Share News

Vaccination dull కొండ దిగితేనే టీకా

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:07 AM

Vaccination only after coming down the hill

Vaccination dull కొండ దిగితేనే టీకా
టీకా వేయని చిన్నారితో చిన్నాలమ్మ

కొండ దిగితేనే టీకా

గిరిశిఖర గ్రామాల శిశువుల పట్ల నిర్లక్ష్యం

వ్యాధి నిరోధకత లేకే చిన్నారులకు జర్వాలు!

టీకా కార్డులను వారం క్రితం సేకరించి నింపేస్తున్న వైనం

కొండపై ప్రసవాలూ ఎస్‌.కోట ఆసుపత్రిలో జరిగినట్లు నమోదు

ఆ గ్రామాలకు వెళ్లని వైద్యులు

గిరిశిఖర గ్రామాల్లో చిన్నారులకు అన్యాయం జరుగుతోంది. అన్నెం పుణ్యం తెలియని ఆ బాలల భవిష్యత్‌ను అంధకారం చేసే దారుణం కొన్నాళ్లుగా సాగుతోంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల వయసు వరకు వేయాల్సిన టీకాలను వైద్య సిబ్బంది విస్మరిస్తున్నారు. పిల్లలను కొండ దిగువకు తీసుకువెళ్లగలిగితే టీకా వేస్తున్నారు. లేకుంటే అంతే. పైగా అందరికీ టీకా వేసినట్లు కార్డుల్లో నమోదు చేస్తున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు కనీసం పర్యవేక్షించక పోవడంతో సిబ్బంది గిరి బాలల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. కొండపై జరిగిన ప్రసవాలు కూడా ఎస్‌.కోట ఆసుపత్రిలో జరిగినట్లు నమోదు చేస్తున్నారు.

శృంగవరపుకోట రూరల్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి):

అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల వరకు వివిధ దశల్లో టీకాలు అందివ్వడం తప్పనిసరి. వారిలో వ్యాధినిరోధకత పెంచడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా టీకాలు అమలు చేస్తున్నాయి. ఈ తంతు గిరిశిఖర పంచాయతీ దారపర్తిలో సరిగా అమలు కావడం లేదు. కొట్టాం పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం చూపడం తాజాగా వెలుగుచూసింది. దారపర్తి పంచాయతీ పల్లపుదుంగాడకు చెందిన జన్ని చిన్నాలమ్మ, సోమయ్యకు ఇద్దరు పిల్లలు ఒకరికి మూడేళ్లు.. ఇంకొకరికి పదినెలలు. వీరిద్దరికీ ఒక్కసారే టీకా వేశారు. చిన్నాలమ్మ గర్భందాల్చినప్పటి నుంచి ఇప్పటివరకు టీకా కార్డు గురించి తెలియదు. వారి దగ్గర ఎలాంటి కార్డు లేదు.

- రాయిపాలెంకు చెందిన జమ్మలమ్మకు రేండేళ్ల పాప సుకన్య ఉంది. ఇంటి వద్దే ప్రసవించింది. ఈమెకు ఇచ్చిన కార్డులో మాత్రం ఆసుపత్రిలో అని ఉంది. ఇదే గ్రామానికి చెందిన పోతురాజు భార్య పదినెలల క్రితం ఇంటివద్ద పాపను ప్రసవించింది. రికార్డులో ఎస్‌.కోటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పుట్టినట్లు వైద్యురాలు నమోదుచేశారు. వీరిద్దరికీ టీకాలు ఎన్నిసార్లు వేశారో తల్లిదండ్రులకు తెలియదు. వీరికి ఇచ్చిన కార్డుల్లో ఏ వివరాలూ లేవు.

- దారపర్తి పంచాయతీ పోర్లు గ్రామంలో చిన్నాలమ్మ 18నెలల క్రితం ఎస్‌.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో పాపను ప్రసవించింది. అప్పుడే చిన్నారికి టీకా వేశారు. ఇప్పటివరకు మరేటీకా వేయలేదు. టీకా వేయలని కోరితే తాము కొండపైకి రాలేమని, కొండ దిగువన వున్న దబ్బగుంట గ్రామానికి వస్తే వేస్తామని వైద్యసిబ్బంది చెప్పడంతో అంత దూరం చిన్నారితో వెళ్లలేక టీకాలు వేయించలేదని తెలిపింది.

వెలుగుచూసిందిలా..

కొండపై వున్న చాలామంది గిరిజన మహిళలకు ఇళ్లవద్ద ప్రసవాలయ్యాయి. ఆ పిల్లలకు పూర్తిస్థాయిలో టీకాలు వేయలేదు. ఈ విషయాన్ని వరల్ట్‌హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఎస్‌ఎంవో జాన్‌ తన పరిశీనలలో గుర్తించారు. కొద్దిరోజుల క్రితం గిరిశిఖర గ్రామాల్లో విషజ్వరాలు వచ్చి చిన్నారులు బాధపడుతున్నారని ‘అంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. దీనిపై సమగ్రంగా తెలుసుకునేందుకు వైద్యశాఖ అధికారులు కొన్ని గిరిశిఖర గ్రామాల్లో పర్యటించారు. వారి వెంట జాన్‌ కూడా ఉన్నారు. గిరిజనులతో మాట్లాడి టీకాలు వేయని విషయం తెలుసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక కూడా పంపారు. దీంతో అప్రమత్తమైన వైద్యశాఖ ఉద్యోగులు గిరిశిఖర గ్రామాల్లోని గర్భిణులు, బాలింతలు, శిశువులకు అందించిన (ఎంసీపీ)కార్డులను ఆశాకార్యకర్తలు, ఏఎన్‌ఎంల చేత సేకరించారు. ఇప్పుడు వాటిలో వివరాలు నమోదు చేసే పనిలో ఉన్నారని తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.

కొట్టాం పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం

కొట్టాం పీహెచ్‌సీ వైద్యులు.. సిబ్బంది తీరుపై అనేక విమర్శలు విన్పిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఏనాడు ఈశాఖపై కనీస పర్యవేక్షణ లేకపోవడంతో వీరు ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగినట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది అప్పుడప్పుడు గిరి శిఖర గ్రామాలను పలకరిస్తున్నారు కానీ వైద్యులు వారివైపే చూడడం లేదు. గత ప్రభుత్వంలో సరైన వైద్యసేవలు అందక బాలింత, శిశువులు చనిపోయిన ఘటనపై ఎటువంటి విచారణ లేకపోయిందని పలువురు గిరిజనులు వాపోయారు.

కొండ శిఖర గ్రామాల్లో జ్వరాలు

కొండ శిఖర గ్రామాల గిరిజన చిన్నారులకు ర్యాష్‌లతో కూడిన విష జ్వరాలు ఇటీవల వెలుగుచూశాయి. ఒకేసారి ఎక్కువ మంది జ్వరాల బారిన పడ్డారు. అధికంగా ఐదేళ్లలోపు చిన్నారులకు జ్వరాలు ప్రబలాయి. ఈ ఘటనలతో పిల్లలకు టీకాలు వేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చునన్న సందేహాలను గిరిజనులు వ్యక్తం చేస్తున్నారు. పైగా పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండడం లేదని తెలిసింది. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఓ అధికారి ఎప్పుడూ గిరి శిఖర గ్రామాలకు వెళ్లినట్లు చూడలేదని స్థానికులు చెబుతున్నారు.

డీఐవోతో విచారణకు ఆదేశిస్తా

గిరిశిఖర గ్రామాల్లో చిన్నారులకు టీకా కార్యక్రమం సక్రమంగా జరగడం లేదన్న విషయం నా దృష్టికి రాలేదు. అక్కడ వ్యాపిస్తున్న జ్వరాలు, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తున్నాం.నేను కూడా వచ్చి పరిశీలిస్తున్నాను. టీకాల అంశం చాల సున్నితమైంది. దీనిపై డీఐవోతో విచారణకు ఆదేశిస్తాను.

జీవనరాణి, డీఎంహెచ్‌వో

Updated Date - Mar 07 , 2025 | 12:07 AM