Share News

Weather Forecast: అరచేతిలో తుఫాన్‌ దశ, దిశ..

ABN , Publish Date - Oct 29 , 2025 | 03:54 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా మారి తుఫానుగా బలపడి తీరంవైపు దూసుకొస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఇలాంటి తుఫాను హెచ్చరికలు...

Weather Forecast: అరచేతిలో తుఫాన్‌ దశ, దిశ..

  • తుఫాను ఎక్కడుందో చెప్పే వెదర్‌ యాప్స్‌

  • ఎండైనా, వానైనా... వాయుగుండమైనా..

  • వాతావరణాన్ని కచ్చితంగా చూపిస్తున్న యాప్స్‌

  • స్మార్ట్‌ ఫోన్లలో అందుబాటులోకి రకరకాల యాప్స్‌

  • క్షణక్షణం ప్రత్యక్ష సమాచారంతో ప్రజలు అప్రమత్తం

  • పంట, ఆస్తి, ప్రాణ నష్టం నివారణకు అవకాశం

(ఆంధ్రజ్యోతి - విజయవాడ సిటీ): ‘బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా మారి తుఫానుగా బలపడి తీరంవైపు దూసుకొస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..’ ఇలాంటి తుఫాను హెచ్చరికలు ఒకప్పుడు రేడియోలో వినేవాళ్లం..! టీవీలు వచ్చిన తర్వాత వాతావరణ బులిటెన్లు చూసి తెలుసుకుంటున్నాం. కానీ... ఇప్పుడు మన అరచేతిలోనే వాతావరణాన్ని అన్ని రకాలుగా విశ్లేషించుకోగలిగే వెదర్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

వాయుగుండం ఎలా కదులుతుందో.. తుఫాన్‌ ఏ దిశగా దూసుకొస్తుందో.. లైవ్‌లో చూసేయొచ్చు. గాలుల వేగం ఎలా ఉంటుందో, వర్షపాతం ఎంత కురుస్తుందో ఇలా ముందస్తు సమాచారాన్ని మనకు చిటికెలో అందిస్తున్నాయి. అధునాతన సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఎన్నో ఫోర్‌ కాస్ట్‌ (వాతావరణ) యాప్స్‌ మన ముందు సిద్ధంగా ఉన్నాయి. స్మార్ట్‌ ఫోన్‌ల్లోకి డౌన్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మొంథా తుఫాను కదలికలను ఎంతోమంది ఈ యాప్స్‌ ద్వారానే తెలుసుకుంటున్నారు. ఏ క్షణంలో ఎక్కడెక్కడ వాన పడుతుంది..? ఎంత మేర పడుతుంది..? తుఫాను దిశ ఎలా ఉంది..? ఏ దిక్కులో కదులుతుంది..? ఎన్ని కిలోమీటర్ల వేగంతో కదులుతుంది..? దాని ప్రభావం ఎంత వరకు విస్తరించి ఉంది..? ఎప్పుడు తీరాన్ని తాకుతుంది..? తీరాన్ని తాకిన తర్వాత దాని ప్రభావం ఎన్నిరోజులు ఉంటుంది..? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ యాప్స్‌ చక్కని సమాధానాలుగా నిలుస్తున్నాయి. వాతావరణ స్థిరత్వంతో పాటు మార్పులతో కూడిన క్షేత్ర స్థాయి సమాచారాన్ని ఈ యాప్‌లు మనకు అందిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్ర తీరానికి మొంథా తుఫాను ఉన్న దూరాన్ని, అది కదులుతున్న తీరును, దాని ప్రభావం విస్తరించిన ప్రాంతాన్ని ఈ యాప్స్‌ స్పష్టంగా తెలియజేస్తున్నాయి.


నష్ట నివారణకు అవకాశం

రెండు దశాబ్దాలుగా సాంకేతికత బాగా అభివృద్ధి చెందింది. స్మార్ట్‌ఫోన్ల రాకతో అనేక రకాల వెదర్‌ యాప్స్‌ రూపంలో వాతావరణ సమాచారం అరచేతిలోకి వచ్చింది. ఈ సమాచారంతో అన్నదాతలు అప్రమత్తమవుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు, నదీ పరివాహకంలోని గ్రామాల ప్రజలకు ఈ సమాచారం మేలు చేస్తోంది. ప్రళయాలను సమయస్ఫూర్తితో ఎదుర్కొనే అవకాశం కలుగుతోంది. ఈ యాప్‌లు ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారిస్తున్నాయి.

ప్రముఖ వెదర్‌ యాప్స్‌ ఇవే..

వెదర్‌ ఫోర్‌ కాస్ట్‌, లైవ్‌ వెదర్‌, వెదర్‌ అండ్‌ రాడార్‌, ద వెదర్‌ చానెల్‌, విండీ, యాక్యూ వెదర్‌, వెదర్‌ రాడార్‌, యాహువెదర్‌, లోకల్‌ వెదర్‌, డైలీ ఫోర్‌కాస్ట్‌, వెదర్‌ ఫోర్‌కాస్ట్‌, వెదర్‌24, వెదర్‌ అండర్‌ గ్రౌండ్‌, జూమ్‌ ఎర్త్‌, వెదర్‌ లైవ్‌, టుడే వెదర్‌, ద వెదర్‌ నెట్‌వర్క్‌, రెయిన్‌బో వెదర్‌, రెయిన్‌ వ్యూవర్‌, హాలో వెదర్‌, రెయిన్‌ అలారం, వెదర్‌ ప్రో, విండ్‌ హబ్‌, ఓపెన్‌ వెదర్‌, ఓవర్‌ డ్రాప్‌.

ఇవి కూడా చదవండి..

ఎంసీడీ వార్డుల్లో ఉపఎన్నికలను ప్రకటించిన ఈసీ

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం

Updated Date - Oct 29 , 2025 | 10:21 AM