Irrigation Water సాగునీటికి ఎదురుచూపు
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:35 PM
Waiting for Irrigation Water తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని రైతులు రబీ పంటలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి విడుదల ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

గరుగుబిల్లి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని రైతులు రబీ పంటలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగునీటి విడుదల ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలో సుమారు 60 వేల ఎకరాల వరకు భూములున్నాయి. గరుగుబిల్లి, వంగర, పాలకొండ, జియ్యమ్మవలస, వీరఘట్టం, కొత్తూరు మండలాలకు చెందిన రైతులు పెరస, మినుపు, నువ్వులు, వేరుశనగ, కొంత విస్తీర్ణంలో వరి, ఆరుతడి పంటల సాగుకు సమాయాత్తమవుతున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో 20 శాతానికి మించి ఆధునికీకరణ పనులు జరగలేదు. మరోవైపు కాలువ పరిధిలో అధికంగా గండ్లు పడడంతో గత ఏడాది ఖరీఫ్‌లో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్పందించి సకాలంలో సాగునీటిని విడుదల చేస్తే.. రబీ పంటలతో ఖరీఫ్ నష్టాల నుంచి బయటపడొచ్చనే యోచనలో రైతులున్నారు. దీనిపై ఇప్పటికే తోటపల్లి ఆయకట్టు పరిధిలోని నీటి సంఘాల ప్రతినిధులు జిల్లా అధికారులకు వినతులు అందించారు. సాగునీటి సరఫరాతో పాటు కాలువ పరిధిలో మరమ్మతు పనులు కూడా చేపట్టాలని విన్నవించారు. కురుపాం, పాలకొండ శాసనసభ్యులు కూడా చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.