Share News

ration cards ఎప్పుడిస్తారో?

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:36 PM

When Will They Provide? సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు కీలకం. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత పథకాల అమలు వేగవంతం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నో కుటుంబాలు కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి.

ration cards ఎప్పుడిస్తారో?

త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని విన్నపం

జియ్యమ్మవలస, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు కీలకం. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత పథకాల అమలు వేగవంతం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నో కుటుంబాలు కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ వైఖరితో రేషన్‌ కార్డులు లేక.. ఇళ్లు, ఇంటి స్థలాల మంజూరు విషయంలో దారుణంగా నష్టపోయిన జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 2,22,049 తెలుపు రేషన్‌కార్డులు, 55,104 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో ఎంతోమంది వాటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా పాలకొండ డివిజన్‌లో ఉన్న ఏడు మండలాల పరిధిలో 259 ఎఫ్‌పీ (ఫెయిర్‌ ప్రైస్‌) షాపులు ఉన్నాయి. పార్వతీపురం డివిజన్‌లోని ఎనిమిది మండలాల పరిధిలో 319 ఎఫ్‌పీ షాపులు ఉన్నాయి. ఇందులో 518 ఆన్‌లైన్‌ ఎఫ్‌పీ షాపులు కాగా, 60 ఆఫ్‌లైన్‌లో నడుస్తున్నాయి. వీటన్నింటికీ రేషన్‌ సరఫరా చేసేందుకు ఎనిమిది మండల స్థాయి స్టాక్‌ పాయింట్లు (ఎంఎల్‌ఎస్‌) ఉన్నాయి. వాటి నుంచి మండలానికి అవసరమైన ప్రతి రేషన్‌ షాపునకు బియ్యం, కందిపప్పు, పంచదార, రాగి పిండి తదితర వాటిని సరఫరా చేస్తున్నారు. వీటిని ప్రజలకు అందించేందుకు పార్వతీపురం డివిజన్‌లో 110, పాలకొండ డివిజన్‌లో 86 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. కాగా ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డు అత్యంత కీలకం. ఇళ్ల స్థలాల మంజూరు, పిల్లలు పాఠశాలల ప్రవేశానికి , వైద్యసేవలకు కూడా ఇది తప్పనిసరి. అయితే గత నాలుగేళ్లుగా రేషన్‌కార్డుల్లో చేర్పులు, మార్పులు, తొలగింపులు, కొత్త కార్డుల కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. అయినా గత వైసీపీ సర్కారు స్పందించలేదు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌కార్డుల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం త్వరగా చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఇంకా రాలేదు

కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే కలెక్టర్‌ ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం.

- శ్రీనివాసరావు, డీఎం, సివిల్‌ సప్లైస్‌, పార్వతీపురం మన్యం

Updated Date - Feb 14 , 2025 | 11:36 PM