కొల్లేరులో కంగారు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:52 PM
కొల్లేరు కబ్జా కోరులపై సుప్రీంకోర్టు మరొకసారి కన్నెర్ర చేసింది. మూడు నెలల్లో దీని సరిహద్దులు గుర్తించాలని ఆదేశాలు జారీచేసింది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఎలాంటి ఆక్రమణలు, సహజ సిద్ధ నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేసింది.

మంచినీటి సరస్సు కబ్జాలపై సుప్రీం కన్నెర్ర
ఆక్రమణల తొలగింపునకు స్పష్టమైన ఆదేశాలు.. సరిహద్దు నిర్ధారణకు మూడు నెలల గడువు
ఉన్నత న్యాయస్థానం తీర్పుతో కలకలం.. ఇప్పటికే 15 వేల 339 ఎకరాల్లో ఆక్రమణల గుర్తింపు
స్థానిక సంస్థలు, సంబంధిత శాఖలకు సవాలు.. స్థానికులను చైతన్యపరిచేందుకు చర్యలేమిటి ?
కొల్లేరు కబ్జా కోరులపై సుప్రీంకోర్టు మరొకసారి కన్నెర్ర చేసింది. మూడు నెలల్లో దీని సరిహద్దులు గుర్తించాలని ఆదేశాలు జారీచేసింది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఎలాంటి ఆక్రమణలు, సహజ సిద్ధ నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారం, కండబలంతో అధికారుల కళ్లు గప్పి నిర్విఘ్నంగా కొల్లేరులో చెరువులు తవ్విన వారికి షాక్ ఇచ్చింది. జిరాయితీ భూముల పరిహారం, రీడార్ సర్వేపై యధాతధ స్థితిని కొనసాగింపుపై ప్రజా ప్రతినిధులు పట్టుబడుతున్న తరుణంలోనే సుప్రీం కొరడా విదిలించింది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
కొల్లేరు సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు. దీని అంతర్భాగంలో దురాక్రమణలు. చేపల చెరువులు పేరిట వేల ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారు. వాతావరణం దెబ్బ తీసేలా ఎరువులు, పురుగు మందుల వాడకంతో మంచినీటి సరస్సు స్థానంలో మురుగు కాసారమైంది. సహజ సిద్ధంగా పెరిగే చేపలు తగ్గుముఖం పట్టాయి. సుదూరం నుంచి ప్రయాణిస్తూ కొల్లేరుకు చేరుకుని కాస్తంత రిలీఫ్ పొందే విదేశీ పక్షుల ఆవాసం దెబ్బ తింది. ఈ పరిస్థితుల్లో పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొల్లేరుకు తిరిగి పునఃస్వరూపం లభించేలా సుప్రీం సాధికార కమిటీ రంగంలోకి దిగింది. 2006లో కొల్లేరులో దరాక్రమణకు గురైన ప్రాంతంలో కొందరు చెరువులను మూడు నెలలకుపైగా శ్రమించి ధ్వంసం చేశారు. స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైనా రాజకీయ ఒత్తిళ్లు పెరిగినా అప్పటి కలెక్టర్ లవ్ అగర్వాల్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం కొల్లేరు ఆపరేషన్‌ను యధావిధిగా కొనసాగించింది. గట్లను బాంబులతో పెల్చేసి ధ్వంసం చేశారు. కొల్లేరు ఆపరేషన్‌లో 70 వేల ఎకరాల్లో వున్న చెరువులను పూర్తిగా తొలగించారు. కొల్లేరు, వన్యప్రాణి సంరక్షణ ముఖ్యమని అప్పట్లో సుప్రీంకోర్టు ప్రకటించింది. ఎవరైనా గీత దాటితే తక్షణ చర్యలు తీసుకోవాలని అటవీ శాఖకు ఆదేశాలు అందాయి. ఈ ఆపరేషన్ జరిగి 19 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో మరొకసారి కొల్లేరులో దురాక్రమణలు, వన్యప్రాణి సంరక్షణ వ్యవహారం సుప్రీంలో విచారణకు వచ్చింది. కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు దాఖలు చేసిన వ్యాజ్యం పరిగణనలోకి తీసుకుని ఇప్పటికీ పర్యావరణానికి విరుద్దంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంను దెబ్బ తీసే విధంగా వేల ఎకరాల్లో తిరిగి చెరువులు తవ్వినట్టు నిర్ధారణకు వచ్చారు. కొల్లేరు భూభాగంలో ప్రకృతి సిద్ధంగా నీటి ప్రవాహం ముందుకు సాగాలే తప్ప, దీనిని ఆటంకపరిచేలా ఎలాంటి అడ్డంకులున్నా సహించేది లేదన్న సుప్రీం ఆగ్రహం కొల్లేరులో కలకలం సృష్టించింది.
కండబలంతో కొల్లేరు నాశనం
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అనుకూలురు కొల్లేరు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అధికారులను ఏమార్చి కొన్నిచోట్ల, వారితో కుమ్మక్కై మరికొన్నిచోట్ల చేపల చెరువుల తవ్వకాలకు సాహసిస్తున్నారు. చాలాసార్లు కొల్లేరులో కాంటూరు పరిధికి ముసుగేసి మరీ చెరువుల పేరిట దురాక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా తేలిగ్గా తీసుకుంటూ వచ్చారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి నష్టం వాటిల్లుతుందని, కొల్లేరు భూభాగంలో సహజ నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని స్థానికులు మొత్తుకుంటున్నా ఎవరికీ పట్టకుండాపోయింది. పర్యావరణ పరిరక్షణకు అనుకూలురు కొల్లేరు భూభాగంలో మూడో కంటికి తెలియకుండా జరుగుతున్న ఆక్రమణలపై పదే పదే ఆగ్రహం చెందుతూనే వచ్చారు. వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల నియంత్రణలో 15 వేల 339 ఎకరాల కొల్లేరు భూములు ఉన్నట్టు గుర్తించారు. 2006 తర్వాత కైకలూరు, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల పరిధిలో అత్యధికులు ఈ ఆక్రమణలకు పాల్పడ్డారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి కొన్నిచోట్ల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసినప్పటికీ పూర్తిస్థాయిలో విఫలమయ్యారు.
కొల్లేరు సమస్యలపై గళం
కొల్లేరులో సమస్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులు గళం విప్పుతూనే వచ్చారు. ఈ మధ్యనే జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు వీటిని ప్రస్తావించారు. రీడార్ సర్వేకు సంబంధించి యధాతధ స్థితిని కొనసాగించాలని, జిరాయితీ భూముల వ్యవహారంలో యజమానులకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈలోపే సుప్రీం ఆదేశాలతో అందరూ కలవరపడుతున్నారు. 2006లో కొల్లేరు ఆపరేషన్ జరిగినప్పుడు వివిధ కారణాలతో అనేక మంది వీధులకెక్కారు. వారికి పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యేలు వంతపాడారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా స్థానికులను చైతన్య పర్చాల్సిందిగా సుప్రీం సూచన చేయడం గమనార్హం. కొల్లేరులో సహజ సిద్ధమైన వేట ద్వారా బతికేందుకు స్థానికులెవరికీ ఆటంకాలు రాబోవని, కేవలం దురాక్రమణలు మాత్రం తొలగింపే లక్ష్యంగా పేర్కొంటున్నారు. వివిధ పార్టీల అనుకూలురే ఈ దురాక్రమణలకు పాల్పడినందున సహజంగానే వీరి పరోక్ష ప్రభావం స్థానికులపై ఉంటుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారైనా ఆ ఆక్రమణల తొలగింపుకు అందరూ సహకరించాలన్న వాదనకు ఇక ముందు ఏ రూపంలో స్థానికులు ప్రతిస్పందించారనేది ఒక ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకోబోతుందోనన్న చర్చ ప్రారంభమైంది. కొల్లేరులో ఇన్నాళ్లు దందా సాగించిన వారంతా తాజా పరిణామాలతో బిక్కచచ్చిపోయారు. వేలాది ఎకరాల్లో చెరువులు తవ్వడానికి పెట్టుబడులు పెట్టి తిరిగి దానిని రాబట్టుకునేందుకు లీజు పేరిట మరికొందరి నుంచి వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఇప్పటికే బహిర్గతం.
సుప్రీం పెట్టిన పరీక్ష
కొల్లేరులో ఆక్రమణకు పాల్పడి చేపల చెరువులు తవ్వి ఇన్నాళ్ళు భోగం అను భవించిన వారికే కాకుండా స్థానిక సంస్థలకు పెను సవాల్ కాబోతుంది. సరస్సు సమీప ప్రాంతంలోని పట్టణాలు, పల్లెల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కొల్లేరుకు చేరకుండా తక్షణం నిరోధించాల్సిందేనని సుప్రీం ఉత్త ర్వులను అమలు చేయకతప్పదు. ఈ తరహా వ్యర్థాలన్నింటినీ ఎటువైపు మళ్లించా లనేది ఇప్పుడు కొత్త ప్రశ్న. ఆక్రమిత ప్రాంతంలో చేప ల పెంపకానికి అనువుగా వాడుతున్న రసాయనాలు, ఎరువులు ఇకపై అనుమతించేది లేదని స్పష్టమైన ఆదేశాలతో వీటి కట్టడి పెనుసవాలే. ఒకవైపు ఆక్రమణదా రులకు, ఇంకోవైపు స్థానిక సంస్థలకు, మరోవైపు సంబంధిత శాఖలకు సుప్రీం పెద్ద పరీక్ష పెట్టింది.
కొల్లేరులోని వేల ఎకరాల్లో ఉన్న చెరువులను తుడిచిపెట్టేలా సుప్రీం తీసుకున్న నిర్ణయాన్ని పర్యావరణ వేత్తలు ఆహ్వానిస్తున్నారు. ఆక్రమణలు తొలగి వన్యప్రాణి సంరక్షణకు నూరు శాతం అనువైన పరిస్థితులు ఏర్పడతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.