Share News

YCP Government Can't Pay వైసీపీ సర్కారు చెల్లించలే.. వారు అప్పగించలే!

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:19 AM

YCP Government Can't Pay... They Can't Hand Over గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం .. అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారులకు శాపంగా మారింది. బిల్లులు చెల్లింపు.. నిధుల కేటాయింపులో అలసత్వం వహించింది. దీంతో పాచిపెంట మండలంలో పలు అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు.

YCP Government Can't Pay  వైసీపీ సర్కారు చెల్లించలే.. వారు అప్పగించలే!
పాచిపెంటలో నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోని అంగన్‌వాడీ భవనాలు

  • నిర్మాణాలు పూర్తయినా అంగన్‌వాడీ కేంద్రాలను అప్పగించని కాంట్రాక్టర్లు

  • నిలిచిపోయిన మరికొన్ని భవనాల నిర్మాణాలు

  • అద్దె భవనాల్లో కొనసాగుత్ను కేంద్రాలు

  • ఇబ్బందుల్లో సిబ్బంది, చిన్నారులు

పాచిపెంట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం .. అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారులకు శాపంగా మారింది. బిల్లులు చెల్లింపు.. నిధుల కేటాయింపులో అలసత్వం వహించింది. దీంతో పాచిపెంట మండలంలో పలు అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. బిల్లులు అందక కాంట్రాక్టర్లు వాటిని అప్పగించడం లేదు. కొన్ని చోట్ల భవన నిర్మాణాలు వివిధ దశల్లోనే నిలిచిపోయాయి. దీంతో నేటికీ అనేక అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె గృహాల్లోనే కొనసాగుతున్నాయి. చాలీచాలని గదులు, మౌలిక సదుపాయాల కొరతతో సిబ్బంది, చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఇదీ పరిస్థితి..

- పాచిపెంట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 235 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 83 మినీ అంగన్‌వాడీలు ఉన్నాయి. కాగా 85 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొన సాగుతున్నాయి. మరో 20 కేంద్రాలు ఇతర ప్రభుత్వ శాఖల భవనాల్లో కొనసాగుతున్నాయి.

- నూతన భవనాలు మంజూరైనా నిర్మాణాలు పూర్తికాకపోవడంతో ఏళ్ల తరబడి అద్దె చెల్లించక తప్పడం లేదు. భవనాన్ని బట్టి ప్రతినెలా రూ.వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు అద్దె చెల్లిస్తున్నారు. మరోవైపు అద్దె భవనాల్లో వసతుల కొరత వేధిస్తోంది. దీంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలీచాలని గదులతోనే వారు సర్దుకోవాల్సి వస్తుంది. ఈ సమస్య దీర్ఘకాలికంగా వేధిస్తున్నా పట్టించుకొనే వారు కరువయ్యారు.

- 2016-17లో ఉపాధి హామీ పథకం కింద ఐదు భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవన నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రూ. 5 లక్షలు, స్త్రీ శిశు సంక్షేమశాఖ ద్వారా రూ. 2 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. ఈ నిధులతో పాచిపెంటలో రెండు , పాంచాలి, మోసూరు, మాతు మూరులో ఒక్కొక్కటి చొప్పున అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు చేపట్టారు. అయితే వాటి పనులు పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు సదరు భవనాలను అప్పగించడం లేదు. దీంతో ఆయా భవనాలు నిరుపయోగంగా మారాయి.

- గత వైసీపీ ప్రభుత్వ పాలనలో నాడు-నేడు రెండో ఫేజ్‌ కింద 25 అంగన్‌వాడీ భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవనాన్ని రూ.13.50 లక్షలతో నిర్మించాలని భావించారు. అయితే 15 శాతం నిధులు మాత్రమే విడుదల కావడంతో వాటి నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. తక్షణమే కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం

బిల్లులు చెల్లించకపోవడంతో భవనాలు పూర్తయినా కాంట్రాక్టర్లు అప్పగించలేదు. మరికొన్ని భవనాల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడం వాస్తవం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం.

- బొత్స అనంతలక్ష్మి, సీడీపీవో, పాచిపెంట

Updated Date - Jan 07 , 2025 | 12:19 AM