Share News

ఆశల పూత

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:31 AM

మామిడి పూత ఆశాజనకంగా ఉండడంతో రైతు మురిసిపోయాడు. పూత పిందె కట్టక మాడిపోవడంతో నిరాశ చెందాడు.

ఆశల పూత

పూతతో మామిడికి కళ

పిందె కట్టక నిరాశ

కోడిపేను, తెగుళ్ల దాడి

నివారణకు రైతుల పాట్లు

తప్పని పెట్టుబడి భారం

నూజివీడు టౌన్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మామిడి పూత ఆశాజనకంగా ఉండడంతో రైతు మురిసిపోయాడు. పూత పిందె కట్టక మాడిపోవడంతో నిరాశ చెందాడు. మాత్రం చేదు మాత్రమే మిగులుతోంది. ఏటా నష్టాల ఊబి నుంచి గట్టెక్కుతామనే ఆశతో ఉన్న మామిడి రైతుకు ఈ సంవత్సరం కూడా నిరుత్సాహమే మిగిలింది. నూజివీడు డివిజన్‌ పరిధిలో దాదాపు 60వేల హెక్టార్లలో మామిడి సాగులో ఉంది. నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు, ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో 56వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. బంగినపల్లి, తోతాపురి, చిన్నరసం, పెద్దరసం తదితర రకాలను రైతులు సాగు చేస్తున్నారు. సాధారణంగా డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు మామిడి పూత దశలో ఉంటుంది. గత సీజన్‌లో నూజివీడు ప్రాంతం లో మామిడి దిగుబడులు అరకొరగా ఉంది. జూన్‌ నుంచి వర్షాలు పుష్కలంగా ఉండడంతో అందుకు తగ్గట్లుగానే ప్రస్తుత సీజన్‌లో పూత ఆశాజనకంగా వచ్చాయి. 15, 20 రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో మామిడి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. మామిడిపై కోడిపేను ఉధృతితో పూత పిందెకట్టుగా మారక ముందే మాడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూతలో కొద్దిశాతం మాత్రమే పిందెకట్టు కావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా బంగినపల్లి, కలెక్టర్‌ రకాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కోడిపేనుతో పాటు మసిమంగు, ఎర్రనల్లి తదితర చీడపీ డలు ఉధృతి పెరగడంతో వచ్చిన కాపును నిలబెట్టుకునేందుకు రైతులు తీవ్ర వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తోంది.

పురుగు మందుల పిచికారీ

మామిడిలో చీడపీడల ఉధృతితో రైతులు సస్యరక్షణ చర్యల్లో భాగంగా పరిమితికి మించి పురుగుమందులు పిచికారీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మామిడిపై రెండుకు మించి పురుగు మందులు పిచికారీ చేయడం వేళ్లపై లెక్కించే సందర్భంగా ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పది రోజులకు ఒకసారి పురుగు మందు పిచికారీ చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో మామిడి రైతులు, కౌలుదారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. పేను మాత్రం నివారణ కావడం లేదని రైతులు వాపోతున్నా రు. రెండు, మూడు సీజన్‌ల నుంచి కోడిపేను ఉధృతి అధికంగా ఉంది. దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసి రైతుకు చేరువ చేయకపోతే నూజివీడు మామిడి చరిత్రగానే మిగిలే ప్రమా దం ఉంది. ఆ దిశగా అడుగులు వేయడంలో వైఫల్యం రైతులకు శాపంగా మారింది.

Updated Date - Feb 24 , 2025 | 12:31 AM