పట్టాలిచ్చారు.. స్థలం ఇవ్వలేదు!
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:18 AM
సొంత స్థలం ఉంటే సొంతింటి కల సాకారమవుతుందని ఆశ. మండలంలో గొరగనమూడి గ్రామానికి చెందిన నిరుపేదలు సొంత జాగా దొరికితే చిన్న ఇల్లు కట్టుకుందామనుకున్నారు.

గొరగనమూడిలో లబ్ధిదారుల గగ్గోలు
డిఫారం పట్టా భూమి సేకరణ
కేటాయింపులో చిక్కులు
ఏళ్ల తరబడి ఎదురుచూపులు
పాలకోడేరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సొంత స్థలం ఉంటే సొంతింటి కల సాకారమవుతుందని ఆశ. మండలంలో గొరగనమూడి గ్రామానికి చెందిన నిరుపేదలు సొంత జాగా దొరికితే చిన్న ఇల్లు కట్టుకుందామనుకున్నారు. వారి ఆశలకు అనుగుణంగా గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. కానీ ఇంటి స్థలాలు చూపకపోవడంతో పేదల ఆశ అడియాస అయింది. ఐదేళ్లుగా వారికి ఇంటి పట్టాలు ఉన్నాయి కానీ స్థలాలు మాత్రం లేవు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గొరగనమూడి గ్రామ శివారులో వేండ్ర డెల్టా పేపర్ మిల్లు వెనుక పంట కాలువను చేర్చి 4.92 ఎకరాల భూమిని సేకరించారు. గ్రామంలో 195 మంది పేదలకు స్థలం ఇవ్వడానికి ఎంపిక చేశారు. కానీ సేకరించిన భూమి డి.ఫారం పట్టా భూమి కావడం, యజమానులు ఆ భూమిని ఇతరులకు విక్రయిండం పేదలకు శాపంగా మారింది. అప్పటి ప్రభుత్వం సేకరించిన భూమికి గాను రైతులకు చెల్లించాల్సిన మొత్తానికి నిధులు మంజూరు చేసింది. కానీ ఆ డి.ఫారం భూమిని కొనుగోలు చేసిన రైతుల పేర్లు ఉండడంతో ప్రభుత్వ నిధులు విడుదల కాలేదు. డబ్బులు రాకపోవడం, ఇరుపక్షాల వారు కోర్టును ఆశ్రయించడంతో మధ్యలో పేదలు ఇంటి స్థలం పొందలేకపోయారు. చేతిలో పట్టా ఉన్నా స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు కిలో మీటర్ల దూరం..
గొరగనమూడి పేదల కోసం సేకరించిన స్థలం వద్దకు వెళ్లాలంటే ఒకవైపు పంట పొలా లు, మరోవైపు పంట కాలువ నడుమ మూడు కిలోమీటర్లు ప్రయాణం. అయినా సరే స్థలం కేటాయిస్తే చాలనుకున్న పేదలకు అందని ద్రాక్షగా మిగిలింది. ఆ భూమి లభిస్తుందో లేదోనని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇళ్ల స్థలాలు అందించాలని ఇప్పటికే పలుమార్లు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయో జనం లేదు. కూటమి ప్రభుత్వమైనా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి సొంతింటి కల నెరవేర్చుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.
భూసేకరణ వివాదాస్పదం
గొరగనమూడిలో పేదల కోసం 4.92 ఎకరాల డి.ఫారం భూమిని సేకరించాం. భూ సేకరణ వివాదస్పదం కావడంతో పేదలకు కొంత ఇబ్బం ది ఎదురైంది. ఈ సమస్య కోర్టులో ఉండడం వల్ల జాప్యం జరిగింది. ఆ సమస్య తీరాక పేదలకు ఇళ్ల స్థలాలు చూపిస్తాం.
– కె.శ్రీనివాస్, వీఆర్‌వో
సొంత ఇల్లు లేక ఇబ్బందులు
సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతు న్నాం. చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికే సొంత ఇల్లు నిర్మించుకుని ఆనందంగా గడుపుతుంటే మా గ్రామంలో పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకపోవడంతో చాలా బాధ చెప్పుకుంటున్నాం. ఈ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి భూమి చూపిస్తే ఇల్లు కట్టుకుంటాం.
– శీలం పార్వతి, గొరగనమూడి
అప్పటి ప్రభుత్వ వైఫల్యం
అప్పటి ప్రభుత్వానికి ముందుచూపు లేదు. ప్రభుత్వ వైఫల్యంతో పేదలంతా నరకం అనుభవిస్తున్నాం. ఎక్కడో దూరాన స్థలాలు చూపించారు. అయినా పర్వాలేదనుకున్నాం. పట్టాలు ఇచ్చారు.. స్థలాలు చూపించ లేదు. ఇలా ఇంకెంత కాలం. స్థలాలు ఇచ్చి పేదలను ఆదుకోవాలి.
– మేడూరి అనంత దుర్గాలక్ష్మి, గొరగనమూడి