Share News

Election of MLC: సమస్యలు పరిష్కరించేవారికే పట్టం కడతాం

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:25 AM

Election of MLC:ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం జరగనుంది. 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

Election of MLC: సమస్యలు పరిష్కరించేవారికే పట్టం కడతాం

- రేపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక

- ఉపాధ్యాయ, విద్యా రంగంలో అనేక సమస్యలు

- పరిష్కరించే వారికే ఓటు వేస్తామంటున్న గురువులు

చీపురుపల్లి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం జరగనుంది. 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే, బరిలో ఉన్న అభ్యర్థులకు అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు దడ పుట్టిస్తున్నాయి. సుమారు రెండు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న ప్రధాన సమస్యలపై ఉపాధ్యాయులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ల మాట అలా ఉంచితే, 2004 తరువాత సర్వీసులోకి వచ్చిన వారు, సీపీఎస్‌ వంటి ప్రధాన సమస్యపై ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యల జాబితా ప్రతి ఏడాది చాంతాడంతా పెరిగిపోతుంది. అందుకే ప్రతి అభ్యర్థి కూడా తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల డిమాండ్లతో పాటు విద్యా రంగంలో నెలకొని ఉన్న సమస్యలపై శాసన మండలిలో గళం గట్టిగా వినిపిస్తానని హామీ ఇస్తున్నారు. కొత్తగా ఎన్నికైన వారైనా తమ సమస్యలు పరిష్కరిస్తారనే ఆశాభావంతో ఉపాధ్యాయులు ఉన్నారు.

గత ఐదేళ్లూ కష్టకాలం..

రాష్ట్రంలో గత ఐదేళ్లూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులకు చుక్కలు చూపించింది. లెక్కకు మించిన యాప్‌ల భారాన్ని మోపింది. వారి హక్కులను హరించింది. జీతాలు కూడా సక్రమంగా ఇచ్చేది కాదు. వారు నిరసన వ్యక్తం చేయడానికి కూడా వీలు లేకుండా పలు చట్టాలను ప్రయోగించింది. ఎందరో గురువులపై కేసులు నమోదు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాకా ఉపాధ్యాయులపై పని భారం తగ్గింది. వేతనాలు సక్రమంగా ఇస్తుంది. ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తుందని ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తున్నారు. ఎమ్మెల్సీలుగా గెలిచిన వారు శాసన మండలిలో ఉపాధ్యాయుల సమస్యలను ప్రస్తావించి వదిలే యకుండా వాటి పరిష్కారానికి ప్రభుత్వాన్ని ఒప్పించగలగాలి. అలాంటి అభ్యర్థినే తాము ఎన్నుకుంటామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.


సమస్యలు ఇవే..

  • సీపీఎస్‌ రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

  • 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించాలి. 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి. ఇప్పటిదాకా ఉన్న బకాయిలు చెల్లించాలి.

  • కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని రెగ్యులర్‌ చేయాలి.

  • ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారికి కూడా వేతన చట్టం అమలు చేయాలి. హెల్త్‌ స్కీము అమలు చేయాలి.

  • ఇతర పనుల నుంచి తప్పించి, ఉపాధ్యాయుల్ని కేవలం బోధనకే పరిమితం చేయాలి.

  • ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్ని గతంలో మాదిరిగా కొనసాగించాలి.

  • డిగ్రీ, జూనియర్‌ కాలేజీల్లో జీవో 114ను అమలు చేయాలి.

  • జీఓ నెం.203ను పునరుద్ధరించి, అర్హత కలిగిన ఉపాధ్యాయులకు జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్లుగా నియమించాలి.

  • ఆదర్శ పాఠశాల వ్యవస్థను విద్యా శాఖలో విలీనం చేయాలి. ఆ ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్‌ రూపొందించాలి.

  • కేజీబీవీ ఉపాధ్యాయులకు కనిష్ట టైం స్కేల్‌ను అమలు చేయాలి.

  • వెల్ఫేర్‌ శాఖల పాఠశాలల్లో పని చేస్తున్న వారికి పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలి.

  • పార్ట్‌టైం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.

  • జీవో 117ను రద్దు చేయడానికి అంగీకరించిన ప్రభుత్వం, దానికి అనుబంధంగా ఇచ్చిన మెమోలో కొన్ని సవరణలు చేయాలి. ఆ సవరణల విషయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలి.


22,493 మంది ఓటర్లు..

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికలో 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 31 పోలింగ్‌ స్టేషన్లలో 5,035 మంది, విజయనగరంలో 29 స్టేషన్లలో 5223 మంది, పార్వతీపురం మన్యంలో 15 స్టేషన్లలో 2,333, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 స్టేషన్ల పరిధిలో 1488, విశాఖపట్నంలో 13 పోలింగ్‌ స్టేషన్లలో 5,529, అనకాపల్లి జిల్లాలోని 24 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 2,885 మంది ఓటర్లు నమోదై ఉన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:25 AM