చొరవ చూపుతారా.. వివాదం పరిష్కరిస్తారా?
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:23 AM
Will You Take Initiative or Resolve the Dispute? ఏవోబీ వివాదాస్పద ప్రాంతం కొఠియాలో పట్టు సాధించడం కోసం ఒడిశా మళ్లీ దూకుడు పెంచింది. సాలూరు మండలంలో ఉన్న 21 గ్రామాలపై ఆధిపత్యం కోసం నిత్యం కొఠియాలో గొడవలకు దిగుతోంది.

ఏవోబీ గ్రామాలపై పట్టు కోసం ప్రయత్నాలు
తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న వైనం
గత ఏడాది ఎన్నికలతో మారిన పరిస్థితి..
ఇరు రాష్ర్టాల్లో కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వాలు
దీర్ఘకాల సమస్య పరిష్కారానికి ఇదే మంచి అవకాశం
ఆయా ప్రాంతవాసుల్లో చిగురిస్తున్న ఆశలు
సాలూరు రూరల్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఏవోబీ వివాదాస్పద ప్రాంతం కొఠియాలో పట్టు సాధించడం కోసం ఒడిశా మళ్లీ దూకుడు పెంచింది. సాలూరు మండలంలో ఉన్న 21 గ్రామాలపై ఆధిపత్యం కోసం నిత్యం కొఠియాలో గొడవలకు దిగుతోంది. తాజాగా దిగువశెంబి అంగన్‌వాడీ కేంద్రంలో తెలుగులో ఉన్న టీఎల్‌ఎం పోస్టర్లు, కేంద్రం నేమ్ బోర్డును ఒడిశా అధికారులు తీసుకెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎగువశెంబి, దిగువశెంబి గ్రామాల్లో అభివృద్ధి పనులను అడ్డకుని సామగ్రి తీసుకెళ్లడం, అంగన్‌వాడీ సరుకులు, వైద్య సిబ్బంది సేవలు అందించకుండా అడ్డు తగలడం.. కవ్వింపు చర్యలకు పాల్పడడమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- కొఠియా గ్రూప్‌లో కొఠియా, గంజాయిభద్ర, ఎగువశెంబి, దిగువ శెంబి, గాలిగబడారు, రణసింగిఽ, దూళిభద్ర, నేరేళ్లవలస, దొరలతాడివలస, పట్టుచెన్నారు, పగులుచెన్నారు, కోనధార, సొలిపిగుడ, డొలియాంబ, అర్జువలస తదితర గ్రామాలు ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదంలో ఉన్నాయి.
- ఈ వివాదం బ్రిటీష్ కాలంలో ఉన్న మద్రాస్ , కోల్‌కతా ప్రెసిడెన్సీల నుంచి కొనసాగుతుంది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం కొఠియా గ్రామాలు తమవేనంటూ ఒడిశా 1968, మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయస్థానం స్టేటస్‌కో జారీ చేసింది. అప్పటి నుంచి కొఠియా గ్రామాల్లో ఆంధ్ర-ఒడిశా రాష్ర్టాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి
- కొఠియా గ్రూప్ గ్రామాలపై పట్టుకోసం 2018 నుంచి ఒడిశా దూకుడు పెంచింది. ఈ గ్రామాలకు వందలాది కోట్లు వెచ్చించింది. మౌలిక వసతుల కల్పన తదితర వాటికి ఒడిశా ప్రాధాన్యమిచ్చింది.
- ఏపీ సైతం కొఠియాలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఇదే సమయంలో ఏపీ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ఒడిశా గత ఐదేళ్లు నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపీ నుంచి వెళ్లే అధికారులను ఎప్పటికప్పుడు ఒడిశా అధికారులు అడ్డుకుంటున్నారు. గంజాయిభద్ర గ్రామాలకు వైద్యసేవలకు వెళ్లిన తోణాం పీహెచ్‌సీ వైద్యుడిని రెండుసార్లు అడ్డుకున్నారు. సర్వేకు వెళ్లిన మహిళా పోలీస్, వైద్యసిబ్బందిని ఒడిశా బీడీవో అడ్డుకున్నారు. విద్యుత్ మీటర్లు వేయడానికి వెళ్లిన ఏపీఈసీడీసీఎల్‌ను సిబ్బందిని, పింఛన్లు పంపిణీకి వెళ్లిన వారిని కూడా అడ్డుకున్న సంఘటనలున్నాయి. వెలుగు ఏపీడీని సైతం అడ్డుకున్నారు. గతంలో కలెక్టర్ నిశాంత్‌కుమార్ కొఠియా గ్రామానికి వెళ్లడానికి ప్రయత్నించి ధూళిభద్ర నుంచే వెనుదిరిగాల్సి వచ్చింది.
- పరిషత్ ఎన్నికల సమయంలో ఒడిశా ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ వివాదాన్ని రెండు రాష్ర్టాలు చర్చలు జరుపుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. అయితే ఆ తర్వాత ఇరు రాష్ర్టాల సీఎంలు నవీన్ పట్నాయక్, జగన్‌లు సమావేశమైనా వివాదం పరిష్కారం కాలేదు. నేటికీ మూడేళ్లవుతున్నా.. ఆ దిశగా అడుగులు పడలేదు. ఒడిశా తీరులో కూడా మార్పు రాలేదు.
ఇదే మంచి తరుణం
గతంలో కేంద్రంలో బీజేపీ, ఒడిశాలో బీజేడీ, ఏపీలో వైసీపీ ప్రభుత్వాలు ఉండేవి. దీంతో కొఠియా వివాదం పరిష్కారానికి ఎవరు చొరవ చూపలేదు. పైగా ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం వివాదాన్ని రాజేయడానికే చూసింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో, ఏపీ, ఒడిశాలో ఎన్డీఏ ప్రభుత్వాలే కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో కొఠియా వివాదాన్ని పరిష్కరించడానికి మంచి అవకాశ మేర్పడింది. దీనిపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఏవోబీ ప్రజలు కోరుతున్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం : మంత్రి సంధ్యారాణి
సాలూరు,ఫిబ్రవరి12(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కొఠియాలో ఒడిశా దూకుడుకు కారణమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం స్థానిక విలేఖర్లతో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ.. నాటి సీఎం జగన్ కొఠియా గ్రామాల సమస్యను పట్టించుకోలేదన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేసుల నుంచి కాపాడాలని కేంద్రాన్ని కోరడం తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తాను కొఠియా సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
సంయమనం పాటించాలి
కొఠియా గ్రూప్ గ్రామాల విషయమై ఒడిశా సంయమనంతో వ్యవహరించాలి. ఏపీ అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదు. ఈ గ్రామాల విషయమై ఉన్న స్టేటస్ కో ను గౌరవించాలి.
- గెమ్మల డోంబు, దిగువ కొఠియా
=========================
సామరస్యంగా వ్యవహరించాలి
కొఠియా వివాదంపై ఏపీ ఎంతో సామరస్యంగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి పాటు పడుతుంది. రూ. 4 వేలు పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఇళ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఒడిశా సామరస్యపూర్వకంగా ఉండాలి. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడం తగదు.
- సీదరపు చుక్క, పట్టుచెన్నారు