కరకట్ట పనులు కదిలేనా?
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:28 PM
Will the Karakatta Works Progress? గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి జిల్లాలో కరకట్టల పనులు పూర్తవ్వలేదు. రివర్స్ టెండరింగ్ వల్ల నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. దీంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలో వంశధార, నగావళి నది తీర గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఏటా ముంపునకు గురవుతున్న నదీ తీర గ్రామాలు
వరదల సమయంలో పంటలకు తీవ్ర నష్టం
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
పాలకొండ, ఫిబ్రవరి15(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి జిల్లాలో కరకట్టల పనులు పూర్తవ్వలేదు. రివర్స్ టెండరింగ్ వల్ల నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి. దీంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలో వంశధార, నగావళి నది తీర గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏటా వర్షాకాలంలో ముంపు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒడిశాలోని క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిస్తే నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. ఈ సమయంలో ఆయా నదుల పరిధిలో ఉన్న పరివాహక ప్రాంతాల ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఆయా గ్రామాలతో పాటు పంటలు కూడా ముంపు నకు గురువడంతో ఏటా వారు తీవ్రంగా నష్టపోతున్నారు.
ముంపు ముప్పులో..
- కరకట్టలు లేకపోవడంతో నాగావళి నది తీరంలో 138 గ్రామాలు ఏటా ముంపునకు గురవుతున్నాయి. పాలకొండ మండలంలో నాలుగు, ఆమదాలవలస మండలంలో 16, రేగిడి ఆమదాలవలస 12, వీరఘట్టం 10, బూర్జ 16, సంతకవిటి 21, వంగర 7, పొందూరు ఐదు, ఎచ్చెర్ల 12, శ్రీకాకుళం 4, కొమరాడ 18, గరుగుబిల్లి 11, జియమ్మవలస మండలంలో రెండు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి.
- వంశధార నదీ పరిధిలో 2007లో భామిని మండలంలో బత్తిలి నుంచి శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట, కళింగపట్నం వరకు నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. రెండు విడతల్లో పనులు ప్రారంభించి వదిలివేశారు. 2018లో రూ.1056 కోట్లతో అంచనా రూపొందించారు. రైతులు నుంచి 600 ఎకరాలు సేకరించినా నేటికీ రూపాయి కూడా చెల్లించలేదు. పనులు 8 శాతం మాత్రమే జరగ్గా.. వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండర్ల పేరుతో ఆ పనులను నిలిపివేసింది. దీంతో వంశధారకు వరద వస్తే మూడు జిల్లాలోని వేల ఎకరాల పంట భూములు ఏటా ముంపునకు గురవుతున్నాయి.
పనులు ఇలా...
- ఫేజ్-1లో నాగావళి నది పరిధిలో 30 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు చేసింది 13 కిలోమీటర్లు మాత్రమే. 105 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. వీటిలో 14 రకాల పనులు చేయాలి. ఇప్పటివరకు ఎనిమిది గ్రోయన్లు పనులు పూర్తి చేశారు.
- ఫేజ్-2లో 51.88 కిలోమీటర్లకు గాను ఇప్పటివరకు 25 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు. 3.185 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాల్సి ఉండగా.. 1.5 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేశారు. 245 ఎకరాల వరకు భూ సేకరణ చేపట్టాల్సి ఉండగా.. 105 ఎకరాలు మాత్రమే సేకరించారు. 53 గ్రోయన్ల పనులకు గాను మూడు పనులే పూర్తయ్యాయి.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం...
నాగావళి నదిపై రెండు దశల్లో కరకట్టల నిర్మాణానికి 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేపట్టింది. కొమరాడ మండలం కూనేరు నుంచి వీరఘట్టం మండలం చిట్టపుడివలస, శ్రీకాకుళం జిల్లాలో కల్లేపల్లి వరకు 80.88 కిలోమీటర్ల మేర కరకట్ట పనులు కొన్నాళ్ల వరకు సాగాయి. 2014-19లో టీడీపీ ప్రభుత్వం ఆ పనులు కొనసాగించింది. కొంతమేర 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కరకట్టల నిర్మాణ పనులను గాలికొదిలేసింది. 2020లో రివర్స్ టెండర్స్ పేరుతో ప్రత్యేక జీవో జారీ చేసింది. దీంతో నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాం తాల్లో కరకట్టల పనులకు బ్రేక్‌లు పడ్డాయి. కాగా కూటమి ప్రభుత్వం పైనే నదీతీర గ్రామాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కరకట్టల పనులను పూర్తి చేసి నదీపరివాహక ప్రాంతాల ప్రజలను వరదల బాధ నుంచి రక్షించాలని కోరుతున్నారు.
సురక్షిత ప్రాంతాలకు పరుగులు..
ఏటా వర్షాకాలంలో నాగావళి నదికి వరదలు వస్తే భయం భయంగా గడపాల్సి వస్తోంది. మా గ్రామం వద్ద కరకట్టల నిర్మాణం చేపట్టలేదు. ఒడిశాలో భారీ వర్షాలు కురిస్తే.. మా గ్రామంలోకి వరదనీరు చొచ్చు కొస్తుంది. ఆ సమయంలో రెవెన్యూ, పోలీస్ సహకారంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోంది.
- కె.శ్రీనివాసరావు, అన్నవరం
=========================
పంటలు కోల్పోతున్నాం
నాగావళి నది పక్కనే ఉన్న మా గ్రామానికి ఏటా వరద ముంపు పొంచి ఉంది. దీంతో పంటలను కోల్పోతున్నాం. గ్రామంలోకి నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. త్వరితగతిన కరకట్టల పనులు చేపట్టాలి.
- కనపాక సంగంనాయుడు, గోపాలపురం
======================
ప్రతిపాదనలు పంపించాం
కరకట్టల నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల అత్య వసరంగా చేయాల్సిన పనులున్నాయి. వాటి కోసం గత ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం మళ్లీ అత్యవసర పనులకు ప్రతిపాదించాం. నిధులు మంజూరైతే కరకట్టల పనులు చేపడతాం.
- ఎ.రమేష్‌కుమార్, డీఈఈ, స్పెషల్ కనస్ట్రక్షన్ పాలకొండ సబ్ డివిజన్-2