ఏజెన్సీ ప్రాంతానికి కొత్త దారి
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:15 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాన్ని మురిపిస్తున్నాయి.
జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ వరకు హైవే నిర్మాణం
రూ. 369 కోట్లతో 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణం
నేడు వర్చువల్‌గా పనులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
హాజరుకానున్న ఎమ్మెల్యే బాలరాజు, ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాన్ని మురిపిస్తున్నాయి. చాన్నాళ్లుగా రోడ్డెక్కాలంటే ఈ ప్రాంతవాసులు హడలిపోయేవారు. ప్రమాదాల్లో గాయపడని వాహనదారులు ఉండేవారు కాదు. ఏటా పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు నమోదయ్యేవారు. 2014–19 మధ్య పోలవరం పనులు వేగంగా సాగుతున్నప్పుడు జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ వరకు మరో మార్గం ఏర్పాటైతే అత్యద్భుతం అంటూ అప్పట్లో చర్చ సాగింది. దీనిపై కసరత్తు చేయాల్సిందిగా అధికారులకు సంకేతాలు అందాయి. కాని అప్పట్లో అందరి మదిలో మెదిలినట్టుగా ఇప్పుడు ఆ కల సాకారం కాబోతుంది. జీలుగుమిల్లి నుంచి కొత్త పట్టిసీమ వరకు కొత్తగా జాతీయ రహదారి నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. కొత్తగా తలపెట్టిన ఈ మార్గం పనులను బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్ హైవే విస్తరణ పనులు కొనసాగుతుండగా, తాజాగా జీలుగుమిల్లి మీదుగా పోలవరం, రాజమహేంద్రవరంను కలిపే మార్గం సుగమమైంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
ఏలూరు జిల్లాలో వరుసగా అద్భుతాలు జరుగుతు న్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువా త అన్ని ప్రాంతాల్లో గుంతలులేని రహదారులను తీర్చి దిద్దేందుకు సంకల్పించారు. తాజాగా జీలుగుమిల్లి నుంచి కొత్త పట్టిసీమ వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారిని నిర్మించబోతున్నారు. దీని ద్వారా తెలంగాణ సరిహద్దుల నుంచి రాజమహేంద్రవరం చేరేందుకు సమయం, ప్రయా ణం కలిసి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతున్న తరుణంలో నూతన మార్గం ప్రాజెక్టు పనులు మరింత విస్తృతంగా సాగేలా దోహదపడబోతుంది. జీలుగు మిల్లి నుంచి కొత్త పట్టిసీమ వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తారు. జాతీయ రహ దారి 365 బిబి పరిధిలోకి వస్తుంది. దీని నిర్మాణ వ్యయం దాదాపు రూ.369 కోట్లు. జీలుగుమిల్లి మండలం సరిహద్దున తెలంగాణ పరిధిలోని అశ్వారావుపేటను దాటి తాటాకుల గూడెం, జీలుగుమిల్లి, బర్రింకలపాడు, పి.అంకంపాలెం, రౌతుగూడెం మీదుగా బుట్టాయిగూడెం మండలంలోకి ప్రవేశించి ఎల్‌ఎన్‌డీ పేట మీదుగా పట్టిసీమ వద్ద గోదావరి గట్టు వరకు సాగుతుంది. ఈ క్రమంలో అక్కడక్కడ భూ సేకరణకు పెద్ద ఇబ్బందులు లేకుండా ఇప్పటికే జాగ్రత్త పడ్డారు. ఇంతకుముందు పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నప్పుడు భారీ మిషనరీ, కావాలసిన సామగ్రి పోలవరం చేర్చేందుకు వ్యయప్రయాశలకోర్చేవారు. దానికంటే మించి హైదరాబాదు మీదుగా వచ్చే వారు ఎవరైనా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. దీనిని గమనించి తెలంగాణలోని అశ్వారావుపేట నుంచి జీలుగుమిల్లి, పట్టి సీమ వరకు ప్రత్యేక మార్గాన్ని విస్తరిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు అందాయి. దీనికి సాధ్యమైనంత అనుకూలంగా మలచుకు నేందుకు ప్రయత్నం చేసినా కార్యరూపం దాల్చలేదు. అప్ప టి అంచనాల మేరకు తాజాగా 40 మీటర్ల జాతీయ రహ దారి నిర్మించబోతున్నారు. అనేక చోట్ల కల్వర్టులు కట్టాల్సి వచ్చినా వాగులు, వంకలు దాటుకుని పట్టిసీమ వరకు రహ దారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఏజెన్సీ ప్రాంతం లో ఇప్పటిదాకా అనేక సమస్యలు రోడ్డు మార్గాల ద్వారానే వచ్చి పడుతూనే ఉన్నాయి. ఏళ్ల తరబడి దెబ్బతిన్న మార్గా లను వైసీపీ హయాంలో మరింత నిర్లక్ష్యం చేయడంతో మారు మూల గ్రామాల నుంచి కనీసం మండల కేంద్రానికి వెళ్లేందుకు కూడా అనువైన మార్గాలే లేకుండా పోయాయి. గిరిజనులు, గిరిజనేతరవర్గాలు అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి విన్నవించినా దిక్కుమొక్కు లేకుండా పోయింది.
నేడు పనులు ప్రారంభం
ఈ పనులను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ హాజరవుతారు. ఈ రహదారి నిర్మాణంతో బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో సరికొత్త అధ్యాయం ఆరంభం కానుంది. ఇప్పటిదాకా గుంతలు తేలిన రోడ్లతోనే నానా తిప్పలు పడిన వారంతా జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ చేరేందుకు అతి తక్కువ సమయం పట్టడమే కాకుండా ప్రయాణం, రవాణ కూడా సులువు కాబోతుంది. ఇప్పటికే 365 బిబి మార్గాన్ని మరింత విస్తరించే క్రమంలోనే ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్త పట్టిసీమ నుంచి గోదావరి గట్టును మరింత పటిష్టం చేసి ఈ మార్గానికి అనుసంధానం చేయబోతున్నారు. ఇది పూర్తయితే నేరుగా రాజమహేంద్రవరం చేరేందుకు రవాణా, ప్రయాణికుల వాహనాలకు అత్యంత సులభతరమవుతుంది. సత్తుపల్లి నుంచి జీలుగుమిల్లి మండలం మీదుగా విస్తరి స్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు కొలిక్కి వస్తున్నాయి. ఇప్పుడు సమాంతరంగా జీలుగుమిల్లి–2 పట్టిసీమ జాతీయ రహదారి పనులు పూర్తయితే జీలుగుమిల్లితోపాటు ఏజెన్సీ ప్రాంతానికి సరికొత్త కళ వచ్చినట్టే. ఈ ప్రాంత అభివృద్ధికి ఈ రెండు మార్గాలే దోహదం కాబోతున్నాయి.
కల ఫలించేలా..
ఏజెన్సీవాసులు మెచ్చేలా కేంద్రం 365 బిబి జాతీయ రహదారిని విస్తరించేందుకు కొన్నాళ్ళ క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీలుగుమిల్లి మీదుగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణం సాగాల్సి ఉండగా దీనిపై సర్వే కూడా నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఈ ప్రాంతాన్ని పదేపదే పరిశీలించారు. రానున్న రెండేళ్లలో ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసేందుకు సంకల్పించారు.