తక్కువ ఖర్చుతో రక్షిత నీరు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:36 AM
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య కు పరిష్కారం కానరావడం లేదు. స్వచ్ఛమైన నీరందని గ్రామాలెన్నో.. తాగునీటి సమస్యలతో ఎదురయ్యే అనారోగ్య పరిస్థితులెన్నో..

విస్సాకోడేరులో రూ.2 లక్షలతో ఆలం ట్రీట్‌మెంట్ ప్లాంట్
ఫలించిన ప్రయోగం
మున్సిపాలిటీ తరహాలో గ్రామంలో తాగునీటి సరఫరా
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంస
ప్లాంట్ ఏర్పాటుపై మరింత మంది ఆసక్తి
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య కు పరిష్కారం కానరావడం లేదు. స్వచ్ఛమైన నీరందని గ్రామాలెన్నో.. తాగునీటి సమస్యలతో ఎదురయ్యే అనారోగ్య పరిస్థితులెన్నో.. ఇలాంటి తరుణంలో పాలకోడేరు మండలం విస్సాకోడేరులో తక్కువ పెట్టుబడితో స్వచ్ఛమైన తాగునీరందించే ప్రయత్నం విజయవంతమైంది. రూ.30 లక్షలపైగా పెట్టుబడితో మంచినీటి పథకంలో ఏర్పాటుచేసే ఆలం ట్రీట్‌మెంట్ ప్లాంట్ కేవలం రూ.2 లక్షలతో ప్రయోగం చేశారు. గ్రామ ప్రజలందరికి మంచినీరు అందుతోంది.
పాలకోడేరు, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): విస్సాకోడేరు గ్రామస్తులకు రక్షితనీరు అందించడానికి సర్పంచ్, అధికారులు చేసిన ప్రయోగం ఫలించింది. ఆలం ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితం రావడానికి చొరవ చూపిన సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, అధికారులను గ్రామ స్తులు అభినందిస్తున్నారు.
స్వచ్ఛ నీరు ఇలా..
ఆలం ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా ఫిల్టరేషన్‌తో స్వచ్ఛమైన నీరు విడుదలవుతుంది. అలాంటి ప్లాంట్‌లో ఉపయోగించే ఆలంతో ఫిల్టర్ గ్రిడ్ ఏర్పాటుకు రూ.30 లక్షలు వెచ్చించి సిమెంట్ పైపులు కట్టాలి.
విస్సాకోడేరులో మంచినీటి పథకం వద్ద రూ.2 లక్షలతో పైపులతో ఆ తరహాలోనే గ్రిడ్ నిర్మాణం చేపట్టారు.
పైప్ గ్రిడ్‌లో పటికతో కూడిన నీటిని పంపిస్తారు.
గొట్టాల్లో నీరు తిరుగుతూ కింద ఏర్పాటు చేసిన ట్యాంక్‌లో చేరుతుంది.
అక్కడ మట్టిశాతం కిందికి దిగి శుద్ధి అయిన జలం పైకి వస్తుంది.
ఆ నీటిని ఫిల్టర్ బెడ్‌లోకి పంపిస్తారు. అప్పటికే 90 శాతం శుద్ధి కావడంతో ఫిల్టర్ బెడ్‌ల నుంచి ఓహెచ్‌ఆర్‌కు పంపిస్తారు.
ఫిల్టర్ బెడ్ సమస్యకు పరిష్కారం
ఈ విధానంలో ఫిల్టర్ బెడ్‌ల సమస్యకు మంచి పరిష్కారం దొరికినట్టే. ఏడాదిలో మరమ్మతులకు గురయ్యే ఫిల్టర్ బెడ్‌లు ఐదారేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. స్వచ్ఛమైన నీరు కూడా ప్రజలకు చేరువ అవుతుంది. ఈ వినూత్న ప్రయోగం మిగిలిన గ్రామాల్లోని మంచినీటి పథకాలకు కూడా చేరితే గ్రామాల్లో తాగునీటి సమస్య అధిగమించే అవకాశం పాలకవర్గాలకు ఉంటుంది. పంచాయతీలకు ఫిల్టర్‌బెడ్‌ల మరమ్మతుల భారం తగ్గుతుంది. పంచాయతీ ఆదా యం వృద్ధి అవుతుందని నిపుణులు లెక్కలు వేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ప్రశంస
విస్సాకోడేరులో తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితం సాధించడం, ఆలం ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా గ్రామస్తులకు రక్షిత నీరందించడం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. ఎక్స్ వేదికగా విస్సాకోడేరు పంచాయతీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశారు. దీంతో విస్సాకోడేరు గ్రామం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతి ఒక్కరూ వాటర్ ప్లాంట్ నిర్మించిన తీరుతెన్నుల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రజలకు రక్షిత నీరిస్తున్నాం
విస్సాకోడేరులో తాగునీటి సమస్య చాలా ఎక్కువ. ఎంతో మంది నిపుణులను సంప్రదించాను. పైప్‌గ్రిడ్ ప్లాంట్ మంచి ఫలితాన్నిచ్చింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాలు వచ్చేవిధంగా ఆలం ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాను. ఈ ప్లాంట్ ద్వారా మునిసిపాలిటీలతో సమానంగా రోజుకు 8లక్షల నీటిని శుద్ధిచేసి అందిస్తున్నాం.
బొల్లా శ్రీనివాస్, సర్పంచ్, విస్సాకోడేరు