Share News

రాష్ట్రానికి మీరేం చేశారు?

ABN , Publish Date - Feb 02 , 2025 | 11:14 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ బాగాలేదని వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

రాష్ట్రానికి మీరేం చేశారు?
మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌

- ఒక్కప్రాజెక్టునైనా తీసుకొచ్చారా?

- పథకాల పేరుతో ఆర్థికంగా దెబ్బతీశారు

-బొత్స వల్ల విద్యాశాఖ నాశనమైంది

-మంత్రి కొండపల్లి

విజయనగరం ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ బాగాలేదని వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బొత్స చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి మీరేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆదివారం విజయనగరంలోని ఆయన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ‘వైసీపీ పాలనలో అప్పటి సీఎం జగన్‌తో పాటు మంత్రులు పథకాల పేరు చెప్పి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాకుండా దోచుకుతిన్నారు. గతంలో దావోస్‌ పర్యటన చేసిన జగన్‌ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో బొత్స చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, పోలవరం, రైల్వేజోన్‌లకు కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. ఈ ఘనత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌దే. చంద్రబాబు దావోస్‌ పర్యటన విజయవంతం అయ్యింది. గూగుల్‌ వంటి ఎన్నో ఇంటర్నేషనల్‌ కంపెనీలు రాష్ట్రా్ట్రనికి క్యూ కడుతున్నాయి. వైసీపీ నేతలు ఏమీ చేయలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక.. అసూయ పడి మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యానారాయణ ఆ శాఖను నిర్వీర్యం చేశారు. 117 జీవోను ప్రవేశపెట్టి ఎన్నో పాఠశాలలు మూతపడేలా చేశారు. ఆయన వలన విద్యాశాఖలో రిజల్ట్స్‌ దారుణంగా పడిపోయాయి. ఇలాంటి వారు విద్యాశాఖ గురించి మాట్లాడటం హాస్యాస్పదం. భోగాపురం ఎయిర్‌ పోర్టు దగ్గర పరిశ్రమలు పెట్టి అభివృద్ది చేస్తామన్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపాలి. ఐదేళ్లలో బీచ్‌రోడ్డు ఎక్కడ వేశారో చెప్పాలి. కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి ఎంతో మేలు కలగనుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమకు సాగు, తాగునీరుకు ఢోకా ఉండదు. ఇకనైనా వైసీపీ నేతలు సత్యదూరమైన వ్యాఖ్యలు మానుకోవాలి.’ అని హితవుపలికారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కొండపల్లి భాస్కరనాయుడు, చప్ప చంద్రశేఖర్‌ తదిరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2025 | 11:14 PM