Share News

Centre కేంద్రం కరుణించేనా?

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:59 PM

Will the Centre Show Mercy? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉంటాయోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Centre  కేంద్రం కరుణించేనా?
మూతపడిన సాలూరు రైల్వే స్టేషన్‌

  • గిరిజన యూనివర్సిటీకి సొంత భవనం కరువు

  • నిధుల కేటాయింపుపై సర్వత్రా చర్చలు

  • బడ్జెట్‌పై కోటి ఆశలు

సాలూరు రూరల్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉంటాయోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా గుణుపూర్‌ నుంచి వయా సాలూరు మీదుగా నర్సీపట్నం రైల్వే లైన్‌ ఏర్పాటు, సర్వేకు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇస్తారనే యోచనలో ఉన్నారు. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, నూతన జిల్లా పార్వతీపురానికి నిధుల కేటాయింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

ఇదీ పరిస్థితి..

- గుణుపూర్‌ నుంచి వయా సాలూరు మీదుగా నర్సీపట్నానికి కొత్తగా రైల్వే లైన్‌ ఏర్పాటు చేయనున్నట్టు యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర గిరిజన, పంచాయతీ వ్యవహారాల మంత్రి కిశోర్‌ చంద్ర సూర్యనారాయణ దేవ్‌ ప్రకటించారు. దీంతో రైల్వే పరంగా సాలూరుకు మహర్దశ పడుతుందని అంతా ఆనందించారు. అయితే ఈ లైన్‌ పరిశీలన, సర్వేపై నాటి యూపీఏ ప్రభుత్వ రైల్వే బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.

- 2015లో ఈ లైన్‌ గురించి సర్వే పనులు చేసి ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే గత పదేళ్లుగా పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న ఏ బడ్జెట్‌లోనూ ఈ లైన్‌ ప్రతిపాదన లేదు. రైల్వేశాఖ ప్రత్యేకంగా విడుదల చేసే పింక్‌ బుక్స్‌లో సైతం ఈ లైన్‌ ఏర్పాటుపై ఎటువంటి ప్రస్తావన లేదు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా కరుణిస్తే.. ఈ ప్రాంతం సత్వర అభివృద్ధి చెందుతుని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. అదే జరిగితే మూతపడిన సాలూరు రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ జరిగే అవకాశాలు న్నాయని సాలూరు వాసులు ఆశిస్తున్నారు. వాస్తవంగా ఎంపీలు మారుతున్నా.. సాలూరు రైల్వే స్టేషన్‌ పరిస్థితి మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి గుణుపూర్‌- నర్సీపట్నం రైల్వేలైన్‌ ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

- ఈ రైల్వే లైన్‌ ఏర్పాటైతే సాలూరు ఏజెన్సీ పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న గనుల రవాణా ద్వారా ఆదాయం సమకూరే అవకాశముంది. ఇక్కడి రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ జరుగుతుంది. రిజర్వేషన్‌ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

- ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చేలా ప్రస్తుత ప్రజాప్రతినిధులు, వివిధ పక్షాల నేతలు శ్రద్ధ వహించాలని స్థానికులు కోరుతున్నారు.

పరాయి పంచన గిరిజన యూనివర్సిటీ

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం మంజూరైంది. దీన్ని విజయనగరం జిల్లాకు కేటాయించారు. అయితే, పదేళ్లు దాటుతున్నా ఈ విశ్వవిద్యాలయానికి సొంత గూడు లేక పరాయిపంచన నడుస్తోంది. 2019 ఆగస్టు నుంచి తరగతులు జరుగుతున్నాయి. 426 మంది విద్యార్థులు 14 రకాల కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరంతా సొంత తరగతి గదుల్లో చదువుకునేందుకు ఎదురు చూస్తున్నారు. గిరిజన యూనివర్సిటీని రాష్ట్రానికి కేటాయించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు బడ్జెట్‌లను ప్రవేశ పెట్టింది. అయితే, ఇంతవరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ల్లో యూనివర్సిటీకి ఎంత కేటాయించారో అధికారిక లెక్కలు బయటపడలేదు. ఈ బడ్జెట్‌లోనైనా గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయిస్తారని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 11:59 PM