Share News

Liquor shops: కారణమేంటి?

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:14 AM

Liquor shops: జామి మండలంలో ఐదు రోజుల కిందట మూడు మద్యం దుకాణాలను అధికారులు మూసివేయించి మళ్లీ గంటల వ్యవధిలోనే వాటిని తెరిపించారు.

Liquor shops: కారణమేంటి?
ఈ నెల 20న జామిలో తహసీల్దార్‌ మూయించిన మద్యం దుకాణం , అదే రోజు రాత్రి మళ్లీ తెరుచుకున్న దుకాణం

- మద్యం షాపులు ఎందుకు మూయించినట్లు.. ఎందుకు తెరిపించినట్లు..

జామి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జామి మండలంలో ఐదు రోజుల కిందట మూడు మద్యం దుకాణాలను అధికారులు మూసివేయించి మళ్లీ గంటల వ్యవధిలోనే వాటిని తెరిపించారు. దీనికి కారణం ఏమిటో ఇప్పటి వరకు తెలియలేదు. ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తహసీల్దార్‌ కృష్ణలత వీఆర్వోలతో కలిసి వెళ్లి జామిలో రెండు మద్యం దుకాణాలు, భీమసింగిలో ఒక మద్యం దుకాణాన్ని మూసివేయించి తాళాలు వేయించారు. ఈ పరిణామంతో ఆ దుకాణాలకు చెందిన అధికార పార్టీ అనుచరులు ఉలిక్కిపడ్డారు. ఏ కారణం లేకుండా తమ మద్యం షాపులను మూయించడాన్ని అవమానంగా భావించారు. వెంటనే ఈ విషయాన్ని తమ నాయకులకు చెప్పడం.. ఆ వెంటనే ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు రంగంలోకి దిగడం.. వారు తహసీల్దార్‌తో చర్చలు జరపడం చకాచకా జరిగిపోయాయి. అలాగే, తహసీల్దార్‌కు కొంతమంది వ్యక్తుల నుంచి ఫోన్లు కూడా వచ్చాయి. దీంతో అదే రోజు (20న) రాత్రి 9 గంటలకు తహసీల్దార్‌ వీఆర్వోలను పంపించి మద్యం దుకాణాలకు వేసిన తాళాలను తీయించారు. అయితే, ఇది జరిగి ఐదురోజులు అవుతున్నా దాని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పటి వరకు తెలియకపోవడం చర్చానీయాంశంగా మారింది. దుకాణాల వద్ద బహిరంగ మద్యం సేవిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతోనే వాటికి తాళాలు వేయించినట్లు తహసీల్దార్‌ కృష్ణలత చెబుతున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:14 AM