్రి లోకేశ్‌.

ఉండి హైస్కూల్‌ భవనం ప్రారంభం

పారిశ్రామికవేత్త టాటా విగ్రహావిష్కరణ

ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు హితబోధ

పార్టీ శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

నెల రోజుల్లో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం..

(భీమవరం/రూరల్‌/టౌన్‌/ఉండి/కాళ్ల–ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటన విజయవంతమైంది. పర్యటన ఆద్యంతం సందడిగా రాజకీయాలకతీతంగా మంత్రి పర్యటన సాగింది. తొలుత ఉండి జడ్పీ హైస్కూల్‌లో పునఃనిర్మించిన భవనాన్ని ప్రారంభించి చిన్నారులతో ముచ్చటించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడంపై ఉపాధ్యాయులతో ప్రస్తావించారు. మంచినీటి సౌకర్యం లేక పిల్లలు అనారోగ్యం బారినపడి పాఠశాలకు రావడం లేదంటూ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఏ విధంగా చెబుతున్నారు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. అందుకు తగిన విధంగా చదువుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా వుండాలని అవి ఎంతో ప్రమాదకరమన్నారు. పాఠశాల ఆవరణలో రూ.18 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు. సెటిల్‌ కోర్టులను, పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. స్థానిక మహిళలు లోకేశ్‌ను చూస్తూ కేకలు వేయడంతో పాఠశాల గోడ వద్దకు వచ్చి వారి నుంచి వినతి పత్రం తీసుకున్నారు. ‘కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేరుస్తోంది. పెన్షన్‌ పెంచాం. ఉచిత సిలిండర్‌లు అందజేస్తున్నాం. త్వరలో తల్లికి వందనం ఇస్తామ’ంటూ వారికి భరోసా ఇచ్చారు.

టాటా విగ్రహావిష్కరణ

అనంతరం పెద అమిరంలోని రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. రతన్‌టాటా వంటి గొప్ప వ్యక్తులను విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకోవాలని కర్తవ్యబోధచేశారు. ఉండి నియోజకవర్గం ఎప్పుడూ మా గుండెల్లో ఉంటుంది. ఏ రోజూ మరచిపోలేం. అంతగా మమల్ని ఆదరించింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు అండగా నిలిచింది. ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే ఏమిటో తెలుసా.. రియల్‌, రెస్పాన్స్‌బిలిటీ, రెబల్‌. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత ఫోన్‌ చేసిన తొలి పది మందిలో రఘురామ ఒకరు. ధైర్యం చెప్పారు. ఢిల్లీలో ఉన్నప్పుడు నాతో వెన్నంటి ఉన్నారు. ప్రతిపక్షంలో అప్పుడు ఉన్నా ఎంపీగా ఉన్న ఆయన కోర్టులో ఏమి చేయాలో సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివద్థి పథంలో నడిపిస్తున్నారు. దాతలను సమీకరించి కాలువలు, డ్రెయిన్‌లు బాగు చేస్తున్నారని ఆర్‌ఆర్‌ఆర్‌ను కొనియాడారు. విద్యార్థులతో సభ ముగిసిన అనంతరం రఘురామకృష్ణరాజు నివాసానికి వెళ్లి, విందు స్వీకరించారు.

హంగూ ఆర్భాటాలు వద్దు

లక్ష రూపాయలతో శాశ్వత సభ్యత్వం తీసుకున్న ఉత్తమ కార్యకర్తలతో లోకేశ్‌ సమావేశమయ్యారు. పార్టీ పదవుల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని పేర్కొన్నారు. నా యకుల పర్యటనల్లో ఎటువంటి హంగు, ఆర్భాటాలు వద్దు. అహంకారం, విచ్చలవిడితనాన్ని ప్రజలు అంగీకరించరు. జగన్‌ హయంలో జరిగిన విధ్వంసం వలన రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగింది. ఇచ్చిన ప్రతి హామీని క్రమపద్ధతిలో అమలు చేస్తున్నాం. మనల్ని ప్రశ్నించే హక్కు జగన్‌ కు లేదు. కార్యకర్తల ఆరోగ్యం కోసం, వారి పిల్లల ఉద్యోగాల కోసం పార్టీ కార్యాలయం ద్వారా సాయం అందించేలా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. నెల రోజుల్లో అన్ని నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తాం. గత ఐదేళ్లు క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికే ప్రాధాన్యతనిస్తాం. గ్రామస్థాయి కార్యకర్త పొలిట్‌ బ్యూరో స్థాయికి తీసుకెళ్లేలా ఒక ఆలోచన చేస్తున్నాం. అంద రూ ఒప్పుకుంటే దానిపై నిర్ణయం తీసుకుంటాం. రెండు పర్యాయాలు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్ళాలి లేదా ఉన్న పదవి నుంచి వైదొలగి ఒక టర్మ్‌ ఖాళీగా అయినా ఉండాలి. ఆ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంటే నేను, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వచ్చే విడత పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలుగా పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది’ అని అన్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, పీఏసీ చైర్మన్‌ పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మంతెన రామరాజు, ఏపీఎస్‌సీపీసీ ఛైర్‌పర్సన్‌ పీతల సుజాత, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, మద్దిపాటి వెంకట్రాజు, సొంగా రోషన్‌ కుమార్‌, బడేటి రాధాకృష్ణ(చంటి), పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ సి.నాగరాణి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, జడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, జెసి రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఈవో నారాయణ, హెచ్‌ఎం వై.రామలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, టీడీపీ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

ఆంక్షలతో అసహనం..

లోకేశ్‌ పర్యటనలో పోలీసులు పలు ఆంక్షలు విఽధించారు. ఉండి హైస్కూల్‌లోకి మీడియా వెళ్లకుండా అడ్డు తగిలారు. లోకేశ్‌ పాఠశాలలోకి వెళ్లిన తర్వాత మీడియాకు అనుమతించారు. రఘురామకృష్ణరాజు నివాసం వద్ద పాస్‌లు ఉన్న కార్యకర్తలకు లోపలికి విడచిపెట్టలేదు. వారు అసహనానికి గురయ్యారు. మీడియాను అనుమతించలేదు.

Updated Date - Jan 07 , 2025 | 01:02 AM