Share News

కల నెరవేరేనా..?

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:38 AM

ఈసారి అందరూ మెచ్చేవిధంగానే బడ్జెట్‌ ఉండబోతుందా.. ప్రతిపక్షంలేని జిల్లాలో ఆ పాత్ర కూడా తామే తీసుకుని ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహరిస్తారా..

కల నెరవేరేనా..?

సాగునీటి పథకాలతోపాటు తాగునీటికి ప్రాధాన్యం ఇస్తారా..

ఎత్తిపోతల పథకాలకు ఊపిరి పోయనున్నారా..

కొల్లేరు రెగ్యులేటర్లకు మోక్షం కలిగేనా..

ఆక్వాకు ప్రోత్సాహంపై ఆశలు

కాలువల ఆధునికీకరణకు కేటాయింపులపై ఎదురుచూపు

ఈసారి అందరూ మెచ్చేవిధంగానే బడ్జెట్‌ ఉండబోతుందా.. ప్రతిపక్షంలేని జిల్లాలో ఆ పాత్ర కూడా తామే తీసుకుని ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహరిస్తారా.. అపరిష్కృత సమస్యలకు చెక్‌ పెట్టేందుకు నిధులు రాబట్టేందుకు చేసిన ప్రయత్నాలు బడ్జెట్‌లో కనిపించబోతున్నాయా.. బడ్జెట్‌ ఉమ్మడి జిల్లా ప్రజల కల నెరవేరుతుందా..!

ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి

అసెంబ్లీ వార్షిక బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం తగిన కసరత్తు చేసి అన్ని ప్రభుత్వ విభాగాలకు కాస్త ఊపిరి పోసేవిధంగా నిధులు కేటాయిస్తుందని, ప్రజల కల నెరవేరు తుందని భావిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదా వరి జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలదే ఆధిపత్యం. ఏ ఒక్క స్థానంలో వైసీపీకి చోటు దక్కలేదు. ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారా, లేదా అనేది బడ్జెట్‌ కేటాయింపులను బట్టి తేలనుంది.

ఆక్వా సంగతేంటి?

ఆక్వా రంగం ఒడిదుడుకుల్లో ఉంది. ఉమ్మడి పశ్చిమలో ఆక్వా భారీగా విస్తరిం చింది. దీనినే నమ్ముకుని ఉన్న వేలాది మంది రైతులు ఏటా నష్టాలపాలవుతు న్నారు. వైరస్‌ కమ్ముకొచ్చి ఈ రంగాన్ని అతలాకుతలం చేస్తుంది. కోట్లాది రూపా యలు పెట్టుబడులు చెరువుల పాలవుతు న్నాయి. దీనికితోడు ఇటీవల కేంద్ర బడ్జెట్‌ లో వ్యాపార రంగానికి ఊతమిచ్చేలా ప్రోత్సా హకాలు ఉంటాయని భావించినా నిరాశే కలిగింది. ఆఖరుకు విద్యుత్‌ చార్జీల తగ్గింపు డిమాండ్‌ ఎవరికీ పట్టనేలేదు. ప్రస్తుత బడ్జెట్‌లోనైనా ఆక్వాను ప్రోత్సహించే చర్యలు ఉంటాయా, లేదా అనేదే ఇప్పుడు ఆ రంగాన్ని నమ్ముకుని ఉన్న వేలాది మంది రైతుల ప్రశ్న. వైసీపీ హయాంలో ఆక్వా ధరల స్థిరీకరణ అంటూ ఆగమాగం చేశారు. ఇప్పటికీ రైతులు కోలుకోలేదు. వైరస్‌ వ్యాప్తితో నష్టం, మేత, సీడ్‌, విద్యుత్‌ చార్జీల భారం ఆక్వా రైతులను కుంగదీస్తున్నాయి. అన్నీ దాటుకుని ఉత్పత్తులు సాధిస్తే ధర కోల్పోతున్నారు. కూటమి ప్రభుత్వ ప్రోత్సా హంపైనే ఆశలు పెంచుకున్నారు.

ఎత్తిపోతలపై కనికరించాలి

చింతలపూడి ఎత్తిపోతల పథకం ముందు కు సాగడం లేదు. ఇంతకుముందు తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఉమ్మడి పశ్చిమ తోపాటు కృష్ణాలోని మెట్ట ప్రాంత రైతులకు సాగునీటిని ఇవ్వాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దాదాపు 4.6 లక్షల ఎకరా లకు సాగునీరు అందించడమే కాకుండా 230 గ్రామాలకు తాగునీరు అందించేందుకు సంక ల్పించింది. మరోవైపు అంచనా వ్యయాన్ని కూడా 4,700 కోట్లకుపైగా పెంచింది. దీనిని కూడా గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నేరుగా నీరుగార్చింది. నయాపైసా ఇవ్వకుం డానే ముఖం చాటేసింది. మెట్ట ప్రాంతంలో జలాశయాలవైపు కన్నెత్తి చూడలేదు. తాడిపూ డి సమీపాన చింతలపూడి హెడ్‌వర్క్స్‌కు దిక్కుమొక్కు లేదు. ఈ పరిస్థితిపై మెట్ట రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గడిచిన సాధారణ ఎన్నికల్లో వైసీపీని కాదని కూటమికి పట్టంకట్టేలా వ్యవహరించారు. ఈ ఎత్తిపోతల గోదావరి జలాలను తెచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందని రైతులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తూనే ఉన్నారు. దీనికితోడు తాడిపూడి ఎత్తిపోతల కింద పిల్ల కాలువల పనులు పూర్తి చేస్తే ఏకంగా 2.6లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దీనిపై రైతులు ఆశలు పెంచుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే ఊపందుకున్న తరుణంలో మెట్ట ప్రాంతానికి ఆయువుపట్టు అయిన తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు కూటమి ప్రభుత్వం జీవం పోయాలని ఈ బడ్జెట్‌ సమావేశాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు.

కాలువల ఆధునికీకరణ చేస్తారా..?

వాస్తవానికి వ్యవసాయం, ఆక్వా అత్యంత కీలకంగా ఉన్న ఉమ్మడి జిల్లాల కాలువల ఆధు నికీకరణ మరుగునపడింది. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కాల్వల అభివృద్ధికి నయా పైసా కేటాయిస్తే ఒట్టు. ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువల్లో సైతం నీటి పారుదలకు ఆటంకాలే. తమ ప్రాంత రైతులకు జరుగుతు న్న అన్యాయంపై అప్పటి ఎమ్మెల్యేలు మాట్లాడ లేకపోయారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతి నిధ్యం వహించిన మంత్రులదీ ఇదే పాత్ర. చాలాచోట్ల శిథిలమైన పంట కాలువల లాకులు ఆనాటి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతున్నాయి. 2007లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.1,407 కోట్లతో కాలువల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. కాని 2025 వరకు వ్యయం పెరుగుతూనే వచ్చింది తప్ప పనులు మాత్రం పూర్తికాలేదు. 2013–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆధునికీకరణ పనులకు కొన్ని నిధులు కేటాయించగలిగింది. 2019 తరువాత ఈ పురోగతిని జగన్‌ ప్రభుత్వం కాలదన్నింది. ఈసారైనా బడ్జెట్‌లో సంతృప్తికర ఫలితాలు ఉంటాయా, లేదా అనేది రైతుల ఆతృత.

కొల్లేరుకు ఏం చేయబోతున్నారు

ఉమ్మడి పశ్చిమలో కొల్లేరు సరస్సు అత్యంత కీలకం. కొల్లేరును ఉప్పునీరు ముంచెత్తకుండా సహజ సిద్ధంగానే మంచినీటి సరస్సులా కొన సాగేలా, మత్స్య సంపదకు ఆటంకంలేకుండా, సరస్సు పరిసరాల్లో ఉప్పునీటి కయ్యలు ఏర్పడ కుండా తక్షణం రెగ్యులేటర్ల నిర్మాణానికి అనువు గా నిధులు కేటాయిస్తారని గత బడ్జెట్‌లోనే అందరూ ఆశతో ఎదురుచూశారు. కాని అప్పట్లో రెగ్యులేటర్ల నిర్మాణానికి తగినంత నిధులు కేటాయించ లేదు. సముద్రపు నీరు ఉప్పుటేరు నుంచి కొల్లేరు వైపు ఎగబాకకుండా రెగ్యులేటర్లు దోహదపడతాయి. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ప్రచారమైతే చేశారు కాని నిధుల విషయానికి వచ్చేసరికి పైసా విదల్చలేదు. దీనిపై అప్పట్లోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. మరి ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉండబో తున్నాయనేదానిపైనే అందరి ఉత్కంఠ. దీనికి తోడు కొల్లేరు కాంటూరు సరిహద్దుల నిర్ధారణపై ఈ మధ్యనే సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరును నమ్ముకున్న అనేక కుటుంబాలు ఈ దిశగానే ఎదురుచూస్తున్నాయి.

గృహ సముదాయాలపైనా ఆశలు

ప్రభుత్వం ఏదైనా పక్కా ఇళ్ల కోసం ప్రజలకు ఎదురుచూపులు తప్పడంలేదు. గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్భాటంగా ఊరూవాడా జగన్న కాలనీలు కట్టేస్తామని గొప్పలకు పోయారు. తీరా పూర్తి చేయలేక చివరి క్షణాల్లో చేతులెత్తేశారు. లేఅవుట్‌లలో వేలాది ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు లేవు. ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం ఏ మేరకు పక్కా ఇళ్లకు ప్రోత్సాహం ఇస్తుందనేదే పేద వర్గాల్లో సందేహం. దీనికితోడు ఏలూరు, భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, తాడేపల్లిగూడెంతో సహా అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన టిడ్కో ఇళ్ళపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. వార్షిక బడ్జెట్‌లో టిడ్కో ఇళ్ల సముదాయం పూర్తయ్యేలా ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే దానిపై పట్టణవాసులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గోదావరి గట్లు బలహీనం

గోదావరి గట్టు పరిస్థితి అత్యంత దారుణం. గట్టు పటిష్టతకు 2013 నుంచి 19 వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిధులు ఇస్తూనే వచ్చింది. పోలవరం నుంచి నరసాపురం వరకు గట్టు పటిష్టతకు వందల కోట్లు ఖర్చు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో దీనిని గాలికొదిలేశారు. ఈ మధ్యనే తన నియోజకవర్గ పరిధిలో గోదావరి గట్టు పటిష్టతకు జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కొంత చొరవ చూపడమే కాకుండా రైతులకు అండగా నిలిచారు.

ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు ?

ఉమ్మడి పశ్చిమలో వైసీపీకి స్థానం లేకుండా కూటమి విజయకేతనం ఎగురవేసింది. అసెంబ్లీ లో జిల్లా నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించేవారే లేరు. ఇప్పటికే డెల్టా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఆక్వా, గోదావరి కాలువల ఆధునికీ కరణ, గోదావరి గట్టు పటిష్టత, వరితోపాటు మిగతా పంటలకు సాయం, రైతాంగాన్ని ఆదు కునేలా వెసులుబాటు ఇవ్వాలని అనేకమంది రైతులు ఒత్తిడి చేస్తూ వచ్చారు. మెట్ట ప్రాంతంలో పామాయిల్‌, జొన్న రైతులు ఇదే డిమాండ్‌తో ఉన్నారు. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో కూటమి ఎమ్మెల్యేలంతా ఏ సమస్యలను ప్రస్తావించబోతున్నారు, తమ కష్టాలను తీర్చే విధంగా స్పందిస్తారా.. సాదాసీదాగా వ్యవహరి స్తారా అనే సందేహం లేకపోలేదు. సాధారణం గా బడ్జెట్‌ సమావేశాల్లో ఇతర అంశాలను ప్రస్తావించే అవకాశం పెద్దగా ఉండదు. కీలక విభాగాలపై పూర్తి అనుభవం ఉన్న వారే కొన్ని ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబడతారు. అంతా అధికారపక్ష సభ్యులే కాబట్టి వీరిలో స్వల్ప సంఖ్యలో మాత్రమే మాట్లాడే అవకాశం లేకపోలేదు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆశలు అంతా ఇంతా కాదు.

Updated Date - Feb 24 , 2025 | 12:38 AM