Share News

ఇలానే వదిలేస్తారా?

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:10 AM

పాలకొండలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో లక్షలాది రూపాయల విలువ చేసే వాహనాలు నిరుపయోగంగా దర్శనమిస్తోన్నాయి. చిన్న చిన్న మరమ్మతులకు గురైన అవి కొన్నాళ్లుగా వినియోగానికి నోచుకోవడం లేదు.

    ఇలానే వదిలేస్తారా?
పాలకొండ పోలీస్‌స్టేషన్‌ వద్ద వాహనాలు

ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరుపయోగంగా వాహనాలు

ఎక్సైజ్‌, పోలీస్‌స్టేషన్లలో అదే పరిస్థితి

వివిధ కేసుల్లో సీజ్‌ అయిన వాహనాలకు తుప్పు

పాలకొండ, జనవరి 30(ఆంధ్రజ్యోతి): పాలకొండలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో లక్షలాది రూపాయల విలువ చేసే వాహనాలు నిరుపయోగంగా దర్శనమిస్తోన్నాయి. చిన్న చిన్న మరమ్మతులకు గురైన అవి కొన్నాళ్లుగా వినియోగానికి నోచుకోవడం లేదు. దీంతో అవి మూలకు చేరి తుప్పుపట్టి పోతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా.. పరిస్థితి మారకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక పంచాయతీరాజ్‌ కార్యాలయం వద్ద రోడ్డు రోలర్‌ 15 ఏళ్ల కిందట చిన్నపాటి మరమ్మతులకు గురై మూలకు చేరింది. అదే కార్యాలయం బయట ఉన్న జీపు తుప్పుపట్టి ఉంది. దాని ప్రధాన విడి భాగాలు దొంగలపాలయ్యాయి. ఆర్‌అండ్‌బీ బంగ్లా సమీపంలో చిన్నపాటి వాహనాలు, తారు కలిపే యంత్రాలు పూర్తిగా పాడై మట్టిలో కలిశాయి. ఇదిలా ఉండగా ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో సారా తయారీ, రవాణా విక్రయదారుల నుంచి సీజ్‌ చేసిన ఆటోలు, బైక్‌లను సకాలంలో వేలం వేయడం లేదు. దీంతో ఏళ్లతరబడి అవి ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పూర్తిగా పాడవుతున్నాయి. పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. అందుబాటులో ఉన్న ప్రభుత్వ వాహనాలకు మరమ్మతులు చేయక పోవడంతో అవి మట్టిలో కలుస్తున్నాయి. దీనిపై పాలకొండ సీఐ ఎం.చంద్రమౌళిని వివరణ కోరగా.. ‘ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను వేలం వేస్తాం. తద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖాజానాకు జమచేస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Jan 31 , 2025 | 12:10 AM