పింఛన్ అర్హులెవరు..?
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:23 AM
ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న అనారోగ్య బాధితులు, దివ్యాంగుల పింఛన్ దారుల లబ్ధిదారుల అర్హతలో డొల్లతనం బయటపడుతోంది.

జిల్లాలో లబ్ధిదారుల పరిశీలన
అనారోగ్యంతో మంచాన పడిన వారిలో అనర్హుల గుర్తింపు
ప్రభుత్వానికి నివేదిక
దివ్యాంగుల అర్హతపై కొనసాగుతున్న విచారణ
అనారోగ్యంతో మంచానికే పరిమితమై పింఛన్ పొందుతున్న లబ్ధిదారును పరిశీలించడానికి అధికారులు అతడి ఇంటికి వెళ్లారు. అంతలో ఒక వ్యక్తి పచ్చగడ్డి మోపు తెచ్చి ఇంటి ముందు పడేశాడు. ఇంటి వద్ద ఉన్న అధికారులను చూసి ఎవరు కావాలని అడిగాడు. అధికారులు ఒక పేరు చెప్పి అతడు ఎక్కడ అని ప్రశ్నించే లోపు తానేనని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. మంచంపై నుంచి లేవలేని పింఛన్‌దారు గడ్డి మోపు మోయడమా..! అన్నట్లు నోరెళ్లబెట్టి చూస్తుండి పోయారు. అనారోగ్యంతో ఉన్న పింఛన్ లబ్ధిదారుల పరిశీలనకు వెళ్లిన అధికారులకు ఎదురైన అనుభవం ఇది.
భీమవరం రూరల్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న అనారోగ్య బాధితులు, దివ్యాంగుల పింఛన్ దారుల లబ్ధిదారుల అర్హతలో డొల్లతనం బయటపడుతోంది. మంచంపై నుంచి లేవ లేక జీవనం కోసం పింఛన్ పొందుతున్న వా రిలో కొందరు బయట తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దివ్యాంగ పింఛన్‌దారుల అర్హత పైనా అన్నీ అనుమానాలే.
జిల్లాలో అనారోగ్యంతో మంచంలో బతు కీడుస్తున్న పింఛన్ లబ్ధిదారులు 1510 మంది ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపిం చారు. వారిలో ఎంతమంది అర్హులు, అనర్హు లు అనేది తేలాల్సి ఉంది. ఈ నెల 3 నుంచి దివ్యాంగ పింఛన్‌దారుల పరిశీలన కూడా చేపట్టారు. జిల్లాలో దివ్యాంగ పింఛన్‌దారులు 27590 మంది ఉన్నారు. తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, తణుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సోమ, మంగళ, బుధవారాలు వైద్యులు వైకల్యం పరిశీలించి సదరం సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఆగస్ట్ వరకు దివ్యాం గుల అర్హత పరిశీలన జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఎవరు ఎంత శాతం వైకల్యంతో ఉన్నారన్నది ప్రభుత్వ వైద్యులు పరిశీలిస్తున్నందున వారిలో అర్హుల సంఖ్య తేలనుంది. గతంలో జారీ చేసిన వైకల్యం ధ్రువీకరణ పత్రాలు, ఇప్పుడు పరిశీలించిన తర్వాత ఇచ్చే ధ్రువీకరణకు తేడా ఉందని సమాచారం. జిల్లాలో అనారోగ్యంతో ప్రభుత్వ పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు 1510 మంది, రూ. 2.26కోట్లు, దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు 27,590 మంది నెలవారీ రూ.17 కోట్లు పెన్షన్ పొందుతున్నారు.
రాజకీయ లబ్ధిదారులు..!
కొందరు అనర్హులు రాజకీయ పైరవీతో లబ్ధి పొందినట్లు తేలుతోంది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కొంతమంది అనర్హులు రాజకీయ ఒత్తిళ్లతో ధ్రువీకరణ పొంది పింఛ న్ లబ్ధిదారుల జాబితాలో చేరిపోయారు. దివ్యాంగుల్లో కూడా వారిలో వైకల్యం ఎక్కువ శాతం ఉన్నట్లు నమోదు చేయించుకుని పింఛన్ సొమ్ము పొందుతున్నారు. చాలామం ది వృద్ధాప్య, ఇతర పింఛన్ రూ. 4 వేలు పొందడానికి అర్హులు కాగా వారు రూ.6 వేలు, రూ.15 వేలు పింఛన్ పొందుతున్నట్లు సమచారం. అర్హతను బట్టి పింఛన్ అందించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
పరికరాలు లేవు..!
దివ్యాంగ పింఛన్‌దారుల్లో చెవిటి, మూగవారిని పరిశీలించడం ఇబ్బందిగా మారింది. జిల్లాలో వారిని పరిశీలించడానికి తగిన పరికరాలు ఇక్కడి ఆసుపత్రుల్లో అందుబాటులో లేవు. రాజమండ్రి, విశాఖపట్నం ఆసుపత్రులకు వెళ్లి పరిశీలన చేయించుకోవాలని అధికారులు సూచించారు.
ప్రభుత్వానికి నివేదిక
వేణుగోపాల్, డీఆర్‌డీఏ పీడీ
అనారోగ్యంతో మంచానికే పరిమితమై పింఛన్ పొందుతున్న వారి పరిశీలన పూర్తయింది. ప్రభుత్వానికి నివేదిక పంపించాం. దివ్యాంగుల పెన్షన్‌దారుల పరిశీలన ప్రస్తు తం కొనసాగుతోంది. నివేదిక రూపొందించిన అర్హులను నిర్ధారిస్తారు.