elephants: వదలని ఏనుగులు
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:04 AM
elephants: మన్యం జిల్లాను ఏనుగులు వదలడం లేదు. ఏదో ఒక గ్రామంలో అలజడి సృష్టిస్తూనే ఉన్నాయి.

- సీతంపేటలో కర్బూజ పంట నాశనం
- లబోదిబోమంటున్న రైతులు
- కాపాడాలంటూ ఫారెస్టు రేంజర్‌కు ఫిర్యాదు
కురుపాం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లాను ఏనుగులు వదలడం లేదు. ఏదో ఒక గ్రామంలో అలజడి సృష్టిస్తూనే ఉన్నాయి. బుధవారం రాత్రి కురుపాం పంచాయతీ సీతంపేటలో మూడు ఎకరాల కర్బూజ పంటను నాశనం చేశాయి. 15 రోజుల్లో చేతికందాల్సిన పంటను ఏనుగులు తినేశాయంటూ రైతు గుండ్రెరెడ్డి రామకృష్ణ లబోదిబోమంటున్నాడు. మంగళవారం రాత్రి పాలేం గ్రామంలో పామాయిల్ మొక్కలను నాశనం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొమరాడ, కురుపాం మండలాల రైతాంగాన్ని గజరాజులు వణికిస్తున్నాయి. ఏ క్షణంలో ఏమి చేస్తాయో అని వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. గురువారం కిచ్చాడ, పులిగుమ్మి ప్రాంతాల్లో తిష్ఠవేశాయి. దీనిపై ఇప్పటికే రైతులు స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరిని కలిసి ఏనుగుల నుంచి కాపాడాలని, పంటలకు నష్ట పరిహారం ఇప్పించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. గురువారం కురుపాం ఫారెస్టు రేంజి అధికారి గంగరాజులును కలిసి ఏనుగుల నుంచి తమను రక్షణ కల్పించాలని కోరారు. వాటిని ఇక్కడ నుంచి తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏనుగుల కోసం పార్వతీపురం సమీపంలోని గుచ్చిమి వద్ద 200 ఎకరాల్లో ఎలిఫేంట్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటక నుంచి కుంకి ఏనుగును తెప్పించి ఈ ఏనుగులను మచ్చిక చేసుకోవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. కూటమి ప్రభుత్వ వచ్చిన నుంచి నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు.