సంక్రాంతి సరదా తీర్చేసింది..!
ABN , Publish Date - Jan 17 , 2025 | 01:10 AM
సంక్రాంతి మాటున పుంజుల ప్రాణాలను ఫణంగా పెట్టి ఏడాది పొడవునా కష్టపడ్డ సొమ్ములు చేతపట్టి పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. పండగ మూడు రోజులు అయ్యేసరికి చేతిలో చిల్లిగవ్వ లేక అప్పులపాలై చతికిలపడ్డారు.

వేలు, లక్షలు పోగొట్టుకున్న జనం
పదిలో ఒక్కరికే లాభం.. తొమ్మిది మందికి నష్టం
లక్షలు వస్తాయనుకుంటే అప్పులు మిగిలాయి
రోజు వడ్డీకి అప్పు తెచ్చి..
నరసాపురం పట్టణానికి ఓ చిరు వ్యాపారి పండుగ నిమిత్తం వ్యాపారుల వద్ద రూ.10 వేలు అప్పు తీసుకు న్నాడు. ఈ మూడు రోజులు వ్యాపారం చేయలేదు. తీసుకున్న అప్పును గుండాటలో పోగొట్టాడు. చివరికి మిగిలిన రూ.10 వేల అప్పును రోజుకు రూ.120 చొప్పున వంద రోజుల్లో చెల్లించాలి. ఇది పండుగ మిగిల్చిన అప్పు.
సరదాగా గడుపుదామని వచ్చి..
హైదరాబాద్ నుంచి ఓ చిరుద్యోగి కుటుంబంతో సరదాగా గడుపుదామని స్వగ్రామం వచ్చాడు. చిన్ననాటి స్నేహితులతో కలిసి పట్టణంలోని ఓ పెద్ద బరిలో పందేలు చూసేందుకు వెళ్లాడు. స్నేహితులు పందేలు కాస్తుండటంతో మనసు అటు లాగి జేబులో చేయి పెట్టాడు. గంటలో రూ.5 వేలు పోయాయి. అంతటితో ఆగలేదు. ఇంటికి వెళ్లి భార్య దగ్గర ఉన్న రూ 10 వేలు తెచ్చి మరి పందెం పెట్టాడు. చివరికీ హైదరాబాద్ వెళ్లేందుకు డబ్బులు కూడా లేకపోవడంతో స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని మరీ వెళ్లాల్సి వచ్చింది.
రైతుకు మిగిల్చిన అప్పు.. అక్షరాలా లక్ష
మొగల్తూరు ప్రాంతానికి చెందిన ఓ రైతు సరదాగా పందేలు కాద్దామని అనుకున్నాడు. రూ.20 వేలు జేబులో వేసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. మధ్యాహ్నానికి మరో 20 వేలు వచ్చినట్టే వచ్చి మొత్తం పోయాయి. తెలిసిన వారి వద్ద నాలుగు రూపాయల వడ్డీకి రూ.20 వేలు అప్పు తెచ్చి పందెంలో పెట్టాడు. ఇవీ పోయాయి. కసి పెరిగింది. పోయిన ఇరవై వేలు ఎలాగైనా సంపాదించాలనుకుని ఇంటిలోవున్న బంగారం తాకట్టు పెట్టి రూ.60 వేలు అప్పు తెచ్చాడు. గంటల వ్యవధిలో ఇది కూడా తుడిచి పెట్టుకుపోయింది. చివరకు పండుగ పేరుతో తెచ్చిన లక్ష రూపాయల అప్పు మిగిలింది.
పది వేలు గెలిచి.. రెండున్నర లక్షలు పోగొట్టి
తాడేపల్లిగూడెం మండలంలో కూలి పనులు చేసుకునే ఓ వ్యక్తి కోడి పందేల బరికి వెళ్లాడు. గుండాటలో సరదాగా పందెం కాస్తే ఓ పది వేలు వచ్చాయి. ఇదేదో బాగుంది కదాని జోరు పెంచాడు. ఈ సొమ్ము రావడానికి నాలుగు గంటలు పడితే.. అది పోగొట్టడానికి నాలుగు నిమిషాలు పట్టలేదు. మళ్లీ ఇంటికి వెళ్లి మరో రూ.20 వేలు తెచ్చి పందెం కాశాడు. నిమి షాల వ్యవధిలో అదీపోయింది. అతనిలో కసి పెరిగి, పొరుగింటి వాళ్ల దగ్గర అప్పు చేసి మరీ ఆడాడు. ఇలా సంక్రాంతి మూడు రోజుల్లో పందేల్లో పోయిన సొమ్ము అక్షరాలా రెండున్నర లక్షల రూపాయలు. కుటుంబసభ్యులు లబోదిబోమనడంతోపాటు ఆ వ్యక్తికి చీవాట్లు పెట్టడంతో ఇంటి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని భయపడి బ్రతిమలాడి ఇంటికి తీసుకువచ్చారు. చేసిన అప్పులు ఏదో లా తీర్చుకుందామని ఆ ఇంటి ఇల్లాలు సర్ది చెప్పేసరికి కాస్త శాంతించాడు.
ఇలా ఒకరు, ఇద్దరూ కాదు. పండుగ పేరుతో నిర్వహించిన జూదంలో ఎంతో మంది సామాన్య, మధ్య తరగతి వారి జేబులే కాదు. బ్యాంకు ఖాతాలు కూడా ఖాళీ అయ్యాయి. లక్షల్లో అప్పులు మిగిలాయి. కొందరి ఆస్తులు తాకట్టులోకి వెళ్లాయి. మొత్తం మీద ఇలాంటి జూదగాళ్లందరికీ సంక్రాంతి సరదా తీర్చేసింది !
తాడేపల్లిగూడెం రూరల్/నరసాపురం/ఆచంట, జనవరి 16(ఆంధ్రజ్యోతి):సంక్రాంతి మాటున పుంజుల ప్రాణాలను ఫణంగా పెట్టి ఏడాది పొడవునా కష్టపడ్డ సొమ్ములు చేతపట్టి పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. పండగ మూడు రోజులు అయ్యేసరికి చేతిలో చిల్లిగవ్వ లేక అప్పులపాలై చతికిలపడ్డారు. కోట్లాది రూపాయలు పందేల మాటున చేతులు మారగా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎపుడూ లేని విధంగా ఈ సారి సంక్రాంతి పండుగ పురస్కరించుకుని చిన్నారుల నుంచి పెద్దల వరకు, యువతుల నుంచి మహిళల వరకు వయోభేదం, లింగ భేదం లేకుండా జూదాల్లో పాల్గొన్నారు. కోతాట, మూడు ముక్కలాట, గుండాట వంటి జూదాలు కోట్లు చేతులు మారాయి. గోదావరి జిల్లాల్లో ఈ సంస్కృతి ఈసారి మరీ విపరీతంగా మారింది. ఎంత విపరీతం అంటే ఒక్క పందే నికి కోటి పాతిక లక్షలు ఫణంగా పెట్టేంత ! అంటే నాలుగు నిముషాల పందేనికి రెండున్నర కోట్లు చేతులు మారేంత ! అయినా పందేల బరిలోకి దిగిన తర్వాత ఇవి సర్వసాధార ణం. అయినా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కొందరు పేద, మధ్య తరగతి ప్రజలు ఈ పందేల మోజులో సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఈ పందేల్లో పది మందిలో తొమ్మిది మంది డబ్బులు పోగొట్టుకోగా ఒకరు మాత్రమే సొమ్ములు కళ్లజూశారు.
రారాజు నెమలి
సంక్రాంతి బరిలో నెమలి రకం కోడి పుంజు రారాజుగా నిలిచింది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మూడు రోజులపాటు జరిగిన అన్ని పందేల్లోను నెమలి హవా కొనసాగింది. దీంతో ఈ రకం పుంజులకు డిమాండ్ పెరిగింది. పందెపు రాయుళ్లు అధిక శాతం నెమలిపై హెచ్చు పందేలు కట్టారు.
నాలుగో రోజు నిలిచిన కోడి పందేలు
ఆకివీడు/తాడేపల్లిగూడెం రూరల్/భీమవరం రూరల్/కాళ్ల/మొగల్తూరు/తణుకు రూరల్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మూడు రోజులపాటు కోడి పందేలు, జూదాలను పట్టించుకోని పోలీసులు గురువారం రంగంలోకి దిగారు. ఆకివీడులో వేసిన బరుల వద్దకు చేరుకుని పందెం రాయుళ్ల ను అడ్డుకున్నారు. పందేలు వేసేందుకు ఆడవారుతో సహా బరులకు కోడి పుంజులతో వచ్చిన వారినందరిని వెనుక్కు పంపారు. బరుల దగ్గర ఉన్న జూదం, గుండాట తదితర ఆటల టెంట్‌లు తీయించారు. తినుబండారాలు అమ్మే వారిని అక్కడి నుంచి పంపించేశారు. చిన్న బరులు దగ్గర పందేలు నిర్వహిస్తుండగా పోలీసులు రావడంతో వారంతా పారిపోయారు. ఎవరైనా కోడి పందేళ్లు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని సీఐ జగదీశ్వరరావు హెచ్చరించారు. ముందురోజు వరకు లేడీ బౌన్సర్లతో సందడి చేసిన తాడేపల్లిగూడెం కోడి పందేల బరిలో కుర్చీలు ఖాళీగా మారి బోసిపోయాయి. భీమవరం మండలం తుందుర్రులో గురువారం మధ్యాహ్నం రెండు గంటల వరకు కోడి పందేలు వేశారు. మిగిలిన ప్రాంతాల్లో నిలిచిపోవడంతో ఉదయం ఇక్కడకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. విషయం పోలీసులకు తెలియడంతో నిలిపివేశారు. ఈ పందేలు జరిగినంత సేపు గుండాటలు కొనసాగాయి. కాళ్ల మండలం పెద అమిరం, సీసలి బరుల్లో గురు వారం కూడా పందేలు నిర్వహిస్తామని ప్రకటించడంతో కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పందెగాళ్లు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పందేలు లేవని నిర్వాహకులు ప్రకటించడంతో నిరాశతో వెనుదిరిగారు. పోలీసుల నుంచి హెచ్చరికలు రావడంతో మొగల్తూరు మండలంలో గురువారం ఎక్కడా పందేలు నిర్వహించ లేదు. పందేల కోసం ఎదురుచూసిన వారు నిరాశతో వెనుతిరిగారు. తణుకు మండలంలో మూడు రోజులుగా కోడి పం దేలు సాగాయి. నాలుగో రోజు పందేలు నిర్వహించేందుకు గురువారం పోలీసులు అడ్డుకున్నారు. మూడు రోజులపాటు యథేచ్ఛగా కోడి పందేలతోపాటు గుండాట, కోతాట, పేకాటలు యదేఽఛ్చగా నిర్వహించారు. మండలం లో కోడి పందేలు నిర్వహణపై 17 కేసులు నమోదు చేసి 34 మందిని అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ కృష్ణకుమార్ తెలిపారు.