Share News

కూటమి కేక

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:22 AM

ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గంలో తొలిసారి తెలుగుదేశం పతాకం రెపరెపలాడింది. కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ప్రారంభమై మంగళవారం మధ్యాహ్నం వరకు సుమారు 30 గంటలకు పైగా సాగింది.

కూటమి కేక
విజేత రాజశేఖరం, టీడీపీ పశ్చిమ, ఏలూరు జిల్లాల అధ్యక్షులు రామరాజు, గన్ని విజయ సంకేతం

పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలుగుదేశందే

భారీ ఆధిక్యతతో రాజశేఖరం గెలుపు

కలిసొచ్చిన ఉమ్మడి బాధ్యత

వెనుకబడిన పీడీఎఫ్‌ అభ్యర్థి వీరరాఘవులు

హ్యాట్రిక్‌ కలలు గల్లంతు

ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గంలో తొలిసారి తెలుగుదేశం పతాకం రెపరెపలాడింది. కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ప్రారంభమై మంగళవారం మధ్యాహ్నం వరకు సుమారు 30 గంటలకు పైగా సాగింది. మొదటి రౌండ్‌ నుంచి తెలుగుదేశం అభ్యర్థి ఆధిక్యతతో దూసుకుపోయారు. సమీప పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు పై ఆధిక్యత కనబరిచారు. ఓట్ల లెక్కింపును సోమవారం రాత్రి రాజశేఖరం, వీరరాఘవులు, మరి కొందరు అభ్యర్థులు పరిశీలించారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రులు తెలుగు దేశం వైపు మొగ్గారు. రాజశేఖరంను భారీ మెజార్టీతో గెలు పొందేలా చేశారు. ప్రాధాన్యత క్రమంలో టీడీపీ అభ్యర్థి అలవోకగా విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లు 2,18,927 కాగా చెల్లుబాటైన ఓట్లు 1,99,208. రాజశేఖరంకు 1,24,702 ఓట్లు లభించాయి. చెల్లుబాటు ఓట్లలో 62.5 శాతం ఓట్లు టీడీపీ అభ్యర్థికే దక్కినట్టయింది. ప్రచారం, పోలింగ్‌ దగ్గర నుంచి కూటమి నేతలు ఉమ్మడి బాధ్య త స్వీకరించడం, క్రమపద్ధతిలో ఓటర్లను పోలింగ్‌ కేంద్రం వరకు వెళ్లేలా చేయడంతో టీడీపీ అభ్యర్ధి రాజశేఖరంకు 77,421 ఓట్ల ఆధిక్యత లభించింది. దీనికితోడు పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ పక్షాన గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా పేరాబత్తుల. వాస్తవానికి కౌంటింగ్‌ ఆరంభం నుంచి ఏదొక రౌండ్‌లో తమది పైచేయి కాకపోతుందా అని ఎదురుచూసిన పీడీఎఫ్‌ అభ్యర్థి వీర రాఘవులుకు నిరాశ తప్పలేదు. ప్రతీ రౌండ్‌లో రాజశేఖరం పట్టభద్రుల మద్దతు కూడగట్టుకుంటూ వచ్చారు. మొత్తం ఎనిమిది రౌండ్‌లలో ఏ ఒక్క రౌండ్‌లో రాజశేఖరంను దాటి మిగతా అభ్యర్ధులెవరూ ముందుకు సాగలేకపోయారు.

కలిసొచ్చిన ఉమ్మడి కూటమి

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకోవాలని తొలుత నుంచి కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు అన్నిచోట్ల ఏకమయ్యాయి. ఆఖరు కు ఓట్ల నమోదు దగ్గర నుంచి ఓటర్ల జాబితా విడుదల వరకు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం నేతలే దగ్గరుండి పరిశీలించుకున్నారు. తప్పొప్పులను బేరీజు వేశారు. దీనికి సమాంతరంగా పోలింగ్‌ సమయంలోను తీసుకున్న జాగ్రత్తలు పేరాబత్తులకు కలిసొచ్చాయి. ఎక్కడా నిర్లక్ష్యం పాటించకుండా పట్టభద్రులను పోలింగ్‌ కేంద్రాలకు వెళ్ళేలా చేసి వారి మద్ధతు కూడగట్టుకున్న ఫలితంగానే అభ్యర్ధి రాజశేఖరంకు 77 వేల ఓట్ల ఆధిక్యత లభించింది. ఈ కారణంగానే ప్రతీ రౌండ్‌లోను తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. రాజశేఖరంకు మొదటి రౌండ్‌లో 16 వేల 520, రెండవ రౌండ్‌లో 16 వేల 212, మూడవ రౌండ్‌లో 16 వేల 191, నాల్గవ రౌండ్‌లో 15 వేల 482, ఐదవ రౌండ్‌లో 15 వేల 632, ఆరవ రౌండ్‌లో 16 వేల 254, ఏడవ రౌండ్‌లో 16 వేల 040, ఎనిమిదవ రౌండ్‌లో 12 వేల 371 మొత్తం మీద లక్షా 24 వేల 702 ఓట్లు లభించినట్టయ్యింది. దీనికితోడు నేరుగా రౌండ్‌ రౌండ్‌కి ఆధిక్యత ప్రదర్శించడమే కాకుండా అలవోకగా విజయాన్ని సొంతం చేసుకోగలిగారు.

పీడీఎఫ్‌ అభ్యర్థి పూర్తిగా వెనుకంజ

పీడీఎఫ్‌ అభ్యర్ధి దిడ్ల వీర రాఘవులు ఓటర్ల మద్దతు ను కూడగట్టుకోలేకపోయారు. మొదటి రౌండ్‌లో 5,815, రౌండో రౌండ్‌లో 5,421, మూడో రౌండ్‌లో 5,570, నాలుగో రౌండ్‌లో 6,446, ఐదో రౌండ్‌లో 6,413, ఆరో రౌండ్‌లో 5,949, ఏడో రౌండ్‌లో 5,654, ఎనిమిదో రౌండ్‌లో 5,973 ఓట్లు దక్కాయి. ఎమ్మెల్సీ పోటీలో రెండో స్థానంలో మిగిలి పోయారు. పీడీఎఫ్‌ రెండు దఫాలు ఎమ్మెల్సీ పదవి చేజిక్కించుకున్నా వీరరాఘవులు ఓటమితో హ్యాట్రిక్‌ ఆశలు నెరవేరకుండా పోయాయి.

సుందర్‌కు మూడో స్థానం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన 35 మంది అభ్యర్థుల్లో టీడీపీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం మొదటి, పీడీఎఫ్‌ అభ్యర్థి వీరరాఘవులు దక్కిన ఓట్లలో రెండో స్థానం సాధించగా మాజీ ఎంపీ హర్షకుమార్‌ తన యుడు జీవీ.సుందర్‌ మూడో స్థానం దక్కించు కు న్నారు. ఆయనకు 16,183 ఓట్లు దక్కాయి.

చంద్రబాబును నమ్మి గెలిపించారు

కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు పరిపాలనా కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులు నమ్మారు.. అందుకే నన్ను మెజార్టీతో గెలిపించారు. నమ్మి గెలిపించిన పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటా. పట్టభద్రులకు నిరంతరం అందుబాటులో ఉంటా.. రాష్ట్ర, అభివృద్ధి, యువతకు విద్య, ఉపాధి సౌకర్యాల కల్పనలో నా వంతు పాత్ర పోషిస్తా..

– పేరాబత్తుల రాజశేఖరం

యువత సమస్యలపై పనిచేస్తా

తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలపై మండలిలో పోరాటం చేస్తానని ఓట్లు కోరాను. తనకు అవకాశం ఇవ్వలేదు. నేను బయట నుంచి నిరుద్యోగుల సమస్యలపై ఇక పోరాటం చేస్తా.. చాలా ఎక్కువ సంఖ్యలో చెల్లని ఓట్లు తేలడం కొంత పట్టభద్రుల్లో తొట్రుపాటు, ఒత్తిడి, అవగాహన లేమి కారణం అయి ఉండవచ్చు. రానున్న కాలంలో ఓటుపై మరింత అవగాహన కల్పిస్తా..

– దిడ్ల వీరరాఘవులు

అభ్యర్థి పేరు పోలైన ఓట్లు

1. పేరాబత్తుల రాజశేఖరం(టీడీపీ) 1,24,702

2. కాట్రు నాగబాబు 565

3. షేక్‌ హుస్సేన్‌ 394

4. కట్టా వేణుగోపాలకృష్ణ 1017

5. కాండ్రేగుల నరసింహం 364

6. కాళ్ళూరి కృష్ణమోహన్‌ 190

7. కుక్కుల గోవిందరాజు 269

8. కునుకు హేమకుమారి 956

9. కైలా లావణ్య 365

10. గౌతమ్‌బాబు కొల్లు 317

11. చిక్కాల దుర్గారావు 665

12. తాళ్ళూరి రమేష్‌ 201

13. దత్తాత్రేయ నోరి 567

14. దిడ్ల వీరరాఘవులు(పీడీఎఫ్‌) 47,241

15. దొరబాబు యాళ్ళ 303

16. నీతిపూడి సత్యనారాయణ 161

17. తినిపి నాగభూషణవర్మ 68

18. పిప్పళ్ళ సుప్రజ 479

19. పేపకాయల రాజేంద్ర 199

20. బొడ్డు శ్రీనివాసరావు 152

21. బొమ్మనబోయిన వి.ఎస్‌.ఆర్‌.మూర్తి 119

22. బొమ్మిడి సన్నీరాజ్‌ 398

23. బండారు రామ్మోహన్‌రావు 709

24. భీమేశ్వరరావు చిక్కా 254

25. మాకి దేవీప్రసాద్‌ 146

26. మెర్ల శాస్త్రులు 103

27. మోకన అంబేద్కర్‌ 129

28. రాజపూడి 95

29. జి.టి.రామారావు 39

30. రేవులగడ్డ ముఖేష్‌బాబు 96

31. వానపల్లి శివగణేష్‌ 772

32. శ్రీనివాస్‌ విష్ణువరుల 190

33. ఎం.శ్రీనివాసరావు 41

34. జి.వి.సుందర్‌ 16,183

35. హసన్‌ షరీఫ్‌ 759

Updated Date - Mar 05 , 2025 | 12:24 AM