Share News

ఎందుకీ గోప్యత?

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:18 AM

పదోన్నతి కోసం గ్రామ, వార్డు సచివాలయాల గ్రేడ్‌-3 ఏఎన్‌ఎం (హెల్త్‌ సెక్రటరీ)లు ఎదురు చూస్తున్నారు.

ఎందుకీ గోప్యత?
సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలు(ఫైల్‌)

- ఏఎన్‌ఎంల సీనియారిటీ జాబితా ప్రదర్శనలో అధికారుల నిర్లక్ష్యం

- మిగతా జిల్లాల్లో విడుదల

- ఐదు నెలలుగా పదోన్నతల కోసం ఎదురుచూపు

- మరోసారి ఆదేశాలు జారీచేసిన హెల్త్‌ కమిషనర్‌

శృంగవరపుకోట, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): పదోన్నతి కోసం గ్రామ, వార్డు సచివాలయాల గ్రేడ్‌-3 ఏఎన్‌ఎం (హెల్త్‌ సెక్రటరీ)లు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం జీవో జారీ చేసి ఐదు నెలలు అవుతున్నా ఇంకా సీనియారిటీ జాబితాను ప్రదర్శించకుండా అధికారులు గోప్యత పాటించడంపై వారు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల ప్రోహిబిషన్‌ పిరియడ్‌తో 11 శాఖలకు చెందిన వారంతా సచివాలయ ఉద్యోగులుగా విధుల్లో చేరారు. ఆయా శాఖల ఉద్యోగులను సచివాలయాల్లో సమన్వయం చేసేందుకు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. ఇందులో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఏఎన్‌ఎంలు కూడా ఉన్నారు. 2021 జూలైలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరితో పాటు ఏఎన్‌ఎంలను క్రమబద్ధీకరించారు. అప్పట్లో వీరందరికీ గ్రేడ్‌-3 హోదా కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పదోన్నతలు కల్పించాలని భావించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబరు 26న రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే, అక్టోబరు 7న ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ నుంచి మరో జీవో విడుదలైంది. దీని ప్రకారం అక్టోబరు 15న సీనియార్టీ జాబితా ప్రదర్శన, 18న అభ్యంతరాల స్వీకరణ, 21న పరిష్కారం, 22న సీనియార్టీ జాబితాను అందుబాటులోకి తేవడంతో పాటు కౌన్సిలింగ్‌ ద్వారా ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలు అందించాల్సి ఉంది. కానీ, ఇంతవరకు కనీసం సీనియార్టీ జాబితాను కూడా ప్రదర్శించలేదు. గత ఏడాది అక్టోబరులో గుర్లలో డయేరియా ప్రబలింది. వందల సంఖ్యలో ప్రజలు అస్వస్తతకు గురయ్యారు. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అంతా గుర్లకు తరలివెళ్లింది. ఈ బిజీలో సీనియార్టీ జాబితా తయారు చేయడంలో అవంతరాలు వచ్చాయని ఏఎన్‌ఎంలు సరిపెట్టుకున్నారు. ఆ తరువాత అప్పటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి భాస్కరరావు సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా జీవరాణిని ప్రభుత్వం నియమించింది. అయినా ఏఎన్‌ఎంల సీనియార్టీ జాబితాను మాత్రం అధికారులు ప్రదర్శించలేదు.

అంతా గోప్యం..

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇప్పటికే సీనియార్టీ జాబితాలను ప్రదర్శించారు. కానీ, జిల్లాలో మాత్రం అందుబాటులో ఉంచలేదు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, వైద్య ఆరోగ్య సంఘాల్లో పని చేస్తున్న నాయకులకు సంబంధించిన బంధువులకు, తమకు తెలిసినవారికి పదోన్నతుల్లో చోటు కల్పించేందుకు సీనియార్టీ జాబితాను ప్రదర్శించకుండా గోప్యంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీనియార్టీ జాబితాలో పేర్లు తారుమారువుతాయేమోనని గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జి.వీరపాండ్యన్‌ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని ఈనెల 2న మరోసారి ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటికైనా సీనియార్టీ జాబితాను ప్రదర్శిస్తారని, దాని ప్రకారం పదోన్నతి దక్కుతుందని ఏఎన్‌ఎంలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:18 AM