మహిళలది గురుతర బాధ్యత
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:22 AM
Women have a heavy responsibility సంతానాన్ని, సమాజాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత మహిళల చేతిలో ఉందని హోంమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని రాజీవ్ క్రీడామైదానంలో మెప్మా, డీఆర్‌డీఏ, సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహిళలది గురుతర బాధ్యత
ధైర్యాన్ని, స్థైర్యాన్ని అలవర్చుకోవాలి
మహిళా దినోత్సవ వేడుకల్లో హోంమంత్రి అనిత
విజయనగరం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):
సంతానాన్ని, సమాజాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత మహిళల చేతిలో ఉందని హోంమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని రాజీవ్ క్రీడామైదానంలో మెప్మా, డీఆర్‌డీఏ, సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 30 వేల మందికి రూ.450 కోట్లు విలువైన ఆస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారన్నారు. మగపిల్లలు కంటే ఆడపిల్లనే నయమన్న రోజులు వచ్చాయన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా, ధీమాగా ఉండేటట్టు చూసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మహిళలకు ఎనలేని గౌరవం ఇచ్చి వారికి ఆస్తిలో వాటా అందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందని గుర్తు చేశారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, తన పార్లమెంటు పరిధిలో ఇకపై పుట్టే మూడో సంతానం ఆడపిల్ల అయితే రూ.50 వేలు అందజేస్తానని, మూడో సంతానం మగబిడ్డయితే, ఆవుదూడ ఇస్తానని ప్రకటించారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ మహిళలు మానవత్వానికి ప్రతి రూపమని, వారే సమాజ శిల్పులని కొనియాడారు. జిల్లా ఓటర్లలోనూ మహిళల సంఖ్య ఎక్కువన్నారు. ఎస్పీ వకుల్‌జిందాల్ మాట్లాడుతూ, మహిళలను నిరంతరం గౌరవించుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఆడపిల్లల పట్ల వివక్షత వీడాలని, ఈ మార్పు కుటుంబం నుంచే ప్రారంభం కావాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, పూసపాటి వంశీయుల సహకారంతోనే మొట్టమొదటిగా విజయనగరంలో మహిళా కళాశాల ఏర్పాటైందని, అందులో చదువుకున్న మహిళలెందరో ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్విని, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, డీఎంహెచ్‌ఓ డాక్టరు జీవనరాణి, మెప్మా పీడీ చిట్టిరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ పి నల్లనయ్య, ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ ప్రసన్న, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత తదితరులు పాల్గొన్నారు. అంతకముందు గంటస్తంభం నుంచి వేలాదిమందితో భారీ ర్యాలీ నిర్వహించారు.